భారతదేశ బడ్జెట్ చరిత్ర.. ఆసక్తికర విషయాలు మీకోసం..
ABN , Publish Date - Jan 30 , 2026 | 02:03 PM
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డును సృష్టించేందుకు సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 1 బడ్జెట్‌తో వరుసగా 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా గుర్తింపు సొంతం చేసుకోనున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 1న ఆమె పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ వరుసగా ప్రవేశపెట్టనున్న 9వ బడ్జెట్ ఇది. పార్లమెంటులో 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డు మాజీ మంత్రి పి.చిదంబరం సొంతం. 1996లో అప్పటి ప్రధాని హెచ్‌డీ దేవగౌడ సారథ్యంలో మంత్రి చిదంబరం తొలిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆ తరువాత 1997లో రెండోసారి, 2004-08 మధ్య కాలంలో వరుసగా ఐదు సార్లు, 2013, 2014ల్లో మరో రెండు సార్లు ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక లోక్‌సభలో అత్యంత సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేసిన మంత్రిగా నిర్మలా సీతారామన్ ఇప్పటికే అరుదైన గుర్తింపును సొంతం చేసుకున్నారు (Finance Minister Nirmala Sitharaman To Set New Record).
బడ్జెట్ చరిత్ర.. ఆసక్తికర విషయాలు
👉 భారత్‌కు సంబంధించిన తొలి బడ్జెట్‌ను 1860లో అప్పటి ఆర్థిక మంత్రి జేమ్స్ విల్సన్ ప్రవేశపెట్టారు. భారత మండలి సభ్యుడిగా ఆయన ఈ బడ్జెట్‌ను తీసుకొచ్చారు. 1857 సిపాయి తిరుగుబాటు అనంతరం, భారత ఆర్థిక వ్యవస్థలో సంస్కరణల పేరిట వలసపాలకులు ఈ బడ్జెట్‌ను తీసుకొచ్చారు.
👉 ఇక స్వాతంత్ర్యానంతరం, 1947 నవంబర్ 26న భారత దేశ ఆర్థిక మంత్రి ఆర్‌కే షణ్ముఖం చెట్టి తొలి బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు.
👉 అత్యధిక సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రికార్డును మాజీ ప్రధాని మోరార్జీ దేశాయ్ సొంతం చేసుకున్నారు. మొత్తం 10 బడ్జెట్‌లను ఆయన పార్లమెంటు ముందుకు తెచ్చారు. 1959-64 మధ్యకాలంలో ఆర్థిక మంత్రిగా ఆరు సార్లు, ఆ తరువాత 1967-1969 మధ్య మరో నాలుగు సార్లు ప్రవేశపెట్టారు.
👉 ఇక ప్రణబ్ ముఖర్జీ కూడా వివిధ సందర్భాల్లో మొత్తం 8 బడ్జెట్‌లను ప్రవేశపెట్టారు. 1982-84 మధ్యకాలంలో వరుసగా మూడు సార్లు, ఆ తరువాత 2009-12 మధ్య వరుసగా ఐదు సార్లు బడ్జెట్‌ను (మధ్యంతర బడ్జెట్ సహా..) తీసుకొచ్చారు.
👉 ఇక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వరుసగా ఐదు సార్లు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
👉 అత్యంత సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేసిన వ్యక్తిగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డును సొంతం చేసుకున్నారు. 2020 ఫిబ్రవరి 1న బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఏకంగా 2 గంటల 40 నిమిషాల పాటు ఆమె ప్రసంగించారు. చివరకు ఇంకా రెండు పేజీల వివరాలు మిగిలుండగానే నాడు ఆమె తన ప్రసంగాన్ని ముగించారు.
👉 భారత దేశ చరిత్రలో అతి తక్కువ సమయంలో బడ్జెట్ ప్రసంగాన్ని ముగించిన మంత్రిగా హీరూభాయ్ పటేల్ అరుదైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. 1977లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆయన తన ప్రసంగాన్ని 800 పదాలతోనే ముగించారు.
👉 1999 వరకూ భారత బడ్జెట్‌ను ఫిబ్రవరి చివరి రోజున సాయంత్రం 5 గంటల సమయంలో ఆర్థిక మంత్రులు ప్రవేశపెట్టేవారు. బ్రిటిష్ కాలమానానికి అనుగుణంగా ఇలా చేసేవారు. అయితే, ఈ ఆనవాయితీకి స్వస్తి చెప్పిన అప్పటి ఆర్థికమంత్రి యశ్వంత్ సిన్హా బడ్జెట్ ప్రవేశపెట్టే సమయాన్ని ఉదయం 11.00 గంటలకు మార్చారు.
👉 ఇక 2017లో ప్రభుత్వం బడ్జెట్ తేదీని ఫిబ్రవరి నెల చివరి నుంచి ఒకటవ తారీఖుకు మార్చింది. మార్చ్ నెలాఖరు నాటికి పార్లమెంటు ఆమోదం పొందేందుకు వీలుగా ఈ మార్పు చేసింది.
ఇవీ చదవండి:
వామ్మో.. 65 ఏళ్లుగా ఒకే సంస్థలో మేనేజర్‌గా మహిళ! వైరల్ వీడియో!
2032లో చంద్రుడిని గ్రహశకలం ఢీకొట్టనుందా?