2032లో చంద్రుడిని గ్రహశకలం ఢీకొట్టనుందా?
ABN , Publish Date - Jan 28 , 2026 | 07:27 PM
2032లో చంద్రుడిని గ్రహశకలం ఢీకొట్టే ఛాన్సుందా అంటే అవుననే అంటున్నారు. మరి ఇదే జరిగితే ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఓ గ్రహశకలాన్ని నిశితంగా గమనిస్తున్నారు. అది చంద్రుడిని ఢీకొట్టనుందా? ఈ ముప్పును తప్పించే మార్గం ఉందా? అనే దిశలో సమాలోచనలు జరుపుతున్నారు. ప్రస్తుతం ఖగోళ శాస్త్రజ్ఞుల దృష్టి 2024 వైఆర్4 అనే గ్రహశకలంపై నెలకొని ఉంది. ఇది చంద్రుడిని ఢీకొట్టే అవకాశం నాలుగు శాతమని శాస్త్రవేత్తలు ఇప్పటికే లెక్కగట్టారు. ఇదే జరిగితే తలెత్తే పరిణామాలపై సింగువా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ పరిశోధన పత్రాన్ని కూడా ప్రచురించారు (Asteroid 2024 YR4 Colliding With Moon).
శాస్త్రవేత్తల ప్రకారం, ఈ గ్రహశకలం ఢీకొడితే భారీ విస్ఫోటనం జరుగుతుంది. హిరోషిమా అణుబాంబుకు 400 రెట్ల శక్తి విడుదల అవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఫలితంగా చంద్రుడిపై కిలోమీటరు వ్యాసార్థంలో భారీ గొయ్యి ఏర్పడుతుంది. రెక్టర్ స్కేలుపై 5 తీవ్రతతో చంద్రుడి ఉపరితలం కంపిస్తుంది. ఈ విస్ఫోటనం కారణంగా ఎగసి పడే దుమ్మూధూళీ భూవాతావరణంలోకి కూడా ప్రవేశిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఫలితంగా భూమిపై కొన్ని చోట్ల ఉల్కాపాతం కనిపిస్తుందని, మరికొన్ని చోట్ల ఉల్కలు ఇక్కడి నిర్మాణాలను ఢీకొని ఆస్తి నష్టం కలుగజేస్తాయని చెబుతున్నారు. వీటితో శాటిలైట్స్ కూడా ధ్వంసమై ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్, నావిగేషన్ వ్యవస్థలు స్తంభించే అవకాశం ఉందని కూడా అంటున్నారు. అయితే, చంద్రుడి ఆవిర్భావానికి సంబంధించిన రహస్యాలను ఛేదించేందుకు ఇదో అద్భుత అవకాశంగా మారొచ్చని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ ముప్పు దృష్ట్యా వివిధ దేశాల అంతరిక్ష పరిశోధన సంస్థలు ఈ గ్రహశకలం గమనంపై దృష్టి పెట్టాయి. చంద్రుడివైపు దూసుకొస్తున్న గ్రహశకలం దారి మళ్లించాల్సిన అవసరం ఉందా? ఏదైనా కొత్త మిషన్‌కు సిద్ధం కావాలా? అనే కోణాల్లో సమాలోచనలు జరుపుతున్నాయి.
ఇవీ చదవండి
మాకూ హెల్ప్ చేయండి! సుందర్ పిచాయ్‌కు భారతీయ విద్యార్థుల రిక్వెస్ట్
బీటెక్‌లో 17 బ్యాక్‌లాగ్స్.. అయినా వెనక్కు తగ్గలేదు.. ఐదేళ్లు గడిచేసరికి రూ.1.7 కోట్ల శాలరీ