మాకూ హెల్ప్ చేయండి! సుందర్ పిచాయ్‌కు భారతీయ విద్యార్థుల రిక్వెస్ట్
ABN , Publish Date - Jan 23 , 2026 | 12:12 PM
ఇటీవల గూగుల్ సంస్థ జెమినై యాప్ ద్వారా ఉచిత ఎస్ఏటీ ప్రాక్టీస్ పరీక్షలను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. దీంతో, ఐఐటీ జేఈఈ, నీట్ వంటి పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికీ ఇలాంటి ఫీచర్ అందుబాటులోకి తేవాలని భారతీయ విద్యార్థులు నెట్టింట అభ్యర్థించారు.
ఇంటర్నెట్ డెస్క్: టెక్ కంపెనీలు తమ ఏఐ సేవలను వేగంగా విస్తరిస్తున్నాయి. ఇటీవలే ఓపెన్ ఏఐ సంస్థ అమెరికాలో వైద్య సలహాల కోసం ‘చాట్‌జీపీటీ హెల్త్’ను ప్రవేశపెట్టింది. తానూ తగ్గేదేలేదంటున్న గూగుల్ తాజాగా ఏఐ ఆధారిత ఉచిత టెస్టు ప్రిపరేషన్‌కు తెరతీసింది. తన ఏఐ చాట్‌బాట్ జెమినై ద్వారా ఎస్ఏటీ పరీక్షకు సంబంధించిన ఉచిత మాక్ టెస్టులు పొందొచ్చని ఆల్ఫ్‌బెట్ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ తాజాగా ఎక్స్ వేదికగా వెల్లడించారు (Free SAT Prep on Gemini App).
విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరమని సుందర్ పిచాయ్ తెలిపారు. టెస్టులకు సన్నద్ధమయ్యే వారికి జెమినై యాప్‌తో మంచి ప్రాక్టీస్ లభిస్తుందని తెలిపారు. ప్రిన్స్టన్రివ్యూ సౌజన్యంతో ప్రవేశపెట్టిన ఈ మాక్ ఎగ్జామ్స్ ఎంతో ప్రయోజనకరమని తెలిపారు. విద్యార్థులకు ఫీడ్ బ్యాక్ కూడా తక్షణం లభిస్తుందని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని టెస్టులు అందుబాటులోకి వస్తాయని కూడా చెప్పారు.
ఈ పోస్టు చూస్తుండగానే తెగ వైరల్ అయ్యింది. భారతీయుల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. జాతీయ స్థాయిలో అనేక కఠిన ఎంట్రన్స్ పరీక్షలు రాసే విద్యార్థులు పెద్ద ఎత్తున స్పందించారు. నీట్, యూజీ, పీజీ, జేఈఈ వంటి పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికీ ప్రయోజనం చేకూర్చే ఫీచర్ తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. కాగా, జెమినై యాప్‌తో పైసా ఖర్చు లేకుండా మాక్ ఎస్ఏటీ పరీక్ష రాయొచ్చని గూగుల్ అంతకుముందు ఓ ప్రకటనలో తెలిపింది.
ఏఐతో ఉద్యోగాలు పోతాయన్న భయం నానాటికీ పెరుగుతున్న విషయం తెలిసిందే. పలు కార్పొరేట్ కంపెనీలు భారీ స్థాయిలో లేఆఫ్స్‌కు సిద్ధం కావడంతో ఈ ఆందోళన అంతకంతకూ పెరుగుతోంది. విద్యావంతులు చేసే వైట్ కాలర్ ఉద్యోగాలేవీ భవిష్యత్తులో ఉండవన్న అంచనాలూ ఉన్నాయి. అయితే, ఏఐ వేళ్లూనుకున్నాక జనాలకు ఉద్యోగాలు చేయాల్సిన అగత్యమే ఉండదని ఎలాన్ మస్క్ వంటి వారు చెబుతున్నారు.
ఇవీ చదవండి:
తెలంగాణ ఇంటర్మీడియట్.. వచ్చే ఏడాది ఇంటర్ ఫస్టియర్‌కు కొత్త సిలబస్
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు.. 5 నిమిషాలు ఆలస్యమైనా ఓకే