ఏఐఏడీఎంకేలో ముదురుతున్న తిరుగుబాటు.. ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా
ABN , Publish Date - May 25 , 2026 | 04:55 PM
తమిళనాడులో రాజకీయం మరోసారి వేడెక్కింది. ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వీరంతా టీవీకే పార్టీలో చేరే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్: తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం(AIADMK)కు సోమవారం భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. అసెంబ్లీ స్పీకర్ జేసీడీ.ప్రభాకర్‌ను కలిసి తమ రాజీనామా పత్రాలను అందజేశారు. వారిలో కె.మరగతం కుమరవేల్, ఎస్.జయకుమార్, పి.సత్యభామ ఉన్నారు. వారు త్వరలోనే సీఎం జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం(TVK) పార్టీలో చేరే అవకాశమున్నట్టు తమిళ రాజకీయాల్లో చర్చ జోరందుకుంది.
మదురాంతకం నియోజకవర్గం నుంచి గెలిచిన మరగతం కుమరవేల్, పెరుందరై ఎమ్మెల్యే జయకుమార్, ధారాపురం ఎమ్మెల్యే సత్యభామ రాజీనామా చేయడం AIADMKలో అంతర్గత సంక్షోభాన్ని మరింత బహిర్గతం చేసింది. ఇటీవల జరిగిన విశ్వాస పరీక్షలో ఈ ముగ్గురు సహా మొత్తం 25 మంది AIADMK రెబల్ ఎమ్మెల్యేలు టీవీకే విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటువేసిన విషయం తెలిసిందే. దీంతో పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి.. వారిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టి పార్టీ నుంచి బహిష్కరించారు.
అయితే.. తాజా పరిణామం విజయ్ ప్రభుత్వానికి మరింత బలం చేకూర్చే అవకాశముంది. మరోవైపు AIADMKలో నాయకత్వ సంక్షోభం మరింత ముదురుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఇవీ చదవండి:
బహిరంగ నమాజ్, జంతుబలి నిషేధం.. సీఎం యోగి కీలక ఆదేశాలు
ఎన్‌టీఏ గుణపాఠం నేర్వకపోవడం విచారకరం.. 'నీట్' లీక్ కేసుపై సుప్రీం కోర్టు