Share News

ఎన్‌టీఏ గుణపాఠం నేర్వకపోవడం విచారకరం.. 'నీట్' లీక్ కేసుపై సుప్రీం కోర్టు

ABN , Publish Date - May 25 , 2026 | 01:16 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ లీక్ కేసుపై అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. గత వైఫల్యాల నుంచి గుణపాఠం నేర్వకపోవడంపై ఎన్‌టీఏ తీరును తప్పుపట్టింది.

ఎన్‌టీఏ గుణపాఠం నేర్వకపోవడం విచారకరం.. 'నీట్' లీక్ కేసుపై సుప్రీం కోర్టు

ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ యూజీ-2026 ప్రశ్నపత్రం లీక్ కేసుపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ)ని మందలించింది. నీట్ సహా ఇతర ప్రవేశ పరీక్షలను నిర్వహించే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్‌టీఏకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. గతంలో జరిగిన నీట్ ప్రశ్నపత్రం లీక్ కేసుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి గుణపాఠం నేర్చుకోకపోవడం విచారకరమని పేర్కొంది. ఈ విషయంలో కేంద్రం, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. గతంలో తాము ఏర్పాటుచేసిన పర్యవేక్షణ, సంస్కరణ యంత్రాంగాలను ప్రస్తావిస్తూ.. వాటి అమలు ఏమైందో తెలియజేయాలని కూడా ఎన్‌టీఏను కోరింది.


నీట్‌ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం లీక్ కావడంపై ఎన్‌టీఏకు వ్యతిరేకంగా ఫెడరేషన్‌ ఆఫ్ ఆల్‌ ఇండియా మెడికల్‌ అసోసియేషన్‌(FAIMA) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై సోమవారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఎన్‌టీఏ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. 'గత వైఫల్యాల నుంచి ఎన్‌టీఏ ఎలాంటి గుణపాఠాలు నేర్వకపోవడం విచారకరం. ఈ అంశం గతంలోనూ న్యాయస్థానం దృష్టికి వచ్చింది. దీని కోసం నవంబర్ 14న ఓ పర్యవేక్షణ కమిటీని ఏర్పాటుచేశాం. ఆ కమిటీ కొన్ని ప్రతిపాదనలు చేయగా.. వాటిని ఎన్‌టీఏ అంగీకరించింది. అయితే.. వాటిని అమలు చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టిందో మేం తెలుసుకోవాలనుకుంటున్నాం. ఆ వివరాలకు సంబంధించి అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు మూడు రోజుల గడువు విధిస్తున్నాం' అని ధర్మాసనం ఎన్‌టీఏను ఆదేశించింది.

కాగా.. పిటిషనర్ల తరఫున అడ్వకేట్ తన్వి దూబె తన వాదనలను వినిపించారు. నీట్ యూజీ పరీక్ష ఆవశ్యకతను వివరిస్తూ.. ఈ అంశం సుమారు 23 లక్షల మంది అభ్యర్థుల భవితవ్యంపై ఆధారపడిందని ప్రస్తావించారు.


ఇవీ చదవండి:

15 ఏళ్లకు పెళ్లి.. 22 ఏళ్లకు ఐదుగురు పిల్లలు.. మరో మగబిడ్డ కావాలని..

నదీ లోయలోకి దూసుకెళ్లిన స్కార్పియో వాహనం.. 8 మంది దుర్మరణం

Updated Date - May 25 , 2026 | 01:23 PM