సీజేపీకి వ్యతిరేకంగా లాల్ హిట్ జనతా పార్టీ
ABN , Publish Date - Oct 18 , 2026 | 09:50 PM
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)కి వ్యతిరేకంగా కొత్త పార్టీ ఆవిర్భవించింది. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ పేరుతో ఆ పార్టీని ఆదివారం ఢిల్లీలోని మాలవీయ భవన్లో లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మొదటిసారిగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఇంటర్నెట్ డెస్క్: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)కి వ్యతిరేకంగా కొత్త పార్టీ ఆవిర్భవించింది. ‘లాల్ హిట్ జనతా పార్టీ(ఎల్హెచ్పీ)’ పేరుతో ఆ పార్టీని ఆదివారం ఢిల్లీలోని మాలవీయ భవన్లో లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మొదటిసారిగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత ఆ పార్టీ చీఫ్ అయాన్ భట్నాగర్ మాట్లాడారు. సీజేపీ, కాంగ్రెస్కు వ్యతిరేకంగా విమర్శలు చేశారు. ఇటీవలే దేశంలో జరిగిన ప్రదర్శనలు రాజ్యాంగబద్ధ వ్యవస్థలను ప్రశ్నించాయని, అంతేకాకుండా ఢిల్లీలో వ్యాపారులకు నష్టం కలిగించాయని ఆరోపించారు. త్వరలో తమ కార్యాచరణను వెల్లడిస్తామని చెప్పారు. తక్కువ సమయంలో ఎక్కువ మందిని సమీకరించడానికి ఈ సమావేశం నిర్వహించామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇస్తే, ఎంత మంది జనం వస్తారోనని ఊహించడానికే ఆశ్చర్యంగా ఉందన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరాను మనం నిర్వహించుకుంటామన్నారు.
ప్రజలు సోషల్ మీడియాకే పరిమితం కాకుండా వీధుల్లోకి వెళ్లి నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అయాన్ తన ప్రసంగంలో నిరసనకారులను ఉద్దేశిస్తూ కీటకాలు, బొద్దింకలు వంటి జీవుల వంటి పదాలను ఉపయోగించారు. దసరా నుంచి దీపావళి వరకు దేశవ్యాప్తంగా వ్యాపారులకు అత్యంత ఎక్కువ వ్యాపారం జరిగే కాలమని ఆయన పేర్కొన్నారు. అలాంటి సమయంలో ఢిల్లీలోని కన్నౌట్ ప్లేస్ వంటి ప్రధాన వాణిజ్య ప్రాంతంలో ప్రదర్శనలు నిర్వహించి వ్యాపారులకు సీజేపీ నేతలు ఆటంకం కలిగించారని ఆయన మండిపడ్డారు. ఢిల్లీ సహా పలు మహానగరాల్లో నిరసనకారులు కార్యకలాపాలకు అంతరాయం కలిగించేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు.
నిరసనలతో పాలన మారుతుందా?
న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పాలన మార్పు గురించి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ నిరసనల ద్వారా ప్రభుత్వాన్ని ఎలా మార్చగలరని అయాన్ భట్నాగర్ ప్రశ్నించారు. ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించడం, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేయడం రాజ్యాంగ సంస్థలపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీయడమే అని ఆయన అన్నారు. నేడు సీజేపీ నేతలు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామాను కోరుతున్నారని, రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజీనామాను కూడా డిమాండ్ చేస్తారని భట్నాగర్ పేర్కొన్నారు. 50 వేల మంది ఒకచోట గుమిగూడినంత మాత్రాన, ఒక వర్గం చేస్తున్న డిమాండ్లను అంగీకరించలేమన్నారు. తమ లక్ష్యం ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే అని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మున్సిపల్ ఎన్నికలు.. మేయర్ అభ్యర్థులపై ఉత్కంఠ.. సీఎం నిర్ణయంపై ఆసక్తి
రాయచోటి, పుంగనూరు ఘటనలపై నివేదిక కోరాం.. చర్యలు తీసుకుంటాం: ఏపీ ఎస్ఈసీ