సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూత..
ABN , Publish Date - Oct 08 , 2026 | 07:49 AM
బాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు నానా పటేకర్ (75) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నానా పటేకర్ మృతితో హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమల్లో విషాదం నెలకొంది.
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు నానా పటేకర్ (75) కన్నుమూశారు. గోవాలోని దోనా పౌలా ప్రాంతంలోని తన నివాసంలో ఆయన స్పృహ తప్పి పడిపోయినట్లు సమాచారం. వెంటనే కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆయనను ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు సుమారు 45 నిమిషాల పాటు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే చికిత్సకు స్పందించకపోవడంతో ఉదయం 5:20 గంటలకు ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. గుండెపోటు కారణంగా ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నానా పటేకర్ మృతితో హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమల్లో విషాదం నెలకొంది. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
సుమారు నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన సినీ ప్రయాణంలో నానా పటేకర్ తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1978లో వచ్చిన ‘గమన్’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఆయన.. అనంతరం హిందీ, మరాఠీ భాషల్లో అనేక విభిన్న పాత్రల్లో నటించారు. ‘పరిందా’, ‘అగ్ని సాక్షి’, ‘అబ్ తక్ చప్పన్’, ‘వెల్కమ్’, ‘రాజ్‌నీతి’, ‘ది వ్యాక్సిన్ వార్’ వంటి చిత్రాలు ఆయన కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచాయి. రజినీకాంత్ నటించిన ‘కాలా’ చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించారు. అయితే.. నానా పటేకర్ ‘క్రాంతివీర్’, ‘నటసామ్రాట్’ చిత్రాలతో నటుడిగా విశేష గుర్తింపు పొందారు. ‘క్రాంతివీర్’ చిత్రంలోని అద్భుత నటనకు ఆయన ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డు అందుకున్నారు. సుమారు 70కి పైగా సినిమాల్లో నటించిన నానా పటేకర్ హిందీ, మరాఠీ చిత్రాలతో పాటు ఇతర భాషల ప్రేక్షకులకు కూడా సుపరిచితులు.
నటుడిగానే కాకుండా దర్శకుడు, రచయితగానూ తన ప్రతిభను చాటుకున్న నానా పటేకర్‌కు జాతీయ చలనచిత్ర అవార్డులు సహా పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు లభించాయి. 2013లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో సత్కరించింది. సినిమాలతో పాటు దేశ సేవలోనూ నానా పటేకర్ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను పొందారు. అలాగే రైతుల సంక్షేమం కోసం సామాజిక సేవా సంస్థ ‘నామ్ ఫౌండేషన్’ను స్థాపించి.. రైతు కుటుంబాలకు అండగా నిలిచారు. నటుడిగా మాత్రమే కాకుండా సామాజిక సేవకుడిగానూ తనదైన ముద్ర వేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎర్రవల్లిలో ఆ భూముల లెక్కలు తేల్చండి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
కేంద్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. ITLA, SME ఫండ్స్‌కు గ్రీన్‌సిగ్నల్
మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం యువత ముందుకు రావాలి: గవర్నర్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News