అంతరిక్ష కేంద్రంలో అత్యంత అరుదైన పాస్‌పోర్ట్ స్టాంప్
ABN , Publish Date - Oct 07 , 2026 | 09:55 PM
ఈ స్టాంప్ కావాలంటే గంటకు 28 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి ఐఎస్ఎస్ చేరుకోవాలి. అక్కడ ఇమ్మిగ్రేషన్ క్యూ లాంటిదేమీ ఉండదు. అలాగే వీసా కూడా అవసరం లేదు.
ఇంటర్నెట్ డెస్క్: అత్యంత అరుదైన పాస్‌పోర్ట్ స్టాంప్ ఎక్కడుందో తెలుసా? అది భూమికి 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. గత సంవత్సరం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని (ఐఎస్ఎస్) సందర్శించిన వ్యోమగామి శుభాంశు శుక్లా చెబుతున్నారీ మాట. ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఆయన అత్యంత అరుదైన పాస్‌పోర్ట్ స్టాంప్ గురించి వివరించారు.
అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించే వారికి ఇచ్చే స్టాంపే అత్యంత అరుదైన పాస్‌పోర్ట్ స్టాంప్ అని శుభాంశు శుక్లా చెప్పారు. ఐఎస్ఎస్ సందర్శకులకు గుర్తుగా పాస్‌పోర్ట్‌లో ఈ ముద్ర వేస్తారని ఆయన తెలిపారు. ఈ స్టాంప్ కావాలంటే గంటకు 28 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి ఐఎస్ఎస్ చేరుకోవాలనన్నారు. అక్కడ ఇమ్మిగ్రేషన్ క్యూ లాంటిదేమీ ఉండదన్నారు. అలాగే వీసా కూడా అవసరం లేదన్నారు. ఆ ప్రదేశం ఏ దేశం కిందకీ రాదని వివరించారు.
అక్కడికి వెళ్తే ఒక్కరోజులో 16 సూర్యోదయాలు చూడొచ్చని, సరిహద్దులనేవి అసలు కనిపించవని శుభాంశు శుక్లా పేర్కొన్నారు. అలాంటి అద్భుతమైన, అరుదైన ప్రదేశాన్ని ఇప్పటివరకు 300 కన్నా తక్కువ మంది సందర్శించారని చెప్పారు. అయితే ఈ పోస్టు చూస్తున్న నెటిజన్లు మైమరిచిపోతున్నారు. తామూ అంతరిక్ష కేంద్రానికి వెళ్లాలని ఆరాటపడుతున్నారు.
ఈ వార్తలూ చదవండి
ఆదికైలాస్‌లో ‘వైట్ ట్రాఫిక్ జామ్’.. 2 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు..
‘స్పై మ్యూజియం’...అన్నీ ఆశ్చర్యాలే!