ఆదికైలాస్‌లో ‘వైట్ ట్రాఫిక్ జామ్’.. 2 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు..
ABN , Publish Date - Oct 06 , 2026 | 07:47 PM
హిమాలయాల అందాలను వీక్షించేందుకు ఆదికైలాస్‌కు వెళ్లిన పర్యాటకులకు ఊహించని ఇబ్బందులు ఎదురయ్యాయి. గత వారం భారీగా కురిసిన మంచుతో రహదారులు ఇరుకుగా మారి ఆదికైలాస్ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
పితోరాగఢ్: హిమాలయాల అందాలను వీక్షించేందుకు ఆదికైలాస్‌కు వెళ్లిన పర్యాటకులకు ఊహించని ఇబ్బందులు ఎదురయ్యాయి. గత వారం భారీగా కురిసిన మంచుతో రహదారులు ఇరుకుగా మారి ఆదికైలాస్ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సముద్రమట్టానికి సుమారు 14,500 అడుగుల ఎత్తులో ఏర్పడిన ఈ ‘వైట్ ట్రాఫిక్ జామ్’లో వందలాది మంది పర్యాటకులు, యాత్రికులు గంటల తరబడి చిక్కుకుపోయారు. ఈ ట్రాఫిక్ జామ్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భారీగా మంచు కురుస్తున్న సమయంలో రోడ్డుపై కార్లు, ఇతర వాహనాలు బారులు తీరిన దృశ్యాలు వీడియోల్లో కనిపిస్తున్నాయి.
ఉత్తరాఖండ్‌లోని ఎత్తైన ప్రాంతాల్లో సెప్టెంబర్ చివరి వారంలో భారీగా మంచు కురిసింది. ఆదికైలాస్ ప్రాంతంలో ఇటీవలి రోజుల్లో మూడు నుంచి నాలుగు అడుగుల మేర మంచు పేరుకుపోయింది. దీంతో రహదారులపై రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) రహదారులపై పేరుకుపోయిన మంచును తొలగించే పనులు చేపట్టింది. అయితే పర్వతం వైపు వెళ్లే రహదారిపై ఇరువైపులా పేరుకుపోయిన మంచు పూర్తిగా తొలగించకపోవడంతో మార్గం మరింత ఇరుకుగా మారింది. దీనికి తోడు వారాంతంలో పర్యాటకులు, యాత్రికుల సంఖ్య భారీగా పెరగడంతో వాహనాల రద్దీ తీవ్రమైంది. దాదాపు 1.5 నుంచి 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లు పలు వీడియోల్లో కనిపిస్తోంది. దీంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పెరుగుతున్న ఆదికైలాస్ యాత్రికుల సంఖ్య
ఇటీవలి సంవత్సరాల్లో సంప్రదాయ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, హేమకుండ్ సాహిబ్‌లతో పాటు ఆదికైలాస్, ఓం పర్వత్, మున్సియారీ వంటి ప్రాంతాలపై పర్యాటకులకు ఆసక్తి పెరుగుతోంది. ఆదికైలాస్, ఓం పర్వత్ ప్రాంతాలను సందర్శించే యాత్రికుల సంఖ్య కొన్నేళ్లలో గణనీయంగా పెరిగింది. 2023లో ఆదికైలాస్‌ను 10,079 మంది పర్యాటకులు, యాత్రికులు సందర్శించగా.. 2024లో ఈ సంఖ్య 29,423కు, 2025లో 31,558కు చేరింది. 2026లో ఇప్పటివరకు ఏకంగా 61,950 మంది ఆదికైలాస్‌ను సందర్శించారు.
మంచు, ఇరుకైన రహదారులతో మరింత సమస్య
అయితే, ఆదికైలాస్ మార్గంలోని ఎల్గడ్, కులగడ్, ఎస్-బెండ్, మాల్ఘాట్ వంటి సున్నితమైన ప్రాంతాలు ఇప్పటికే ఇరుకుగా ఉన్నాయి. భారీగా మంచు పేరుకుపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఈ మార్గంలో ఏదైనా వాహనం ఆగిపోతే దాని వెనుక వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. హిమాలయ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు కూడా తరచూ సవాల్‌గా మారుతున్న నేపథ్యంలో ఆదికైలాస్‌కు వెళ్లే పర్యాటకులు, యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని స్థానిక అధికారులు సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
'సర్'పై రాహుల్ గాంధీని నిలదీసిన డీఎంకే నేత రవణన్ అన్నాదురై..
సల్మాన్ ఇంట్లో డిన్నర్.. బీజేవైఎం నేత సాయి ప్రసాద్ పోస్ట్ వైరల్..