IRCTC స్పెషల్ ఆఫర్.. మైసూర్ నుంచి కోయంబత్తూర్ వరకు అద్భుతమైన ప్రయాణం
ABN , Publish Date - Mar 13 , 2026 | 03:14 PM
ఈ వేసవిలో దక్షిణ భారతదేశంలోని అందమైన పర్యాటక ప్రాంతాలను చూడాలనుకుంటున్నారా? ఐఆర్‌సీటీసీ మీకు స్పెషల్ ఆఫర్ అందిస్తోంది. ‘మెజెస్టిక్ సదరన్’ పేరుతో ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఈ సమ్మర్‌లో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎక్కడికైనా ట్రిప్‌కు వెళ్లాలని అనుకుంటున్నారా? ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మీకు అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. ‘మెజెస్టిక్ సదరన్’ పేరుతో ప్రత్యేక ఎయిర్ ట్రావెల్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్ ద్వారా దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుంది.
ఈ ప్యాకేజీ ఏప్రిల్ 25 నుంచి మే 2 వరకు కొనసాగుతుంది. మొత్తం 7 రాత్రులు – 8 రోజుల ప్రయాణం ఉంటుంది. ఇందులో ప్రధానంగా మైసూర్, కూర్గ్, ఊటీ, కోయంబత్తూర్ వంటి ప్రసిద్ధ ప్రదేశాలను సందర్శించేలా ప్యాకేజీ రూపొందించారు. ప్రయాణికులను లక్నో నుంచి బెంగళూరుకు విమానంలో తీసుకెళ్తారు. తిరుగు ప్రయాణం కోయంబత్తూర్ నుంచి లక్నోకు విమానంలో ఉంటుంది. ఈ టూర్‌లో ప్రయాణికులకు త్రీ స్టార్ హోటళ్లలో వసతి, భోజనం వంటి సౌకర్యాలు కూడా అందిస్తారు.

పర్యటనలో సందర్శించే ప్రదేశాలు
ఈ ప్యాకేజీలో భాగంగా బెంగళూరు నుంచి మైసూర్‌కు వెళ్లే మార్గంలో శ్రీరంగపట్నం ఆలయాన్ని సందర్శిస్తారు. అలాగే మైసూర్ ప్యాలెస్, బృందావన్ గార్డెన్, మైసూర్ లోని చాముండి ఆలయం, కూర్గ్ లోని స్వర్ణ దేవాలయం, దుబారే ఎలిఫెంట్ క్యాంప్, భాగమండల ఆలయం, అబ్బే జలపాతం, ఓంకారేశ్వర్ స్వామి ఆలయం వంటి ప్రదేశాలను సందర్శిస్తారు.

ఆ తర్వాత ఊటీకి వెళ్లే మార్గంలో దేవదార్ అడవులను చూడవచ్చు. అంతేకాకుండా బొటానికల్ గార్డెన్, ఊటీ సరస్సు, రోజ్ గార్డెన్, టీ మ్యూజియం, దొడ్డబెట్ట శిఖరం వంటి ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే కోయంబత్తూర్ లోని ఆదియోగి శివ విగ్రహాన్ని కూడా ఈ పర్యటనలో చూడవచ్చు.

ప్యాకేజీ ధరలు
ఈ టూర్ ప్యాకేజీ ధరలు ఇలా ఉన్నాయి:
ఒక్కో ప్రయాణికుడికి సుమారు రూ.71,000
ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తే ఒక్కో వ్యక్తికి రూ.54,500
ముగ్గురు కలిసి ప్రయాణం చేస్తే ఒక్కో వ్యక్తికి రూ.51,500
ఆసక్తి ఉన్నవారు IRCTC వెబ్‌సైట్ irctctourism.com ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. అలాగే గోమతీనగర్ టూరిజం భవన్‌లో ఉన్న IRCTC కార్యాలయంలో కూడా బుకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది.
Also Read:
ఈ వ్యక్తులను అవమానిస్తే మీకే నష్టం..
నిమ్మకాయ కొనేటప్పుడు ఈ చిట్కాలు పాటించండి
For More Latest News