జెన్ Z యువతలో కొత్త ట్రావెల్ ట్రెండ్..
ABN , Publish Date - Mar 10 , 2026 | 10:53 AM
ప్రస్తుతం జనరేషన్ Z యువతలో ప్రయాణం ఒక కొత్త ట్రెండ్‌గా మారుతోంది. టెక్నాలజీ సహాయంతో ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం, మారుమూల ప్రాంతాలను అన్వేషించడం, సాహసయాత్రలు చేయడం వంటి కొత్త ప్రయాణ ధోరణులు ఈ తరం యువతలో ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఇప్పటి యువత తమ సెలవులను కొత్తగా, ప్రత్యేకంగా గడపాలని కోరుకుంటున్నారు. సాధారణంగా పర్యాటక ప్రదేశాలకు వెళ్లడం కంటే భిన్నమైన అనుభవాలను పొందే ప్రయాణాల వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. కొంతసేపైనా డిజిటల్ ప్రపంచం నుంచి దూరంగా ఉండి కొత్త ప్రదేశాలను అనుభవించడం వారికి ముఖ్యంగా మారుతోంది.
జనరేషన్ Z
సుమారు 1997 నుంచి 2012 మధ్య జన్మించిన వారిని జనరేషన్ Zగా పిలుస్తారు. టెక్నాలజీతో పెరిగిన మొదటి తరం ఇదే. వీరు డిజిటల్ పరిజ్ఞానం కలిగినవారు, సామాజిక విషయాలపై అవగాహన ఉన్నవారు, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వభావం కలిగినవారు. వీరిని జూమర్స్ అని కూడా అంటారు. వైవిధ్యం, స్వేచ్ఛ, సృజనాత్మకత వంటి విలువలకు వీరు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ప్రస్తుతం ఈ తరం యువతలో కొత్త జీవనశైలి, ప్రయాణపు ట్రెండ్లు కనిపిస్తున్నాయి.

టెక్నాలజీ ఆధారిత ప్రయాణం
కొత్త ప్రదేశాలకు వెళ్లే ముందు ఈ తరం యువత ఇంటర్నెట్, గూగుల్ యాప్‌లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక వనరులను ఉపయోగించి ఆ ప్రదేశాల గురించి ముందుగానే తెలుసుకుంటారు. వర్చువల్‌గా ఆ ప్రాంతాలను చూసి తమ ప్రయాణాన్ని ప్లాన్ చేస్తారు. అక్కడికి వెళ్లిన తర్వాత కూడా భాష లేదా మార్గదర్శకుల కోసం వివిధ యాప్‌ల సహాయాన్ని తీసుకుంటారు.
ఆఫ్-గ్రిడ్ ప్రదేశాలపై ఆసక్తి
ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు వెళ్లడం కంటే జనసందోహం తక్కువగా ఉండే, చాలా మందికి తెలియని ప్రదేశాలను అన్వేషించడం వీరికి ఇష్టం. అందుకే పర్యాటకంగా ఇంకా అభివృద్ధి చెందని మారుమూల ప్రాంతాలకు వెళ్లాలని ఈ తరం యువత కోరుకుంటున్నారు.

ఒత్తిడికి దూరంగా
పని ఒత్తిడి, డిజిటల్ ప్రపంచం నుంచి కొంత విరామం తీసుకోవాలని చాలామంది కోరుకుంటున్నారు. అందుకే ప్రశాంతమైన ప్రకృతి వాతావరణం ఉన్న మారుమూల ప్రాంతాలను సెలవుల కోసం ఎంచుకుంటున్నారు. సెలవులు వచ్చినప్పుడు ఒక నిర్దిష్ట ప్రదేశానికి వెళ్లడం కంటే తమ అభిరుచులకు అనుగుణంగా ప్రదేశాలను ఎంచుకుంటారు. కొందరు సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకునేందుకు ప్రయాణిస్తే, మరికొందరు ప్రశాంత వాతావరణం కోసం ప్రత్యేక ప్రదేశాలను ఎంచుకుంటారు.
రోడ్ ట్రిప్స్‌పై మక్కువ
రైలు లేదా విమానంలో ప్రయాణించడం కంటే కార్లు, బైక్‌లపై రోడ్ ట్రిప్స్ చేయడం ఈ తరం యువతకు ఎక్కువ ఇష్టం. ప్రయాణంలో కొత్త ప్రదేశాలను చూసుకుంటూ ముందుకు సాగడం ద్వారా కొత్త అనుభవాలను సొంతం చేసుకోవాలని వారు భావిస్తున్నారు. సినిమాలు లేదా కథల్లో కనిపించే అందమైన ప్రదేశాలను ప్రత్యక్షంగా చూడాలని కూడా ఈ తరం యువత ఆసక్తి చూపుతోంది. సమయం దొరికితే వెంటనే బ్యాగులు సర్దుకుని అలాంటి ప్రదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

సాహసయాత్రలపై ఆసక్తి
జనరేషన్ Z యువతకు సాహసక్రీడలపై కూడా మంచి ఆసక్తి ఉంది. ట్రెక్కింగ్, హైకింగ్, పర్వతారోహణ, స్కూబా డైవింగ్, స్కైడైవింగ్ వంటి సాహస కార్యక్రమాల్లో పాల్గొంటూ కొత్త అనుభవాలను ఆస్వాదిస్తున్నారు. సాధారణ జీవనశైలికి భిన్నంగా ఉండే అనుభూతిని పొందడమే వీరి ప్రధాన లక్ష్యం.
Also Read:
సమ్మర్ స్పెషల్.. హైదరాబాద్ దగ్గర్లో టూర్ వెళ్లాలంటే ఈ ప్లేస్ బెస్ట్
పర్యాటకులను ఆకట్టుకుంటున్న ఔలి హిల్ స్టేషన్
For More Latest News