కెమికల్ స్ప్రేలు అవసరం లేదు.. ఈ సహజ చిట్కాలతో బల్లులు పరారవుతాయి
ABN , Publish Date - Mar 06 , 2026 | 10:57 AM
ఇంట్లో బల్లులు కనిపించడం చాలా మందికి అసౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా కిచెన్, బాత్రూమ్‌లలో ఇవి ఎక్కువగా తిరుగుతుండటంతో భయం కూడా కలుగుతుంది. చాలా మంది వీటిని తరిమికొట్టేందుకు కెమికల్ స్ప్రేలు వాడుతుంటారు. కానీ ఇంట్లోనే ఉండే కొన్ని సహజ పదార్థాలతో బల్లులను సులభంగా దూరం చేయవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: బల్లులు.. ఇంట్లోని దోమలు, ఈగలు, బొద్దింకలు వంటి హానికరమైన కీటకాలను తింటాయి. తద్వారా ఇంట్లో పురుగుల బెడద తగ్గుతుంది. ఇవి రసాయన పురుగుల మందుల అవసరాన్ని తగ్గిస్తాయి. అయితే, ఇంట్లో బల్లులు ఉండటం వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ చాలా మందికి అసౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా వంటగది, బాత్రూమ్ వంటి ప్రదేశాల్లో ఇవి ఎక్కువగా తిరుగుతుంటాయి. చాలా మంది వీటిని దూరం చేయడానికి కెమికల్ స్ప్రే వంటివి ఉపయోగిస్తారు. కానీ వాటి వల్ల ఇంట్లో ఘాటు వాసన వస్తుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉంటే ఈ వాసన వల్ల శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే ఎలాంటి కెమికల్స్ ఉపయోగించకుండా ఇంట్లో ఉండే కొన్ని సహజ పదార్థాలతోనే బల్లుల సమస్యను తగ్గించుకోవచ్చు.
ఉల్లి – వెల్లుల్లి చిట్కా
ఉల్లి, వెల్లుల్లిలో ఉండే ఘాటు వాసన బల్లులకు అస్సలు ఇష్టం ఉండదు. అందుకే వీటిని ఉపయోగించడం వల్ల అవి దూరంగా పారిపోతాయి. కొన్ని ఉల్లిపాయ ముక్కలు లేదా వెల్లుల్లి రెబ్బలను తీసుకుని బల్లులు ఎక్కువగా కనిపించే ప్రదేశాల్లో ఉంచాలి. లేదా ఉల్లి, వెల్లుల్లిని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిగా నీటిలో కలిపి స్ప్రే బాటిల్‌లో పోయాలి. బల్లులు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో ఈ ద్రావణాన్ని స్ప్రే చేస్తే అవి అక్కడికి రావడం తగ్గుతుంది. ఈ స్ప్రేను కొన్ని రోజుల పాటు ఉపయోగిస్తే బల్లుల సమస్య క్రమంగా తగ్గుతుంది.
గుడ్డు పెంకుల చిట్కా
గుడ్డు పెంకులు కూడా బల్లులను దూరం పెట్టడంలో సహాయపడతాయి. చాలా మంది పెంకులను నేరుగా మూలల్లో ఉంచుతారు. అయితే అది చూడటానికి అంత బాగుండకపోవచ్చు. దీనికి బదులుగా గుడ్డు పెంకులను బాగా ఎండబెట్టి మిక్సీలో వేసి పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని ఒక సీసాలో నిల్వ చేసి, బల్లులు ఎక్కువగా కనిపించే ప్రదేశాల్లో చల్లాలి. ముఖ్యంగా కిచెన్ మూలలు, బాల్కనీ, బాత్రూమ్ దగ్గర ఈ పొడి చల్లడం మంచిది. గుడ్డు పెంకుల వాసన వల్ల బల్లులు అక్కడికి రావడం తగ్గుతుంది.
కాఫీ
బల్లులను దూరం పెట్టడానికి కాఫీ పొడి ఉపయోగపడతుంది. ఈ పొడిని ఫర్నిచర్ కింద, కిటికీల దగ్గర లేదా బల్లులు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో ఉంచాలి. కాఫీ వాసన బల్లులను దూరంగా ఉంచుతుంది. ఇలా ఇంట్లో ఉండే సహజ పదార్థాలతోనే బల్లులు పరారవుతాయి. ఇవి కెమికల్ స్ప్రేలతో పోలిస్తే సురక్షితమైనవి. ఇంట్లో పిల్లలు లేదా పెంపుడు జంతువులు ఉన్నా కూడా భయపడాల్సిన అవసరం ఉండదు. కొన్ని రోజుల పాటు ఈ చిట్కాలను పాటిస్తే బల్లుల సమస్య తగ్గుతుంది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉదయం నిద్రలేవగానే ఫోన్ చూస్తే ఏమవుతుందో తెలుసా?
ఏ ఆహారాలు అజీర్ణానికి కారణమవుతాయి?
For More Latest News