ముచ్చటగా ‘మూడు నిమిషాలు’
ABN , Publish Date - Apr 05 , 2026 | 01:18 PM
‘బాబూ... మూడు విజిల్స్ రాగానే ఆ కుక్కర్ కట్టేసెయ్’... ఆ అబ్బాయి నుంచి స్పందన లేదు, సెల్‌ఫోన్‌లో బిజీ. ‘బేబీ... ఇలారా కాసేపు నీతో మాట్లాడాలి’... ‘నాకు కుదరదమ్మా ఆడుకోవడానికి వెళ్లాలి’... ఇదీ ఆ అమ్మాయి నుంచి వచ్చే సమాధానం.
‘బాబూ... మూడు విజిల్స్ రాగానే ఆ కుక్కర్ కట్టేసెయ్’... ఆ అబ్బాయి నుంచి స్పందన లేదు, సెల్‌ఫోన్‌లో బిజీ. ‘బేబీ... ఇలారా కాసేపు నీతో మాట్లాడాలి’... ‘నాకు కుదరదమ్మా ఆడుకోవడానికి వెళ్లాలి’... ఇదీ ఆ అమ్మాయి నుంచి వచ్చే సమాధానం. ఇంట్లో ఉండేది నలుగురు... కానీ ఎవరికి వాళ్లు బిజీ. ఒకే కప్పు కింద ఒకళ్లతో మరొకరు మాట్లాడుకోలేనంత దూరం. ఈ సమస్యకు చిరు పరిష్కారం ‘తొమ్మిది నిమిషాల థియరీ’.
‘స్మార్ట్‌ఫోన్‌లు అందరి మధ్యా తెలియని డిజిటల్ గోడలు కట్టాయి. ఒకరితో మరొకరు మాట్లాడుకోవడం తగ్గిపోయింది. ముఖ్యంగా పిల్లలు ఎప్పుడూ సెల్‌ఫోన్లతోనేగడిపేస్తున్నారు. పలుకరిస్తే పొడి పొడి సమాధానాలే’... ఏ ఇద్దరు తల్లులు కలుసుకున్నా ఇవే మాటలు. అయితే ‘అంతా కాలమహిమ’ అని సరిపెట్టుకోకుండా... రోజుకి ‘తొమ్మిది నిమిషాలు’ పిల్లల కోసం కేటా యించమని అంటున్నారు సైకాలజిస్టులు. దీన్నే శాస్త్రపరి భాషలో ‘9 - మినిట్ థియరీ’గా పేర్కొంటున్నారు.
మూడు సార్లు...
పిల్లల వయసు ఎంతైనా సరే, రోజులో కొంతసేపు వాళ్లతో గడపాలి. అప్పుడే చిన్నారి జీవితాల్లో జరుగుతున్నది పెద్దలకు అర్థం అవుతుంది. ఉదయం వేళ పిల్లల్ని స్కూల్‌కి పంపించడం, సాయంత్రం ఇంటికి రాగానే ట్యూషన్లకు పంపడం, రాత్రి ఏ ఏడు తర్వాతో వాళ్లు ఇళ్లకి వచ్చి భోంచేసి, కాసేపు టీవీ, సెల్ ఫోన్లతో గడిపేసి నిద్రపోవడం. ప్రతీ ఇంట్లో పిల్లలది ఇలాంటి షెడ్యూలే. అందుకే తల్లిదండ్రులు రోజూ కనీసం తొమ్మిది నిమిషాలు వాళ్లతో గడిపేలా ప్లాన్ చేసుకోవాలి.
‘9 - మినట్ థియరీ’ని దివంగత జాక్ పాంక్‌సెప్ ప్రతిపాదించారు. ఆయన అమెరికాకు చెందిన న్యూరో సైంటిస్ట్. ఈ సిద్ధాంతం ప్రకారం తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు తమ పిల్లలతో (ఒకళ్లకి మించి ఉంటే విడి విడిగా) మూడు నిమిషాల చొప్పున రోజులో మూడు వేళల్లో వాళ్లతో సంభాషించాలి. దీనికీ ఓ పద్ధతి ఉంది. పిల్లలు ఉదయం నిద్రలేచే సమయం, స్కూల్ నుంచి ఇంటికి వచ్చే సమయం, రాత్రి నిద్రపోయే సమయం. ప్రతీరోజూ ఈ మూడు వేళల్లో తు.చ. తప్పకుండా పిల్లలతో మాట్లాడటం అలవర్చుకోవాలి. తల్లిదండ్రులు ఎంత బిజీగా ఉన్నా సరే కనీసం తొమ్మిది నిమిషాలు పిల్లలతో గడపడం మాత్రం మరచిపోకూడదు. వారితో మాట్లాడేప్పుడు అవును, కాదు అనే సమాధానాలు ఇవ్వలేని ప్రశ్నలను మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు...
ఈ రోజు నీవు ఏం చేయాలని అనుకుంటున్నావ్?
ఈ రోజు ఎవరితో ఆడుకుంటున్నావ్?
ఈ రోజు స్కూల్లో ఎక్కువ సేపు నవ్విన సందర్భం ఏది?
నిన్నటికీ ఈరోజుకీ ఏదైౖనా భిన్నంగా జరిగిందా?
కొత్తగా నేడు నేర్చుకున్నది ఏమిటి?
ఎవరికైనా ఈ రోజు సహాయం చేశావా?
ఏదైనా విషయం నిన్ను భయపెట్టిందా?
ఏ పని చేస్తుంటే నీకు చాలా సంతోషం వేసింది?
ఇలా వాళ్లలో ఆలోచనలు రేకెత్తించే ప్రశ్నలు అడగాలి. ఆ సమాధానాలను బట్టి పిల్లల జీవితాల్లో జరుగుతున్నది అంచనా వేయగలగాలి. ఇలా రోజూ మాట్లాడటం వల్ల పిల్లలకు మీకూ దూరం తగ్గుతుంది. ప్రతి విషయాన్నీ సంకోచం లేకుండా మీతో షేర్ చేసుకోవడం మొదలుపెడతారు. ఈ తొమ్మిది నిమిషాలు మీ రోజునే కాదు, పిల్లలతో మీ బంధాన్ని గట్టి పరుస్తుంది. తల్లిదండ్రులతో చక్కని, దృఢమైన అనుబంధం కలిగిన పిల్లలు భవిష్యత్తులో పాజిటివ్‌గా ఉంటూ జీవితంలో చక్కని విజయాలను సాధిస్తారని మానసిక శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బాదం పూరీ.. ఇలా తయారు చేస్తే.. ఇక మీరు..
కుట్టు దహీ భల్లా.. దీని రుచే వేరుగా..
Read Latest Telangana News and National News