ప్రాణం తీసిన చేప.. యువకుడు నోటిలో పెట్టుకోగానే..
ABN , Publish Date - Apr 05 , 2026 | 11:53 AM
చేప కారణంగా ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. చేప గొంతులోకి వెళ్లి ఇరుక్కోవటంతో ఊపిరి ఆడక యువకుడు చనిపోయాడు. ఈ సంఘటన ఒడిశాలో శుక్రవారం చోటుచేసుకుంది.
భువనేశ్వర్, ఏప్రిల్ 5: చేప కారణంగా ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన ఒడిశాలో శుక్రవారం చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. మయుర్‌భంజ్ జిల్లాలోని దిగి గ్రామానికి చెందిన అభినాశ్ బిజులీ శుక్రవారం చేపలు పట్టడానికి ఊరి బయట ఉన్న చెరువు దగ్గరకు వెళ్లాడు. ఈ నేపథ్యంలోనే అతడికి ఇండియన్ కోయ్ జాతికి చెందిన చేప చిక్కింది. చేప తప్పించుకోకుండా ఉండటానికి దాన్ని నోట్లో పెట్టుకున్నాడు. అయితే, ఆ చేప గొంతులోకి దూరింది. దీంతో అభినాశ్ ఊపిరి తీసుకోవటంలో తీవ్ర ఆటంకం ఏర్పడింది.
అతడు ఎంత ప్రయత్నించినా చేప బయటకు రాలేదు. ఊపిరి తీసుకోవటానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు. అయినా అతడి వల్ల కాలేదు. కుటుంబసభ్యులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అభినాశ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటనపై అభినాశ్ మేనమామ మాట్లాడుతూ.. ‘కావ్ చేప ప్రమాదవశాత్తు మా అల్లుడి గొంతులో ఇరుక్కుపోయింది. అతడిని మేము బంగిరిపోసి మెడికల్ ఆస్పత్రికి తీసుకెళ్లాము. అక్కడి డాక్టర్ మాతో ఎంతో దురుసుగా ప్రవర్తించాడు. అభినాశ్‌కు వైద్యం చేయకుండానే వేరే ఆస్పత్రికి తీసుకెళ్లమన్నాడు’ అని చెప్పుకొచ్చాడు.
మరో ఘటనలో..
గత నెలలో ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలులో చేపలు పట్టడానికి వెళ్లిన సుబ్రహ్మణ్యం అనే మత్స్యకారుడి గొంతులో చేప ఇరుక్కుంది. వలను నోటితో పట్టుకుని చేపలను వేరు చేస్తున్న సమయంలో ఓ చేప సుబ్రహ్మణ్యం నోటిలోకి జంప్ చేసింది. గొంతులోకి వెళ్లి ఇరుక్కుపోయింది. సుబ్రహ్మణ్యం ఊపిరి ఆడక అల్లాడిపోయాడు. కుటుంబసభ్యులు అతడిని ఒంగోలులోని జీజీహెచ్‌లో చేర్పించారు. ఈఎన్‌టీ విభాగానికి చెందిన డాక్టర్ ప్రభాకర్ నేతృత్వంలోని వైద్య బృందం సర్జరీ చేసి విజయవంతంగా చేపను గొంతునుంచి బయటకు తీసింది.
ఇవి కూడా చదవండి
ఆఫర్లున్నా కదలరు...ఉద్యోగం వదలరు!
చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్.. రెండో పైలట్‌ను రక్షించాం: డొనాల్డ్ ట్రంప్..