Share News

జీవితాన్ని ‘రీసెట్‌’ చేద్దాం!

ABN , Publish Date - Mar 22 , 2026 | 08:37 AM

కొన్నిసార్లు జీవితం హఠాత్తుగా చేజారిపోయినట్టు అనిపిస్తుంది. పాతాళంలోకి కూరుకుపోయిన భావన కలుగుతుంది.

జీవితాన్ని ‘రీసెట్‌’ చేద్దాం!

కొన్నిసార్లు జీవితం హఠాత్తుగా చేజారిపోయినట్టు అనిపిస్తుంది. పాతాళంలోకి కూరుకుపోయిన భావన కలుగుతుంది. జీవితంపై నియంత్రణ కోల్పోవడం వల్ల కెరీర్‌, వ్యక్తిగత జీవితం రెండూ దెబ్బతింటాయి. ఇలాంటి సందర్భాల్లో లైఫ్‌ను ‘రీసెట్‌’ చేసుకోవడం వల్ల సరికొత్తగా ప్రారంభించే అవకాశం లభిస్తుంది. తప్పులను సరిదిద్దుకుని... ముందుకు సాగడం ఎలాగంటే...

జీవితంలో మార్పు అవసరమైనప్పుడు... సరికొత్తగా ప్రారంభించడానికి చాలాసార్లు ‘రీసెట్‌’ బటన్‌ ఉంటే బాగుండనిపిస్తుంది. అయితే లైఫ్‌ను తిరిగి ప్రారంభించడం అంత సులభం కాదు. ‘రీసెట్‌’ కావడమంటే... జీవితంలో ఒక వ్యూహాత్మక మార్పును తీసుకురావడం. ఉద్యోగాన్ని వదిలిపెట్టడం, కొత్త దినచర్యను ప్రారంభించడం కావచ్చు. దినచర్యలను, అలవాట్లను రీఫ్రెష్‌ చేసుకోవడం కూడా రీసెట్‌ కావడమే. జీవితంలో ఏం కోల్పోయారు? ఇక ముందు ఎలా ఉండాలి? ఏది అవసరం? ఏది అనవసరమో అంచనా వేసుకోవడానికి, ఒక నిర్ణయానికి రావడానికి రీసెట్‌ అనేది ఎవరికైనా ఒక మంచి అవకాశంగానే భావించాలి.


book2.jpgరీసెట్‌ ఎందుకు?

జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అనేక ఎత్తుపల్లాలు ఉంటాయి. కెరీర్‌లో మార్పులు ఉంటాయి. అభిరుచులు మారుతుంటాయి. రొటీన్‌ వర్క్‌ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అధిక పని ఒత్తిడి మానసిక ఆరోగాన్ని దెబ్బతీస్తుంది. శారీరక శ్రమ లేకపోవడం వల్ల నిద్రలేమి, యాంగ్జయిటీతో పాటు ఇతర జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుంది. అలాంటప్పుడు జీవితాన్ని రీసెట్‌ చేసుకోవాలి. దీనివల్ల ఆరోగ్యకరమైన జీవితం వైపు అడుగులు వేయొచ్చు. ఎలాంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలో తెలుసుకునే అవకాశం లభిస్తుంది. లక్ష్యాల వైపు పనిచేయగలుగుతారు. పాత అలవాట్లను వదులుకోవడానికి, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి రీసెట్‌ ఉపకరిస్తుంది.


కొన్నిసార్లు బోరింగ్‌గా ఫీలవుతారు. అలాంటప్పుడు రీసెట్‌ చేసుకుంటే... సంతోషపెట్టే అంశాలను ఎంపిక చేసుకునే అవకాశం లభిస్తుంది. కొత్తవి ప్రారంభించడం వల్ల కంఫర్ట్‌జోన్‌ నుంచి బయటపడతారు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. రీసెట్‌ కావడం వల్ల గతంలో చేసిన తప్పుల గురించి ఆలోచించుకునే అవకాశం దొరుకుతుంది. ఆ తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లే వీలు ఏర్పడుతుంది. కొత్తగా ప్రారంభించడం అనేది సంబంధాలపై ఒక పాజిటివ్‌ ప్రభావాన్ని చూపిస్తుంది. బాగా కమ్యునికేట్‌ చేసేందుకు ఇది ఒక మంచి అవకాశం. కొత్తగా మొదలుపెట్టినప్పుడు ఒత్తిడికి కారణమవుతున్న వాటిని గుర్తించి దూరంపెట్టే అవకాశం లభిస్తుంది.

రీసెట్‌ నిర్ణయం తీసుకునే ముందు జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోవాలి. కొత్త ఉద్యోగం, అభిరుచులు, కుటుంబం గురించి మాత్రమే కాదు... భావోద్వేగాలను కూడా విజువలైజ్‌ చేసుకోవాలి. ఫినిషింగ్‌ లైన్‌ని స్పష్టంగా ఊహించుకున్నప్పుడు లక్ష్యాలను చేరుకోవడం సులువవుతుంది.


book3.3.jpgప్రాధాన్యాల ఎంపిక

జీవితంలో ఎదుగుదలకు ఎప్పుడూ స్కోప్‌ ఉంటుంది. అయితే వెనువెంటనే అన్నీ జరిగిపోవాలని చూడొద్దు. ముందుగా ఒకటి రెండు మార్పులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ‘నాకేం కావాలి?’ అని ప్రశ్నించుకోవాలి. పెద్ద ఆర్థిక లక్ష్యాలను పెట్టుకోవాలనుకున్నా, కొత్త లైఫ్‌ స్కిల్స్‌ నేర్చుకోవాలన్నా ముఖ్యమైన మార్పులకు ప్రాధాన్యం ఇవ్వాలి. రీసెట్‌కు ప్రాధాన్యాల ఎంపిక ప్రధానం.

లక్ష్యాలను సెట్‌ చేసుకోవాలి...

ఏం సాధించాలనుకుంటున్నారో స్పష్టత ఉండాలి. కెరీర్‌లో ఎదుగుదల, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం, రిలేషన్‌షిప్‌ పెంచుకోవడం వంటి నిర్దిష్ట లక్ష్యాలు మార్పునకు అవసరమైన తోడ్పాటును అందిస్తాయి. లక్ష్యం నిర్దిష్టంగా, సాధించగలి గేదిగా ఉండాలి. ముఖ్యంగా నిర్ణీత సమయం పట్ల స్పష్టత కలిగి ఉండాలి. లైఫ్‌ను రీసెట్‌ చేసుకోవడంలో మొదటి అడుగు లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం. ఇది అతిముఖ్యమైన అంశం.


మైలురాళ్లు...

లక్ష్యాన్ని చేరుకున్నప్పుడల్లా ఒక మైలురాయిని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మైలురాళ్లు పురోగతిని ట్రాక్‌ చేసుకోవడానికి, మోటివేషన్‌కు ఉపయోగపడతాయి. ఈవెంట్స్‌కు హాజరు కావడం, సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్స్‌ను పూర్తి చేయడం వంటి వాటికి కూడా మైలురాళ్లు పెట్టుకోవచ్చు. చిన్న అడుగులే పెద్ద విజయం వైపు నడిపిస్తాయనే విషయం మరవొద్దు.


కంఫర్ట్‌ జోన్‌ను బద్దలు కొట్టాల్సిందే...

రొటీన్‌ ఎప్పుడూ కంఫర్ట్‌గా ఉంటుంది. అందుకే చాలామంది ఎదుగుదలకు అవకాశం లేని అలవాట్లను అంటి పెట్టుకుని ఉండిపోతారు. ఆత్మవిశ్వాసం లేకపోవడం, ఓడిపోతానేమోనన్న భయం వల్ల కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటకు రాలేకపోతారు. దీన్నుంచి బయటపడాలంటే నాయకత్వ పాత్రను పోషించాలి. పబ్లిక్‌ ఈవెంట్స్‌లో మాట్లాడాలి. కొత్త స్కిల్స్‌ను నేర్చుకోవాలి. కొత్త సవాళ్లను నిర్దేశించుకోవాలి. సవాళ్లను అధిగమిస్తున్నప్పుడు ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటపడటం వల్ల కొత్తకొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. కెరీర్‌లో ఎదుగుదలకు, వ్యక్తిగత అభివృద్ధికి ఇది సహాయపడుతుంది. కొత్త విషయాలను నేర్చుకోవడం, కొత్త అంశాల కోసం ప్రయత్నించడం వల్ల అవకాశాల తలుపులు తెరుచుకుంటాయి.


మానసిక ప్రశాంతత

మనసును ప్రశాంతంగా ఉంచే యాక్టివిటీస్‌ కోసం సమయం కేటాయించాలి. ధ్యానం చేయడం, వ్యాయామం వంటివి మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన ఏకాగ్రత కోసం ఈ అలవాట్లు సహాయపడతాయి. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది.

సోషల్‌ సర్కిల్‌పై కన్ను

స్నేహితులు, సన్నిహితులపై ఓ కన్నేయాలి. మీపై వారి ప్రభావం ఏ మేరకు ఉంటుందో చెక్‌ చేయాలి. స్ఫూర్తినిచ్చే, తోడుగా నిలిచే వారు చుట్టూ ఉండేలా చూసుకోవాలి. అలాంటివారు జీవితంపై పాజిటివ్‌ ఇంపాక్ట్‌ చూపిస్తారు. వ్యక్తిగత ఎదుగుదలకు సహాయపడతారు.


బడ్జెట్‌ లెక్క

జీవితాన్ని రీసెట్‌ చేసుకుని, తిరిగి కొత్తగా ప్రారంభించాలని అనుకున్నప్పుడు తప్పనిసరిగా బడ్జెట్‌ను క్రియేట్‌ చేసుకోవాలి. ట్రాక్‌ తప్పకుండా ఉండటానికి, లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇది సహాయపడుతుంది. అంతేకాకుండా డబ్బు ఎక్కడికి పోతోంది, దుబారా ఎక్కడ తగ్గించాలనే విషయాలు తెలుస్తాయి. బడ్జెట్‌లో పొదుపు ప్రణాళికతో పాటు ఎమర్జెన్సీ ఫండ్‌ ఉండేలా చూసుకోవాలి.

కొత్త అభిరుచులు

జీవితాన్ని తిరిగి ప్రారంభించడానికి కొత్త అభిరుచులను కనుక్కోవడం ఒక మార్గం. ప్రతికూల ఆలోచనలు, భావోద్వేగాల నుంచి బయటపడేందుకు కొత్త వినోదాన్ని ఎంచుకోవాలి. ఇష్టపడేవాటితో తిరిగి జీవితాన్ని ప్రారంభించడం చాలా సులభం.


సానుకూల దృక్పథం ...

ఎప్పుడైనా సరే సానుకూల దృక్పథం కలిగి ఉన్న వ్యక్తులతో స్నేహం చేయాలి. ఎప్పుడూ పాజిటివ్‌ వైబ్స్‌తో ఉండే వ్యక్తులతో కలిసి ఉండటం వల్ల ఆ ప్రభావం మీపైన కూడా పడుతుంది. జీవితంలో సానుకూల మార్పులు తీసుకురావడానికి ప్రేరణ లభిస్తుంది. సపోర్టివ్‌గా ఉండే వారితో సంబంధాలు పెంచుకోవడం వల్ల నిత్యం స్ఫూర్తి రగులుతుంది. రీసెట్‌ ద్వారా జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదిగిన వ్యక్తులతో మాట్లాడటం మంచి ఫలితాలనిస్తుంది. వారి గైడెన్స్‌ ఎంతగానో ఉపకరిస్తుంది. లక్ష్యాలకు అనుగుణంగా ఉన్న సోషల్‌ గ్రూపుల్లో చేరాలి. ఆ గ్రూపుల్లో నిర్వహించే మీటింగ్‌లకు హాజరవ్వాలి. మీలా ఆలోచించే వ్యక్తులకు స్నేహహస్తం చాటాలి.


ఒక కాగితం తీసుకుని సంతోషాన్నిచ్చే వాటి గురించి రాయాలి. కుటుంబసభ్యులతో గడపడం, పెట్స్‌తో ఉండటం, వ్యాయామాలు చేయడం, కథలు రాయడం, చిన్న చిన్న పట్టణాల్లో ప్రయాణించి స్థానిక ఆచారాల గురించి తెలుసుకోవడం చేయాలి. అది కూడా వెంటనే చేయాలి. జీవితం చాలా చిన్నది అనే విషయం మరవొద్దు. అదేవిధంగా మిమ్మల్ని నిరుత్సాహపరిచే వాటి జాబితాను రాయాలి. వాటిని తొలగించాలి. ఇలాంటి మార్పులు చేసుకుంటే జీవితాన్ని ‘రీసెట్‌’ చేసుకున్నట్టే. అప్పుడిక జీవితం సరికొత్తగా కనిపిస్తుందని వేరే చెప్పాలా?


ఇలా చేయాలి...

  • వ్యక్తిగత అభిరుచులు, విలువలకు అనుగుణంగా కెరీర్‌ను మార్చుకోవాలి. జీతం కోసం పనిచేసే ఉద్యోగం నుంచి సంతృప్తినిచ్చే ఉద్యోగం వైపు మారాలి.

  • దీర్ఘకాలంలో ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఆర్థిక వ్యూహాలను రూపొందించుకోవాలి. ఆస్తులను కూడబెట్టుకోవడం కన్నా వ్యక్తిగత వృద్ధికి దోహదపడే అవకాశాలను అందిపుచ్చుకోవాలి.

  • వృత్తిపరమైన జీవితం, వ్యక్తిగత జీవితం మధ్య స్పష్టమైన సరిహద్దులను ఏర్పాటు చేసుకోవాలి. బాధ్యతలను పునఃసమీక్షించుకోవాలి.

  • వర్క్‌ లైఫ్‌ బ్యాలెన్స్‌ చాలా ముఖ్యం.


book3.4.jpg

  • శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి.

  • ఏ విషయంలోనైనా అసంతృప్తి ఉంటే ఎదుగుదల ఉండదు. అంచనాలను చేరుకోలేక పోతున్నప్పుడు అసంతృప్తి మొదలవుతుంది.

  • కెరీర్‌లో మార్పు రావడం, ఆప్తులను కోల్పోవడం వంటివి జీవితంలో బ్రేక్‌కి కారణమవుతాయి. అయితే ఈ బ్రేక్‌ను... తిరిగి కొత్తగా మొదలుపెట్టడానికి ఒక అవకాశంగా మలుచుకోవచ్చు.

  • కొన్నిసార్లు కెరీర్‌ లేక వ్యక్తిగత జీవితం స్తబ్దుగా ఉందనిపిస్తుంది. అలాంటి సమయంలో రీసెట్‌ కావడం ద్వారా కొత్త అవకాశాలను కనుగొనేందుకు అడుగు వేయవచ్చు.


  • కెరీర్‌ ఒక వైపు, ఇంటి వ్యవహారాలు చక్కబెట్టడం మరో వైపు... బిజీ షెడ్యూల్‌తో జీవితంపై నియంత్రణ కోల్పోతున్నట్టు అనిపిస్తున్న సమయంలో రీసెట్‌ కావడం ద్వారా తిరిగి నియంత్రణ సాధించేందుకు అవకాశం ఏర్పడుతుంది.

  • ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం, పోషకాహార లోపం, నెగిటివ్‌ ఆలోచనలు, సోషల్‌ మీడియాకు బానిస కావడం వంటివన్నీ మార్పునకు సంకేతాలు. రీసెట్‌ కావడం వల్ల వీటన్నింటిని సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది.

  • కుటుంబ ఒత్తిడి లేదా పని ఒత్తిడి నిర్ణయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నట్లయుతే రీసెట్‌ కావాల్సిందే. సన్నిహితులు, కొలీగ్స్‌, సోషల్‌ మీడియా... లైఫ్‌ని డిక్టేట్‌ చేయకుండా, మరింత ఫోకస్‌గా ఉండేందుకు ‘రీసెట్‌’ సహాయపడుతుంది.


ఈ వార్తలు కూడా చదవండి:

మరో 260 వందేభారత్‌ స్లీపర్‌ రైళ్ల తయారీ

ఆర్టీసీలో 198 పోస్టులకు 29న రాత పరీక్ష

Read Latest Telangana News and National News

Updated Date - Mar 22 , 2026 | 08:37 AM