శంషాబాద్‌లో పెరిగిన ఎయిర్ ట్రాఫిక్
ABN , Publish Date - Mar 22 , 2026 | 06:10 AM
తెలంగాణలో విమాన ప్రయాణికుల రద్దీ, సరుకు రవాణా సేవలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా విడుదలైన సామాజిక ఆర్థిక సర్వే గణాంకాల ప్రకారం..
2024-25లో 2.9కోట్ల మంది ప్రయాణాలు
సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడి
హైదరాబాద్, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో విమాన ప్రయాణికుల రద్దీ, సరుకు రవాణా సేవలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా విడుదలైన సామాజిక ఆర్థిక సర్వే గణాంకాల ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ), బేగంపేట విమానాశ్రయం కలిపి మొత్తం 2.9 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందించాయి. అంతకుముందు సంత్సరం (2023-24) లో నమోదైన 2.5 కోట్ల ప్రయాణాలతో పోలిస్తే, ఇది ఏకంగా 16.49 శాతం వృద్ధిని సూచిస్తోంది. మొత్తం ప్రయాణికులలో దాదాపు 2.44 కోట్ల మంది దేశీయ ప్రాంతాలకు ప్రయాణించగా, 47.31 లక్షల మంది అంతర్జాతీయ గమ్యస్థానాలకు చేరుకున్నారు. కేవలం ప్రయాణికులే కాకుండా, సుమారు 1.65 లక్షల టన్నుల సరుకు రవాణా (కార్గో) జరిగిందని సర్వేలో వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్ విమానాశ్రయం నుంచి 23 అంతర్జాతీయ, 8 దేశీయ విమానయాన సంస్థలు తమ సేవలు అందిస్తున్నాయి. 3 ప్రత్యేక కార్గో విమానయాన సంస్థలు హైదరాబాద్ నుంచి ఫ్రైటర్ సేవలను నిర్వహిస్తున్నాయి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకని, 2047 నాటికి హైదరాబాద్ విమానాశ్రయాన్ని ప్రపంచ స్థాయి విమానయాన కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అప్పటికి ఏటా సుమారు 8 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందించేలా ఎయిర్‌పోర్టు సామర్థ్యాన్ని భారీగా విస్తరించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.