పెళ్లి ముచ్చట మారింది!
ABN , Publish Date - Mar 01 , 2026 | 12:46 PM
పెళ్లంటే రెండు కుటుంబాల కలయికే కాదు.. ప్రధానంగా ఇద్దరి ఆలోచనల కలయిక! ఈ పదేళ్లలో పెళ్లి ముచ్చట బాగానే మారింది.
పెళ్లంటే రెండు కుటుంబాల కలయికే కాదు.. ప్రధానంగా ఇద్దరి ఆలోచనల కలయిక! ఈ పదేళ్లలో పెళ్లి ముచ్చట బాగానే మారింది. పాత కట్టుబాట్లను బ్రేక్ చేస్తూ యువతరం కొత్త రూల్స్ రాస్తోంది. అది పెళ్లి చేసుకునే వయసు కావొచ్చు... భాగస్వామిని ఎంచుకునే పద్ధతి కావొచ్చు. నేటితరం షాదీ సిద్ధాంతాలివి...
మన దేశంలో పెళ్లి పట్ల యువతరం అభిప్రాయాల్లో చాలామార్పు వచ్చింది. ఓ ప్రముఖ మ్యాట్రిమోని సంస్థ 2016 నుంచి 2025 మధ్య సదరు ప్లాట్‌ఫాంలో ఉన్న 30 వేల మంది యూజర్లతో ఓ సర్వే నిర్వహించింది. దాని ప్రకారం వివాహ సగటు వయసు 27 నుంచి 29కి పెరిగిందని తేలింది.
గతంలో నిర్ణీత వయసు రాగానే పెళ్లి చేసుకోవాలనే ఒత్తిడి ఉండేది. కానీ ఇప్పుడు యువత ఒక నిర్దిష్ట వయసు, ఆదాయం కన్నా తమకు తగ్గ సరైన భాగస్వామి దొరకడమే ముఖ్యమని భావిస్తోంది. 50 శాతం మంది 29వ ఏట భాగస్వామి కోసం వెదకడం ప్రారంభిస్తున్నారు.
కులం పట్టింపు తగ్గిపోయింది. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడంలో కులం ముఖ్యం కాదని చెబుతున్నారు. పదేళ్ల క్రితంతో పోలిస్తే ఇలాంటివారి సంఖ్య పెరిగింది. గ్రామాలతో పోలిస్తే పట్టణాలు, నగరాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.

87 శాతం మంది యువకులు తమ కన్నా ఎక్కువ సంపాదన ఉన్న యువతిని పెళ్లి చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెబుతున్నారు. అలాగే 15 శాతం మంది అమ్మాయిలు తమ కన్నా తక్కువ సంపాదించే వారైనా ఫర్వాలేదనుకుంటున్నారు. కేవలం ఒకరి సంపాదన మీదే ఇల్లు గడవాలనే పద్ధతిని 92 శాతం మంది వ్యతిరేకిస్తున్నారు.
తొలి వివాహం విఫలమైన సందర్భాల్లో మరో పెళ్లి కోసం ఆరాటపడుతున్నవారి సంఖ్య పెరుగు తుంది. 2016లో 11 శాతం మంది రెండో పెళ్లి కోసం ప్రయత్నాలు సాగిస్తే... ఇప్పుడు వారి సంఖ్య 16 శాతానికి పెరిగింది. విడాకులు తీసుకున్న తర్వాత మరో పెళ్లి చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదని చాలామంది భావిస్తున్నారు. తొలిసారి పెళ్లికి సిద్ధమైనవారు కూడా అప్పటికే విడాకులు తీసుకున్నవారిని వివాహమాడేందుకు ముందుకొస్తున్నారు.
భాగస్వామి పెళ్లి తర్వాత ఉన్నత చదువుల కోసం లేదా రీస్కిల్లింగ్ కోసం ఉద్యోగానికి బ్రేక్ తీసుకోవడాన్ని పూర్తిగా సమర్థిస్తున్నారు. దీనిని కెరీర్ అభివృద్ధిలో ఒక భాగంగానే చూస్తున్నారు.
పెళ్లి అనేది వ్యక్తిగత వ్యవహారమని, భార్య/భర్తను తామే ఎంపిక చేసుకుంటామని యువత వాదిస్తోంది. వీరి సంఖ్య పదేళ్ల క్రితం 67 శాతం ఉంటే, ప్రస్తుతం 77 శాతానికి చేరుకుంది. పెళ్లి సంబంధం కుదిర్చే పనిని కుటుంబ సభ్యులకు అప్పగించే పరిస్థితి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. అలాగే పెళ్లి సంబంధాల విషయంలో తల్లిదండ్రుల కన్నా తోబుట్టువుల సలహాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.

చాలాకాలం ఎదురుచూసినా సరే, సరైన భాగస్వామి తారసపడితే... నిర్ణయం తీసుకోవడంలో ఏమాత్రం ఆలస్యం చేయడం లేదు. 78 శాతం మంది ఆరు నెలల్లోనే పెళ్లి పీటలు ఎక్కాలని కోరుకుంటున్నారు. అందులో సగం మంది 3 నెలల్లోపే వివాహం చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.
అతి కొద్దిమంది మాత్రమే ఒక నిర్ణీత వయసులో పెళ్లి చేసుకోవాలని భావిస్తే, 90 శాతం మంది సరైన వ్యక్తి దొరికినప్పుడే పెళ్లి చేసుకోవడం ముఖ్యం అంటున్నారు.
పెళ్లంటే యువతలో అయిష్టత ఏమీ లేదు. ఎప్పటికైనా ఒక ఇంటివారు కావాలనే కోరుకుంటున్నారు. కాకపోతే ఆర్థికంగా స్థిరంగా ఉండడం... మానసికంగా, వ్యక్తిగతంగా పెళ్లికి సిద్ధంగా ఉండడం... కెరీర్ గ్రోత్, రైట్ పర్సన్ వంటి అంశాల వల్ల పెళ్లి చేసుకునే వయసు పెరుగుతోందని సర్వేలో తేలింది.
ఈ వార్తలు కూడా చదవండి:
బంగారం, వెండిపై వార్ ఎఫెక్ట్.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
తిరుపతిలో మరో చారిత్రక ఘట్టం.. 16 కోర్టు భవనాలకు భూమి పూజ
Read Latest Telangana News and National News