పరీక్షల సమయం... ఏ ఆహారం మేలు
ABN , Publish Date - Mar 01 , 2026 | 12:09 PM
ప్రస్తుతం పరీక్షల సీజన్... ఈ సమయంలో పిల్లల మెదడు చురుకుగా ఉండేందుకు రోజూ ఎలాంటి ఆహారం ఇస్తే మంచిది?
ప్రస్తుతం పరీక్షల సీజన్... ఈ సమయంలో పిల్లల మెదడు చురుకుగా ఉండేందుకు రోజూ ఎలాంటి ఆహారం ఇస్తే మంచిది?
- యశోద, వనస్థలిపురం
పరీక్షల సమయంలో పిల్లల మెదడు చురుకుగా ఉండాలంటే రోజువారీ ఆహారం సమతుల్యంగా ఉండటం చాలా అవసరం. ఉదయం అల్పాహారంగా ఇడ్లీ, దోసె, పెసరట్టు లాంటి సంప్రదాయ ఆహారాలు మంచి శక్తిని ఇస్తాయి. వీటితో పాటు తప్పకుండా ప్రొటీన్ ఉండాలి. గుడ్డు, పప్పులు లేదా శెనగలు లాంటివి ఇవ్వడం వల్ల మెదడుకు అవసరమైన పోషకాలు అందుతాయి. అలాగే పీచుపదార్థాల కోసం కూరగాయలు చాలా ముఖ్యం. క్యారెట్, బీన్స్, పాలకూర, టమాటా, కీరా లాంటి కూరగాయలను కూరగా, చట్నీగా లేదా సలాడ్ రూపంలో చేర్చితే జీర్ణక్రియ మెరుగుపడి శక్తి ఎక్కువసేపు నిలకడగా ఉంటుంది.
మధ్యాహ్న భోజనంలో కూరగాయలు, పప్పులు, కొద్దిగా అన్నం లేదా రొట్టె, పెరుగు ఉండేలా చూడాలి. మెదడు ఆరోగ్యానికి బాదం, ఆక్రోట్ లాంటి నట్స్, అలాగే రోజుకు ఒక పండు ఇవ్వడం మంచిది. తగినంత నీరు కూడా చాలా అవసరం. డీహైడ్రేషన్ వల్ల అలసట, ఏకాగ్రత లోపం కలగవచ్చు. జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ స్నాక్స్, చక్కెర అధికంగా ఉన్న పానీయాలను తగ్గించాలి. ఇవి తాత్కాలిక శక్తిని ఇచ్చినా త్వరగా అలసటకు దారితీస్తాయి. సరిపడా నిద్ర, మధ్య మధ్యలో చిన్న విరామాలు కూడా పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. మొత్తంగా, తాజా ఆహారపదార్థాలు, ఇంట్లో తయారుచేసిన సమతుల ఆహారం పిల్లల మెదడు చురుకుగా ఉండేందుకు ఉత్తమమైనది.
మార్కెట్‌లో ఎన్నో రకాల రెడ్ బీన్స్ కనిపిస్తున్నాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
- సరోజ, వరంగల్
మార్కెట్‌లో కనిపించే రెడ్ బీన్స్ (రాజ్మా, రెడ్ కిడ్నీ బీన్స్ లాంటి రకాలు) ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైన పప్పుధాన్యాలు. వీటిలో మాంసకృత్తులు, పీచుపదార్థాలు అధికంగా ఉండటం వల్ల శరీరానికి శక్తిని నెమ్మదిగా అందించి ఎక్కువసేపు తృప్తిని కలిగిస్తాయి. పీచు జీర్ణక్రియను మెరుగుపరచి రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా సహాయపడుతుంది, అందువల్ల డయాబెటీస్ ఉన్నవారికి కూడా ఇవి మంచివి. రెడ్ బీన్స్‌లో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఫోలేట్ లాంటి ముఖ్యమైన ఖనిజాలు ఉండి రక్తహీనతను నివారించడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి.
అలాగే వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో వాపును తగ్గించడంలో, రోగనిరోధకశక్తిని పెంచడంలో ఉపయోగపడతాయి. బరువు నియంత్రణ కోరుకునేవారికి కూడా ఇవి మంచి ఎంపిక. ఎందుకంటే తక్కువ కొవ్వు ఉండి ఆకలిని నియంత్రిస్తాయి. అయితే రెడ్ బీన్స్‌ను నానబెట్టి, నీటిని మార్చి బాగా ఉడికించి తినడం చాలా ముఖ్యం. అలా చేయడం వల్ల జీర్ణం చేసుకోవడం సులభ మవుతుంది. గ్యాస్‌లాంటి సమస్యలు తగ్గుతాయి. కూరలు, టిక్కీలు లాంటి స్నాక్స్, సలాడ్లు లేదా సూప్‌లు ఇలా వివిధ రూపాల్లో ఆహారంలో చేర్చుకోవచ్చు.
ఈ మధ్య చక్కెర తగ్గించాలని చెబుతున్నారు కదా. అయితే ఖర్జూరం లేదా బెల్లంతో చేసిన స్వీట్లు నిజంగా ఆరోగ్యకరమా? వాటిని అందరూ తినవచ్చా?
- సునీత, నల్గొండ
చక్కెర ఏ రూపంలో ఉన్నా చివరికి శరీరంలో అది షుగర్‌లాగానే పనిచేస్తుంది. బెల్లం, తేనె, ఖర్జూరం అన్నీ సహజమైనవైనా ఇవి కూడా రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. అందువల్ల బెల్లం లేదా తేనెతో చేసిన స్వీట్లు ‘పూర్తిగా ఆరోగ్యకరమైనవి’ అని భావించకూడదు. ప్రభావం మాత్రం చక్కెరలాగే ఉంటుంది. ఖర్జూరం విషయంలో మాత్రం కొంత ఫైబర్, ఖనిజాలు ఉండటం వల్ల అప్పుడప్పుడు 1-2 ఖర్జూరాలు తినడం సరే, కానీ రోజూ లేదా ఎక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు, బరువు తగ్గాలనుకునేవారు అన్ని రకాల తీపి పదార్థాలను పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. మొత్తంగా చెప్పాలంటే, తీపి ఏ రూపంలో ఉన్నా మితమే ఆరోగ్యానికి మంచిది.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్
(పాఠకులు తమ సందేహాలను
sunday.aj@gmail.comకు పంపవచ్చు)
ఈ వార్తలు కూడా చదవండి:
బంగారం, వెండిపై వార్ ఎఫెక్ట్.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
తిరుపతిలో మరో చారిత్రక ఘట్టం.. 16 కోర్టు భవనాలకు భూమి పూజ
Read Latest Telangana News and National News