డాక్టర్ కంటే ముందు గూగుల్.. అనారోగ్యంగా అనిపిస్తే మొదట ఏఐని సంప్రదిస్తున్న ప్రజలు
ABN , Publish Date - Sep 28 , 2026 | 08:54 PM
ఇదివరకు ఏదైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే ప్రజలు వెంటనే వైద్యుడి తలుపు తట్టేవారు. ఇప్పుడు ఆ పద్ధతి కొంత మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇదివరకు ఏదైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే ప్రజలు వెంటనే వైద్యుడి తలుపు తట్టేవారు. ఇప్పుడు ఆ పద్ధతి కొంత మారింది. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు వస్తే వారు మొదట గూగుల్‌నో, చాట్‌జీపీటీనో సంప్రదిస్తున్నారు. ఆ తరువాత డాక్టర్ దగ్గరకు వెళ్లాలా.. వద్దా అన్న నిర్ణయం తీసుకుంటున్నారు. తమ అనారోగ్యం గురించి గూగుల్‌తో చర్చించాకే వైద్యుడి అపాయింట్‌మెంట్ తీసుకుంటున్నారన్నమాట. తలనొప్పి నుంచి కడుపునొప్పి దాకా ఇలా ఏ సమస్య ఉన్న ఫస్టు ఓటు ఏఐ డాక్టర్‌కే వేస్తున్నారు. ఈ ధోరణి వెనుక కారణాలను ఆన్‌లైన్ చికిత్సా మిత్ర వ్యవస్థాపకురాలు స్మృతి టాండన్ ఇటీవల విశ్లేషించారు.
తమ పరిస్థితి గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలన్న ఆలోచనతోనే చాలామంది ఇలా గూగుల్ సెర్చ్‌కు పని చెబుతారని స్మృతి అంటున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా లేదా అన్న విషయం తెలుసుకునేందుకు ఆన్‌లైన్‌లో శోధిస్తారని చెబుతున్నారామె. ‘నాకొచ్చిన సమస్య మునుపు ఎవరికైనా వచ్చిందా..? లేక ఇదేమన్న అరుదైన జబ్బా..? చికిత్స అంటూ ఉందా..?’ అనే అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి వారు ఈ ధోరణిని అవలంబిస్తున్నారని ఆమె విశ్లేషించారు. ‘ఒకవేళ పెద్ద సమస్యే అయితే ఏ డాక్టర్‌ను సంప్రదించాలి..? చికిత్సకు ఏమాత్రం ఖర్చవుతుంది..?’ లాంటి ప్రశ్నలకూ సమాధానాలు వెతకడానికి ప్రయత్నిస్తారని వివరించారు.
బిల్లుల భయం కూడా ఓ కారణం
ఏవైనా అసాధారణ లక్షణాలు కనిపిస్తే వైద్యుడి కంటే ముందు గూగుల్‌ను ఆశ్రయించడానికి భయం కూడా ఒక కారణమని స్మృతి టాండన్ తెలిపారు. ‘ఆసుపత్రికి వెళ్తే.. అవసరంలేని పరీక్షలు చేసి, అక్కర్లేని మందులు రాసి బారెడు బిల్లు చేతిలో పెడతారని కొందరు భయపడుతుంటారు. అత్యవసరమైతే తప్ప డాక్టరు దగ్గరకి వెళ్లకూడదని భావిస్తుంటారు. అలాంటి వారు మొదట ఏఐ డాక్టర్‌ను సంప్రదిస్తున్నారు’ అని ఆమె చెప్పారు.
ఇతర కారణాలెన్నో..
ఈ ధోరణి వెనుక ఇంకా చాలా కారణాలున్నాయని స్మృతి వెల్లడించారు. ‘ఆసుపత్రిలో రద్దీ ఉంటోందని, గంటలు తరబడి వేచి ఉండాల్సి వస్తోందని కొందరు మొదట గూగుల్‌ను సంప్రదిస్తున్నారు. డాక్టర్లను అడగలేని ప్రశ్నలను మొహమాటం లేకుండా ఏఐని అడగొచ్చు అని అనుకునేవారూ ఉన్నారు. తమ సమస్యను వంటింటి చిట్కాలతో తగ్గించుకోవాలని భావించి కొందరు డాక్టర్ల కంటే ముందు చాట్‌జీపీటిని ఆశ్రయిస్తున్నారు’ అని ఆమె పేర్కొన్నారు.
ఇవీ చదవండి