Share News

రాహుల్ గాంధీ ఓటు చోరీ ఆరోపణలపై మంత్రి సత్యకుమార్‌ ఫైర్..

ABN , Publish Date - Sep 28 , 2026 | 05:09 PM

దేశంలో ఓటు చోరీ పేరుతో కాంగ్రెస్, కొత్తగా పుట్టుకొచ్చిన మరికొన్ని పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. రాహుల్ గాంధీ నాయకుడిగా చూపించుకోవడంలో ప్రజల ముందు విఫలమయ్యారని, తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ ఓటు చోరీ ఆరోపణలపై మంత్రి సత్యకుమార్‌ ఫైర్..
Minister Satya Kumar Yadav

విజయవాడ: దేశంలో ఓటు చోరీ పేరుతో కాంగ్రెస్, కొత్తగా పుట్టుకొచ్చిన మరికొన్ని పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. రాహుల్ గాంధీ నాయకుడిగా చూపించుకోవడంలో ప్రజల ముందు విఫలమయ్యారని, తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఓటమి నిరాశతో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, అబద్ధాలతో రాజకీయంగా ఎదగాలని కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని చేసినా ప్రజల అభిమానం పొందడంలో విఫలం కావడం రాహుల్ గాంధీకి అలవాటేనని ఎద్దేవా చేశారు.


ఎన్నికలకు ముందు కూడా స్కామ్‌లు అంటూ రాహుల్ గాంధీ హడావుడి చేశారని, ప్రజలు వారి మాటలు నమ్మకుండా బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత తమ మాటలను వెనక్కి తీసుకుని ప్రజలకు, ప్రధాని నరేంద్ర మోదీకి క్షమాపణ చెప్పారని పేర్కొన్నారు. అబద్ధాలు, అసత్యాలను ప్రోత్సహించే రాహుల్ గాంధీ టీమ్‌లు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పైనా నిందలు వేసి, ఆ తర్వాత క్షమాపణ చెప్పారని గుర్తు చేశారు. నెలలో రెండు సార్లు విదేశాలకు వెళ్తున్న రాహుల్ ఎవరినో కలిసి వస్తున్నారంటూ ప్రశ్నలు లేవనెత్తారు. దేశ భద్రత మీద కూడా ఆయన అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, ఎన్ని డ్రామాలు ఆడినా రాహుల్ గాంధీని ప్రజలు విశ్వసించడం లేదన్నారు. ఆడలేక మద్దెల ఓడ అన్నట్లుగా సాకులు చెబుతున్నారని, వేల కోట్లు దోచుకుని, ప్రజలతో ఛీ కొట్టించుకున్నా వారిలో మార్పు రాలేదని మండిపడ్డారు.


కొత్తగా ఇప్పుడు ఓటు చోరీ అంటూ సర్ ప్రక్రియపై రాహుల్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి నిప్పులు చెరిగారు. ఈ ప్రక్రియ కొత్తగా చేస్తున్న విధానం కాదని, బీఎల్‌ఏలు వచ్చి వివరాలు ఓపెన్‌గా రాసుకుంటారని తెలిపారు. ప్రజల ముందు వాటిని ఉంచి అభ్యంతరాలు కూడా చెప్పుకునే అవకాశం ఇస్తారన్నారు. ఓట్ల తొలగింపు అంత ఈజీ ప్రక్రియ కాదని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. పోలింగ్ రోజున అన్ని పార్టీల ఏజెంట్లు ఉంటారని, వెబ్‌క్యాస్టింగ్ ఉంటుందని పేర్కొన్నారు. ఆధారాలు చూపకుండా ఓటు చోరీ అంటే ఎలా కుదురుతుందంటూ మంత్రి ప్రశ్నించారు. 13 కోట్ల మంది ఓట్లు తొలగించాలని జాబితా సిద్ధం చేశారని, ముసాయిదా విడుదల చేయగా అభ్యంతరాలు చెప్పాలన్నారు. రెండున్నర కోట్ల మంది చనిపోయారని, 3 కోట్ల మంది అడ్రస్ లేదని మంత్రి తెలిపారు. అలాగే, ఆరున్నర కోట్ల మంది ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్లారని, కోటి మంది డూప్లికేట్ ఓటర్లు ఉన్నారని ఆయన వివరించారు.


అన్నీ పరిశీలించి వాస్తవాలు తెలుసుకుని ఎవరైనా మాట్లాడాలని మంత్రి సత్యకుమార్ హితవు పలికారు. ఏ రాజకీయ పార్టీకైనా అభ్యంతరం ఉంటే ఫామ్-7 ద్వారా తెలియజేయవచ్చని, 13 కోట్ల మంది ఓట్లు తీసేశారని మాత్రమే వాళ్లు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఆక్వా రైతులకు విద్యుత్‌ భరోసా.. రూ.55 కోట్లతో సబ్‌స్టేషన్‌ ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి

భూముల రక్షణ కోసం సుప్రీం కోర్టుకు 2,500 మంది ఆదివాసీలు

Updated Date - Sep 28 , 2026 | 05:09 PM