Share News

చేపల వాసనతో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలు మీకోసమే..

ABN , Publish Date - Feb 18 , 2026 | 01:42 PM

చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ వాటి నుంచి వచ్చే వాసన కారణంగా చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అయితే కొన్ని సులభమైన శుభ్రపరిచే చిట్కాలు పాటిస్తే చేపల వాసన పూర్తిగా తొలగిపోయి, రుచిగా వండుకోవచ్చు..

చేపల వాసనతో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలు మీకోసమే..
Fish Cleaning Tips

ఇంటర్నెట్ డెస్క్: చాలా మంది మాంసాహారులకు చేపలు ఎంతో ఇష్టమైన ఆహారం. అయితే చేపల నుండి వచ్చే వాసన కొందరికి ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. అందుకే చాలా మంది చేపలు తినడానికి వెనుకాడుతుంటారు. అయితే చేపలను సరైన విధంగా శుభ్రం చేస్తే వాసన పూర్తిగా తగ్గిపోతుంది. కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే చేపలు తాజాగా, వాసన లేకుండా తయారవుతాయి.


చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ D, ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యం, మెదడు పనితీరు, జుట్టు, కళ్ళు, ఎముకల బలానికి ఉపయోగపడతాయి. అలాగే చక్కెర, కొలెస్ట్రాల్ నియంత్రణలో కూడా సహాయపడతాయి. అందుకే చేపలను ఆహారంలో భాగంగా తీసుకోవడం మంచిది. అయితే దుర్వాసన సమస్యను నివారించేందుకు ఈ శుభ్రపరిచే పద్ధతులు ఉపయోగపడతాయి.


అల్లం-వెల్లుల్లి పేస్ట్..

చేపలను శుభ్రం చేసిన తర్వాత ఉప్పు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ రాసి 5 నుంచి 10 నిమిషాలు ఉంచాలి. తర్వాత రెండు లేదా మూడు సార్లు నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల చేపల వాసన తగ్గుతుంది.

ఉప్పు, పసుపు..

చేపలను కోసిన తర్వాత ఉప్పు, పసుపు రాసి కొంతసేపు ఉంచాలి. ఇవి సహజంగా బ్యాక్టీరియా, దుర్వాసనను తగ్గించడంలో సహాయపడతాయి.

ఉప్పు నీటితో శుభ్రం చేయడం..

ఒక పాత్రలో నీరు తీసుకుని అందులో ఉప్పు కలపాలి. ఆ నీటిలో చేపలను కొంతసేపు నానబెట్టి, తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. ఇది చేపల జిడ్డు, వాసనను తగ్గిస్తుంది.


వెనిగర్ లేదా నిమ్మరసం..

నీటిలో కొద్దిగా వెనిగర్ కలిపి చేపలను కడగవచ్చు. నిమ్మరసం లేదా వెనిగర్‌లో 10 నిమిషాలు నానబెట్టి తర్వాత నీటితో కడిగితే వాసన తగ్గుతుంది.

మొక్కజొన్న పిండి..

రెండు టేబుల్ స్పూన్ల మొక్కజొన్న పిండి, సగం నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కలిపి చేపలకు రాయాలి. రెండు నిమిషాల తర్వాత నీటితో బాగా కడిగితే వాసన పోతుంది.

పాలలో నానబెట్టడం..

చేపలను 25 నుంచి 30 నిమిషాలు పాలలో నానబెడితే దుర్వాసన తగ్గి చేపలు తాజాగా మారతాయి. ఈ చిట్కాలు పాటిస్తే చేపల దుర్వాసన తగ్గి, రుచిగా, ఆరోగ్యకరంగా వండుకోవచ్చు.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

ఉదయం నిద్రలేవగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? జాగ్రత్త.!

అధిక బరువు సమస్యకు ఈ ఆహారంతో చెక్ పెట్టండి!

For More Latest News

Updated Date - Feb 19 , 2026 | 03:02 PM