అధిక బరువు సమస్యకు ఈ ఆహారంతో చెక్ పెట్టండి!
ABN , Publish Date - Feb 05 , 2026 | 08:53 PM
ఇటీవల కాలంలో అధిక బరువు చాలా మందిని ఇబ్బంది పెడుతోంది. బరువు అనేది శరీరాకృతిలో మార్పు మాత్రమే కాదు.. తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు మూలకారణం అవుతోంది. అధిక బరువు తగ్గాలంటే కొన్ని ఆహార నియమాలు పాటించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య అధిక బరువు. ఇది శారీరక ఆకృతిని దెబ్బతీసి.. ఆత్మవిశ్వాసాన్ని తగ్గించడమే కాకుండా, అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే, సరైన ప్రణాళిక ఉంటే బరువు తగ్గడం అంత కష్టమైన పని కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తక్కువ క్యాలరీలు, అధిక ప్రోటీన్, ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవడం, రోజుకు కనీసం 30-40 నిమిషాలపాటు నడక, బాగా నీరు తాగడం ద్వారా బరువు తగ్గవచ్చు. బరువు తగ్గడానికి మీరు తీసుకోవాల్సిన ఆహారం గురించి తెలుసుకుందాం.
1. ఓట్స్:
ఓట్స్‌లో ఫైబర్ (పీచు పదార్థం) పుష్కలంగా ఉంటుంది. ఇది తిన్న చాలా సేపు తర్వాత కూడా కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. దీని వల్ల మనం అవసరమైన స్నాక్స్ తినకుండా ఉంటాము. దీంతో చాలా వరకు బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
2. మెంతులు:
మెంతులు తినడానికి చేదుగా ఉన్నా.. వీటిలో అద్భుతమైన పోషకాలు ఉన్నాయి. రాత్రిపూట మెంతులను నీళ్లలో నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని తాగి మెంతులను నమిలి తింటే మెటబాలిజం పెరుగుతుంది. ఇక కొవ్వును కరిగించడానికి బాగా సహాయపడుతుంది.
3. చిరుధాన్యాలు:
రాగులు, జొన్నలు, సజ్జలు వంటి చిరుధాన్యాల్లో కార్పోహైడ్రేట్లు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వైట్ రైస్ కు బదులు వీటిని తీసుకోవడం చాలా మంచిది.
4. పప్పు ధాన్యాలు:
పెసర్లు, శనగలు వంటి మొలకెత్తిన గింజల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల కండరాలు దృఢంగా మారి, కొవ్వు చాలా వరకు తగ్గుతుంది.
5. గ్రీన్ టీ:
రోజూ రెండు సార్లు గ్రీన్ టీ తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్తాయి. ఇది యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తూ.. బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.
6. చియా విత్తనాలు, సబ్జా గింజలు:
చియా విత్తనాల్లో ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. సబ్జా గింజలను నీటిలో నానబెట్టి తాగడం వల్ల కడుపు నిండుగా అనిపిస్తుంది. తద్వారా అతిగా తినడం మానేస్తారు.
7. గుమ్మడికాయ:
గుమ్మడికాయలో క్యాలరీలు చాలా తక్కువ, కానీ ఫైబర్ ఎక్కువ. గుమ్మడి గింజలు మెగ్నీషియంను అందిస్తాయి. ఇది శరీరానికి శక్తినిస్తూ ఆకలిని నియంత్రిస్తుంది.
8. పెరుగు:
పెరుగులోని ‘ప్రోబయోటిక్స్’ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. పొట్ట దగ్గర కొవ్వు కరగడానికి పెరుగు ఎంతగానో ఉపయోగపడుతుంది.
9. పండ్లు:
పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువ, క్యాలరీలు తక్కువ. ఇది శరీరానికి హైడ్రేషన్ ఇస్తూ బరువు తగ్గిస్తుంది. ఇక బొప్పాయి జీర్ణక్రియను వేగవంతం చేసి, కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.
ఒక్కోసారి థైరాయిడ్ లేదా హార్మోన్ల సమస్యల వల్ల కూడా బరువు పెరుగుతుంటారు. కాబట్టి, డైట్ ప్రారంభించే ముందు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకుని డైట్ ఫాలో అయితే మంచిది.