Share News

గుడ్డులోని పచ్చసొన తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

ABN , Publish Date - Mar 13 , 2026 | 08:31 AM

కోడిగుడ్డు ఆరోగ్యానికి మంచిదని తెలిసినా, అందులోని పచ్చసొన తినాలా వద్దా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే, పచ్చసొనను పూర్తిగా నివారిస్తే శరీరానికి అవసరమైన కొన్ని పోషకాలు అందకపోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

గుడ్డులోని పచ్చసొన తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
Egg Yolk Health Benefits

ఇంటర్నెట్ డెస్క్: చాలా మంది అల్పాహారంలో కోడిగుడ్లు తినడం ఇష్టపడతారు. అయితే.. గుడ్డులోని పచ్చసొనను తినాలా వద్దా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. పచ్చసొనలో కొవ్వు ఎక్కువగా ఉంటుందని, అది గుండెకు హానికరమని భావించి చాలా మంది దాన్ని తీసేయడం అలవాటుగా మార్చుకున్నారు. కానీ తాజా శాస్త్రీయ అధ్యయనాలు పచ్చసొనను పూర్తిగా దూరం పెట్టడం వల్ల శరీరానికి అవసరమైన కొన్ని ముఖ్యమైన పోషకాలు తగ్గిపోవచ్చని చెబుతున్నాయి.


పచ్చసొన గుండెకు హానికరమా?

ఆధునిక వైద్య పరిశోధనల ప్రకారం ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులలో గుడ్లలో ఉండే కొలెస్ట్రాల్ రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలపై పెద్దగా ప్రభావం చూపదు. మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) పెరగడానికి ప్రధాన కారణం ఫాస్ట్ ఫుడ్, ట్రాన్స్ ఫ్యాట్లు, అధిక సంతృప్త కొవ్వులు ఉన్న ఆహారాలు. కొన్ని అధ్యయనాలు గుడ్లను మితంగా తినడం వల్ల గుండెకు మంచిగా పనిచేసే మంచి కొలెస్ట్రాల్ (HDL) పెరిగే అవకాశం ఉందని సూచిస్తున్నాయి.

ప్రభావం ఒకేలా ఉండదు

గుడ్లు తినడం వల్ల చాలా మందికి పెద్దగా సమస్యలు రాకపోయినా, శరీర ప్రతిస్పందన వ్యక్తికి, వ్యక్తికీ మారుతుంది. వంశపారంపర్యంగా అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు లేదా ఇప్పటికే అధిక కొవ్వు ఆహారం తీసుకునేవారు గుడ్లను మితంగా తీసుకోవడం మంచిది. మధుమేహం లేదా గుండె సమస్యలు ఉన్నవారు గుడ్లు తినే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.


పచ్చసొనను వదిలేస్తే ఏమి కోల్పోతాం?

పచ్చసొనను కేవలం కొవ్వు మాత్రమే ఉన్న భాగంగా భావించడం సరైంది కాదు. ఇందులో శరీరానికి అవసరమైన అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ A, D, E, B12, ఐరన్, అలాగే మెదడు అభివృద్ధికి ముఖ్యమైన కోలిన్ అనే పోషకం పచ్చసొనలో ఉంటుంది. అలాగే పచ్చసొనలో ఉండే ల్యూటిన్, జియాక్సంతిన్ అనే పోషకాలు కంటి ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి. మంచి నాణ్యత కలిగిన ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఇందులో ఉంటాయి. పచ్చసొనను పూర్తిగా తీసేయడం వల్ల ఈ ముఖ్యమైన పోషకాలు శరీరానికి అందకుండా పోవచ్చు.


రోజుకు ఎన్ని గుడ్లు తినవచ్చు?

గుడ్ల వినియోగం వ్యక్తి ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.

  • ఆరోగ్యంగా ఉన్నవారు రోజుకు 1–2 గుడ్లు లేదా వారానికి సుమారు 7 గుడ్లు తినవచ్చు.

  • వృద్ధులు (65 ఏళ్లు పైబడిన వారు) కండరాల బలం, మెదడు పనితీరుకు రోజుకు 1–2 గుడ్లు సరిపోతాయి.

  • మధుమేహ రోగులు వారానికి 3–4 గుడ్లకు పరిమితం కావడం మంచిది.

  • గుండె రోగులు వైద్యుల సలహా మేరకు వారానికి 3–4 గుడ్లు మాత్రమే తినాలి.

  • పిల్లలు, యువత.. సమతుల్య ఆహారంలో భాగంగా రోజుకు 1–2 గుడ్లు తినొచ్చు.


గుడ్లు ఎలా తింటే మంచిది?

గుడ్ల ఆరోగ్య ప్రయోజనాలు వాటిని ఎలా తింటామన్నదానిపై కూడా ఆధారపడి ఉంటాయి. కూరగాయలు, ధాన్యాలు, లీన్ ప్రోటీన్లతో కలిసి గుడ్లు తింటే శరీరానికి మంచి ప్రయోజనాలు అందుతాయి. అయితే అధిక వెన్న, ప్రాసెస్ చేసిన మాంసం లేదా ఎక్కువ నూనెతో తయారు చేసిన ఆహారాలతో గుడ్లు తింటే గుండె ఆరోగ్యానికి హానికరం కావచ్చు. మొత్తంగా చూస్తే, గుడ్డు పచ్చసొనను పూర్తిగా వదిలేయకుండా మితంగా గుడ్లు తినడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read

వేసవిలో బయటకు వెళ్లే ముందు ఈ స్కిన్‌కేర్ తప్పనిసరి

బొప్పాయి తినడానికి సరైన సమయం తెలుసా?

For More Latest News

Updated Date - Mar 13 , 2026 | 08:49 AM