Share News

భారత్‌కు ఊరటనిచ్చేనా?

ABN , Publish Date - Nov 05 , 2026 | 04:59 AM

అమెరికా మిడ్‌టర్మ్‌ ఎన్నికల ఫలితాలతో అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు రిపబ్లికన్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

భారత్‌కు ఊరటనిచ్చేనా?
Modi and Trump

  • వాణిజ్యం, వలసలు, వ్యూహాత్మక భాగస్వామ్యంపై ప్రభావం

  • రిపబ్లికన్ల ఓటమితో అమెరికాలో మారిన సమీకరణాలు

  • సుంకాలు, రష్యా చమురుపై ఆంక్షలు, హెచ్‌-1బీ వీసాలపై భారత్‌కు కొంత ఊరట?

వాషింగ్టన్‌, నవంబరు 4: అమెరికా మిడ్‌టర్మ్‌ ఎన్నికల ఫలితాలతో అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు రిపబ్లికన్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ప్రతినిధుల సభ(హౌస్‌), సెనేట్‌ రెండింటిలోనూ డెమోక్రాట్లు ఆధిక్యం సాధించి పట్టు బిగించడంతో ట్రంప్‌ దూకుడుకు కళ్లెం పడినట్లయింది. వాషింగ్టన్‌లో అధికార సమతుల్యతలో మార్పులు చోటుచేసుకోవడం యావత్‌ ప్రపంచాన్నేగాక భారత విదేశాంగ, వాణిజ్య వర్గాల్లోనూ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ట్రంప్‌ దూకుడు నిర్ణయాలు, సుంకాల బాదుడుతో సతమతమైన భారత్‌కు ఈ ఫలితాలు కొంత ఊరటనిస్తాయా లేక కొత్త చిక్కులు తెచ్చిపెడతాయా? భారత్‌తో వాణిజ్య సంబంధాలు, టారిఫ్‌లు, వలస విధానాలు, వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? అన్న అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

సుంకాల దూకుడుకు చెక్‌ పడేనా?

ట్రంప్‌ విధించిన సుంకాలు (టారిఫ్‌లు) భారత ఎగుమతులకు తీవ్ర నష్టం కలిగించాయి. గతంలో 50శాతం వరకు చేరిన సుంకాలను 18శాతంకి తగ్గించినప్పటికీ, వాణిజ్య చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇప్పుడు డెమోక్రాట్ల నియంత్రణలోకి వెళ్లిన కాంగ్రెస్‌.. ట్రంప్‌ ఏకపక్ష సుంకాల వల్ల అమెరికా వినియోగదారులు, వ్యాపారాలపై పడుతున్న ప్రభావాన్ని ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ పరిణామం భారత్‌కు కొంత ఊరటనిచ్చే అంశంగా భావిస్తున్నారు. అయితే డెమోక్రాట్లు పూర్తిగా స్వేచ్ఛా వాణిజ్యానికి అనుకూలం కాకపోవడంతో మార్కెట్‌ యాక్సెస్‌ విషయంలో భారత్‌కు సవాళ్లు తప్పకపోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మధ్యంతర ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో భారత్‌తో త్వరగా వాణిజ్యం ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్‌ కోరుకుంటారని అభిప్రాయపడుతున్నారు. .


హెచ్‌-1బీ వీసాలపై ఆంక్షలకు వ్యతిరేకంగా అమెరికా కాంగ్రెస్‌లో చర్చలు జరిగే అవకాశం ఉంది. రష్యా చమురు కొనుగోళ్ల విషయంలోనూ ట్రంప్‌ ప్రభుత్వ వైఖరిపై పర్యవేక్షణ పెరగవచ్చు. అయితే, ఈ పరిణామాలన్నీ భారత్‌కు అనుకూలంగా మారుతాయని చెప్పలేం. రష్యా నుంచి చమురు కొనుగోలు అంశంలో డెమోక్రాట్ల వైఖరి కూడా కఠినంగా ఉండొచ్చని భావిస్తున్నారు

భారత టెకీలకు వెసులుబాటు?

అమెరికాలో పని చేసే భారతీయ నిపుణులను, ఐటీ కంపెనీలను తీవ్ర ఆందోళనకు గురిచేసిన హెచ్‌-1బీ కొత్త పిటిషన్లపై లక్ష డాలర్ల రుసుము ప్రతిపాదనకు ఇప్పటికే కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగిలాయి. వలస విధానాలు చాలా వరకు అధ్యక్షుడి ప్రత్యక్ష పరిధిలోనివే అయినప్పటికీ, కాంగ్రెస్‌ నిలదీతలతో భారతీయ ఐటీ ఉద్యోగులకు మరింత వెసులుబాటు లభించవచ్చని భావిస్తున్నారు.

రక్షణ, సాంకేతిక రంగాల్లో కొనసాగనున్న భాగస్వామ్యం

భారత్‌-అమెరికా సంబంధాల్లో వాణిజ్యం, వలస విధానాలే కాకుండా రక్షణ, సాంకేతిక సహకారం కూడా కీలకమైనవి. చైనా ప్రాబల్యాన్ని ఎదుర్కోవడం, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో స్థిరత్వాన్ని కాపాడడం వంటి అంశాల్లో ఇరు దేశాల ప్రయోజనాలు పరస్పరం ముడిపడి ఉన్నాయి. అమెరికాలో అధికార మార్పులు జరిగినా.. ఈ వ్యూహాత్మక ప్రయోజనాలు పెద్దగా మారే అవకాశం లేదు. రక్షణ రంగంలో సహకారం, కీలక సాంకేతిక పరిజ్ఞానం, సరఫరా వ్యవస్థల అభివృద్ధి వంటి అంశాల్లో ఇరు దేశాల భాగస్వామ్యం కొనసాగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, ట్రంప్‌ విదేశాంగ విధానంలో ఏకపక్ష నిర్ణయాలకు ప్రాధాన్యం ఇవ్వడం అంతర్జాతీయ సంబంధాల్లో అనిశ్చితిని పెంచుతోంది. కాంగ్రెస్‌లో డెమోక్రాట్ల ఆధిపత్యం ఆయన నిర్ణయాలపై కొంత నియంత్రణ కల్పించినా.. విదేశాంగ విధానంలో అధ్యక్షుడి అధికారాలు కొనసాగుతాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

డెమోక్రాట్లపై ట్రంప్ చివరి అస్త్రం! ఎలా పనిచేస్తుందంటే.

అమెరికా తొలి ముస్లిం సెనెటర్ భార్యకు భారతీయ మూలాలు

Updated Date - Nov 05 , 2026 | 04:59 AM