Share News

హోర్ముజ్‌లో రవాణా పునరుద్ధరించాలి.. జలసంధిలో ఈదుతూ బ్రిటిష్ స్విమ్మర్ వినతి

ABN , Publish Date - Nov 22 , 2026 | 11:49 AM

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధిపై తీవ్రంగా ప్రభావం పడుతోందని, సముద్ర పర్యావరణానికి ముప్పుగా వాటిల్లుతోందని బ్రిటిష్ ఈతగాడు లూయిస్ ప్యూ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలని, వ్యూహాత్మకమైన హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలను పునరుద్ధరించాలని ఆయన కోరారు.

హోర్ముజ్‌లో రవాణా పునరుద్ధరించాలి.. జలసంధిలో ఈదుతూ బ్రిటిష్ స్విమ్మర్ వినతి

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధిపై తీవ్రంగా ప్రభావం పడుతోందని, సముద్ర పర్యావరణానికి ముప్పుగా వాటిల్లుతోందని బ్రిటిష్ ఈతగాడు లూయిస్ ప్యూ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలని, వ్యూహాత్మకమైన హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలను పునరుద్ధరించాలని ఆయన కోరారు. దాడుల కారణంగా సముద్రంలో కలిసిన చమురు, ఇతర కాలుష్య శకలాలను తొలగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ) సముద్రాల పరిరక్షణకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న 56 ఏళ్ల ప్యూ.. ఒమన్ తీరానికి సమీపంలో మూడు రోజులపాటు ఈతకొట్టి సముద్ర పర్యావరణానికి పొంచి ఉన్న ముప్పును ప్రపంచం దృష్టికి తీసుకొచ్చారు. మొత్తం 15 కిలోమీటర్లు (9.3 మైళ్లు) ఈదారు. ఒమన్‌లోని ముసందమ్ ద్వీపకల్పం నుంచి ప్రారంభించి కేప్ ఆఫ్ హోర్ముజ్‌లో కొంత భాగాన్ని ఆయన ఈదారు.


మొదటి రోజు నీటిలోకి దిగిన అరగంటకే ఆయన ఈత కొడుతున్న ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఓ చమురు నౌకపై దాడి జరిగింది. పేలుళ్ల ధాటికి సముద్ర జలాలు కంపించాయని ప్యూ వెల్లడించారు. తర్వాతి రెండు రోజుల్లోనూ మరికొన్ని వాణిజ్య నౌకలపై మరిన్ని దాడులు జరగడాన్ని, కొన్ని నౌకలు మంటల్లో చిక్కుకోవడాన్ని ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. చమురు ట్యాంకర్లు, గ్యాస్ నౌకలు, వాణిజ్య నౌకలపై వరుస దాడులు సముద్ర పర్యావరణంపై దీర్ఘకాలిక ప్రభావం చూపే ప్రమాదం ఉందని ప్యూ హెచ్చరించారు. సముద్రంలో కలిసే చమురు, విషపూరిత పదార్థాలు.. డాల్ఫిన్లు, సముద్ర తాబేళ్లు, డుగాంగ్‌ల వంటి జీవుల మనుగడను దెబ్బతీయవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నష్టం భావితరాలపైనా ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ‘‘హోర్ముజ్ జలసంధి కీలకమైన నౌకా రవాణా మార్గం మాత్రమే కాదు. నేను సందర్శించిన అత్యంత అందమైన ప్రాంతాల్లో ఇదొకటి. డాల్ఫిన్లు, సముద్ర తాబేళ్లు, డుగాంగ్‌లు ఇక్కడ జీవిస్తున్నాయి. ఇది ప్రపంచంలోని అద్భుతమైన సహజ సంపదల్లో ఒకటి. యుద్ధం వల్ల అపారమైన నష్టం జరుగుతోంది. మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు. కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. నివాసాలు ధ్వంసం అవుతున్నాయి. ప్రకృతికీ తీవ్రంగా నష్టం జరుగుతోంది. నా సందేశం ఒక్కటే. వెంటనే యుద్ధాన్ని ఆపాలి. హోర్ముజ్ జలసంధిని తెరిచి సముద్ర కాలుష్యాన్ని తొలగించాలి’’ అని ప్యూ పిలుపునిచ్చారు.


ఈ వార్తలనూ చదవండి:

డ్రోన్ దాడి.. మంటల్లో రష్యా సరకు రవాణా నౌక

భారత్‌ వృద్ధిని అడ్డుకునేందుకు చైనా వ్యూహం: అమెరికా కాంగ్రెస్ హెచ్చరిక

Updated Date - Nov 22 , 2026 | 11:49 AM