ట్రంప్ టారిఫ్‌లపై కోర్టు షాక్.. రీఫండ్ ఇవ్వాలని ఆదేశం
ABN , Publish Date - Mar 05 , 2026 | 11:05 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో షాక్ తగిలింది. టారిఫ్‌ల సొమ్మును రీఫండ్ చేయాల్సిందేనని న్యూయార్క్‌లో ఉన్న ట్రేడ్ కోర్టు తీర్పు ఇచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. దిగుమతులపై విధించిన సుంకాలను తిరిగి చెల్లించాల్సిందేనని ట్రేడ్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇటీవల 1977 అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA) కింద ట్రంప్ విధించిన భారీ టారిఫ్‌లను సుప్రీం కోర్టు రద్దు చేసింది. ఇకపై ఈ టారిఫ్‌ల వసూళ్లు నిలిపివేయాలని కోర్టు అధికారులకు ఆదేశించింది. అయితే, ఇప్పటికే వసూలు చేసిన సుంకాలను తిరిగి ఇవ్వాలా లేదా అన్న అంశంపై స్పష్టత ఇవ్వలేదు. తాజాగా ట్రేడ్ కోర్టు తీర్పుతో ఆ విషయంపై స్పష్టత వచ్చింది.
అట్మస్ ఫిల్ట్రేషన్ అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి రిచర్డ్ ఈటన్, ఈ సుంకాలు చెల్లించిన దిగుమతిదారులు రీఫండ్ పొందేందుకు అర్హులని పేర్కొన్నారు. అలాగే టారిఫ్‌ల రీఫండ్‌కు సంబంధించిన కేసులను తానే పర్యవేక్షిస్తానని తెలిపారు. అమెరికాలోకి దిగుమతయ్యే వస్తువులపై విధించిన సుంకాలు సాధారణంగా ‘లిక్విడేషన్’ అనే ప్రక్రియ ద్వారా ఖరారు అవుతాయి. ఈ ప్రక్రియలో కస్టమ్స్ అధికారులు నిర్ణయించిన సుంకాలపై దిగుమతిదారులు అభ్యంతరం వ్యక్తం చేయడానికి 180 రోజుల గడువు ఉంటుంది. ఆ గడువు దాటితే నిర్ణయించిన మొత్తాన్ని చెల్లించాల్సిందే.
ఇప్పటికే లిక్విడేషన్ ప్రక్రియ పూర్తయిన దిగుమతుల విషయంలో కూడా టారిఫ్‌లు లేకుండా కొత్తగా లెక్కలు చేయాలని సూచించింది. ఇదిలా ఉండగా, ప్రపంచ దేశాలపై సుమారు 15 శాతం వరకు కొత్త సుంకాలను విధించే ప్రతిపాదన ఈ వారం అమల్లోకి రావొచ్చని అమెరికా ఆర్థిక శాఖ కార్యదర్శి స్కాట్ బెసెంట్ తెలిపారు.
ఇవీ చదవండి:
ఇరాన్ దాడుల వెనుక చైనా హస్తం ఉందా.?
పర్చడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ?