Share News

హోలీ రోజున దారుణం.. పిల్లాడిపై వేడి నీళ్లు పోసిన బామ్మ

ABN , Publish Date - Mar 05 , 2026 | 09:44 AM

హోలీ రోజున మీద రంగు చల్లాడన్న కోపంతో ఓ వృద్ధురాలు మనవడిపై వేడి వేడి నీళ్లు పోసింది. తీవ్రగాయాలపాలైన పిల్లాడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో మంగళవారం చోటుచేసుకుంది.

హోలీ రోజున దారుణం.. పిల్లాడిపై వేడి నీళ్లు పోసిన బామ్మ
Nagpur holi incident

ఇంటర్‌నెట్ డెస్క్: హోలీ సంబరాలు ఓ పిల్లాడి జీవితంలో విషాదాన్ని నింపాయి. మీద రంగు చల్లాడన్న కోపంతో బామ్మ ఆ పిల్లాడిపై వేడి వేడి నీళ్లు పోసింది. తీవ్రగాయాలపాలైన పిల్లాడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో మంగళవారం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. నాగ్‌పూర్ జిల్లా కోరాడి ఏరియాకు చెందిన సింధు థాక్రే అనే వృద్ధురాలు బకెట్‌లో వేడి నీళ్లు నింపుకుని రోడ్డు మీద నుంచి ఇంట్లోకి వెళుతూ ఉంది. ఇంతలో ఆమె మనవడు హోలీ రంగులు స్ప్రే చేసే గన్‌తో దగ్గరకు వచ్చాడు.


ఆమెపై రంగు స్ప్రే చేయసాగాడు. అయితే, ఇది ఏ మాత్రం నచ్చని సింధు తీవ్ర ఆగ్రహానికి గురైంది. పట్టరాని కోపం కారణంగా విచక్షణ పూర్తిగా కోల్పోయింది. బకెట్‌లోని వేడి వేడి నీళ్లను పిల్లాడిపై పోసింది. వేడి నీళ్లు మీద పడగానే పిల్లాడు చావు కేకలు పెడుతూ అరవసాగాడు. నొప్పి భరించలేక అటు, ఇటు పరిగెత్తసాగాడు. బకెట్‌లో చల్ల నీళ్లు తీసుకెళుతున్న ఓ మహిళ పిల్లాడికి సాయం చేయడానికి ముందుకు వచ్చింది. బకెట్‌లోని నీళ్లను రెండు చేతులతో పిల్లాడిపై చల్లింది. చేసిన తప్పు గ్రహించిన సింధు నొప్పి నుంచి ఉపశమనం కలగడానికి బకెట్‌లోని మొత్తం నీటిని పిల్లాడిపై చల్లింది. అప్పటికే జరగాల్సిన దారుణం జరిగిపోయింది.


శరీరం మొత్తం బాగా కాలిపోయింది. తీవ్ర గాయాలపాలైన పిల్లాడిని కుటుంబసభ్యులు నాగ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. డాక్టర్లు పిల్లాడికి చికిత్స అందిస్తున్నారు. పిల్లాడికి 45 శాతం కాలిన గాయాలు అయినట్లు డాక్టర్లు అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు వృద్ధురాలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

హెచ్‌సీఏ ఉద్యోగుల నిరసన... ఎందుకంటే..

బూమ్‌.. బూమ్‌.. బుమ్‌రుక్‌

Updated Date - Mar 05 , 2026 | 10:23 AM