విశాఖ నిల్వకేంద్రంలో నిండుగా చమురు
ABN , Publish Date - Mar 05 , 2026 | 06:41 AM
పశ్చిమ ఆసియాలో భీకర యుద్ధం జరుగుతున్న వేళ ముడి చమురు ఎలా? అనుకుంటూ ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో క్రూడాయిల్ సరఫరా నిలిచిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. క్రూడాయిల్ ధర పెరుగుతోంది...
భూగర్భంలో 1.38 మిలియన్ టన్నులు అందుబాటులో
సముద్ర మట్టానికి 300 అడుగుల లోతులో వ్యూహాత్మకంగా పదేళ్ల కిందటే నిల్వకేంద్రం నిర్మాణం
బాంబులేసినా, భూకంపం వచ్చినా చెక్కుచెదరదు
కర్ణాటకలో మరో రెండు చోట్ల క్రూడాయిల్ నిల్వ
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
పశ్చిమ ఆసియాలో భీకర యుద్ధం జరుగుతున్న వేళ ముడి చమురు ఎలా? అనుకుంటూ ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో క్రూడాయిల్ సరఫరా నిలిచిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. క్రూడాయిల్ ధర పెరుగుతోంది. యుద్ధాలు, సంక్షోభాలు, ప్రకృతి వైపరీత్యాలు వంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు విపత్కర పరిస్థితుల ను ఎదుర్కొనేందుకు ప్రతి దేశం వ్యూహాత్మక నిల్వలు ఉంచుకోవాలని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ పాతికేళ్ల క్రితమే సూచించింది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ప్రోగ్రామ్ ప్రకారం ప్రతి దేశం 90 రోజులకు సరిపడా నిల్వ చేసుకోవాలి. భారతదేశం వ్యూహాత్మక చమురు నిల్వల కోసం ‘ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్’ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్‌ను 2004లోనే ఏర్పాటు చేసింది. కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే ఈ సంస్థ దేశంలో మూడు వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రాలను నిర్మించింది. అందులో మొదటిది విశాఖపట్నం. మిగిలిన రెండూ కర్ణాటకలోని మంగుళూరు, పాదురుల్లో ఉన్నాయి.
2015లోనే నిర్మాణం
హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్ సంస్థలు విదేశాల నుంచి క్రూడాయిల్‌ను నౌకల ద్వారా విశాఖపట్నానికి దిగుమతి చేసుకొని, రిఫైనరీల్లో శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్, గ్యాస్‌లను పలు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నాయి. తూర్పు తీరంలో విశాఖపట్నం ప్రధాన కేంద్రం కావడంతో ఇక్కడే వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రం ఏర్పాటుచేశారు. విశాఖలోని సింధియా సమీపాన లోవ గార్డెన్స్ ప్రాంతంలో సముద్రాన్ని ఆనుకొని ఉన్న ఒక కొండ కింద సముద్ర అంతర్భాగంలో 300 అడుగుల లోతున ప్రత్యేక నిల్వ కేంద్రాన్ని నిర్మించారు. దీని ఎత్తు 30 మీటర్లు. వెడల్పు 20 మీటర్లు. పొడవు 5 కి.మీ.. ఇందులో 1.38 మిలియన్ మెట్రిక్ టన్నుల క్రూడాయిల్‌ను నిల్వ చేసుకోవచ్చు. దీని నిర్మాణానికి 2008లో శ్రీకారం చుట్టి 2015లో పూర్తి చేశారు. ఆ ఏడాది జూలైలో ప్రధాని నరేంద్రమోదీ జాతికి అంకితం చేశారు. దీని తరువాత మంగుళూరులో 1.5 మిలియన్ మెట్రిక్ టన్నులు, పాదూరులో 2.5 మిలియన్ మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంతో వ్మూహాత్మక చమురు నిల్వ కేంద్రాలు నిర్మించారు.
60ఏళ్ల పాటు నిల్వకు అవకాశం
విశాఖలోని వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రంపైన మరో 100 అడుగుల ఎత్తున కొండ ఉంది. భారీ బాంబులు వేసినా నష్టం జరగని విధంగా నిల్వ కేంద్రాన్ని నిర్మించారు. ఇది భూకంపాలకు సైతం చెక్కు చెదరదు. విశాఖపట్నానికి క్రూడాయిల్‌తో వచ్చే నౌకలు తీరానికి 3కి.మీ. దూరాన ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఆయిల్ జెట్టీ (సింగిల్ పాయింట్ మూరింగ్) వద్ద అన్‌లోడింగ్ చేస్తాయి. అక్కడి నుంచి పైపులైన్ ద్వారా నేరుగా ఆయా సంస్థలకు క్రూడాయిల్ చేరుతుంది. ఈ నిల్వ కేంద్రాన్ని కూడా ఆ విధంగా క్రూడాయిల్‌తో నింపేశారు. ఒకసారి నింపితే దానిని 60 ఏళ్ల పాటు నిల్వ చేసుకొని ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధం ఇంకా తీవ్రరూపం దాల్చి ఆయిల్ ట్యాంకర్ నౌకలు ఎక్కడివక్కడ ఆగిపోతే, ఈ నిల్వ కేంద్రాల నుంచి క్రూడాయిల్‌ను ఉపయోగించే అవకాశం ఉంది.
ఇవీ చదవండి:
ఇరాన్ యుద్ధం.. పెరగనున్న వంటింటి బడ్జెట్..