Share News

జీడీపీకి చమురు సెగ

ABN , Publish Date - Mar 04 , 2026 | 01:29 AM

ఎవరెన్ని చెప్పినా ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడి భారత ఆర్థిక వ్యవస్థను తీవ్రంగానే ప్రభావితం చేయనుంది. ఈ యుద్ధంతో చమురు ధరలు కొండెక్కి వాణిజ్య లోటు, ద్రవ్యోల్బణం చుక్కలంటే ప్రమాదం ఉందని...

జీడీపీకి చమురు సెగ

వాణిజ్య లోటు, ద్రవ్యోల్బణానికి రెక్కలు.. భారత్‌పై యుద్ధ ప్రభావం

  • వాణిజ్య ఒప్పందాల సానుకూలత ఆవిరి

  • విదేశీ పెట్టుబడుల ప్రవాహానికి బ్రేక్‌

  • ఫిచ్‌ రేటింగ్స్‌ సంస్థ బీఎంఐ అంచనా

న్యూఢిల్లీ: ఎవరెన్ని చెప్పినా ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడి భారత ఆర్థిక వ్యవస్థను తీవ్రంగానే ప్రభావితం చేయనుంది. ఈ యుద్ధంతో చమురు ధరలు కొండెక్కి వాణిజ్య లోటు, ద్రవ్యోల్బణం చుక్కలంటే ప్రమా దం ఉందని ఫిచ్‌ రేటింగ్స్‌ అనుబంధ సంస్థ బీఎంఐ అంచనా వేసింది. అదే జరిగితే ప్రజల వినియోగం తగ్గి దేశంలో పెట్టుబడుల వాతావరణం మసక బారుతుందని హెచ్చరించింది. ఈ యుద్ధ ప్రభావం భారత్‌కు వచ్చే విదేశీ పెట్టుబడులపైనా తప్పక ప్రభావం చూపిస్తుందని స్పష్టం చేసింది. ఇటీవల యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ), అమెరికాలతో కుదిరిన వాణిజ్య ఒప్పందాలతో ఏర్పడిన సానుకూల పెట్టుబడుల పరిస్థితులూ ఈ యుద్ధంతో తారుమారయ్యే ప్రమాదం ఉందని బీఎంఐ హెచ్చరించింది.

జీడీపీ వృద్ధి రేటుకూ బ్రేక్‌

భారత ఆర్థిక వ్యవస్థపై ఈ యుద్ధ ప్రభావం ఈ నెల నుంచే ప్రారంభమవుతుందని బీఎంఐ తెలిపింది. 2026 -27 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటును ఈ యుద్ధం ప్రభావితం చేయనుందని అంచనా వేసింది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) భారత జీడీపీ వృద్ధి రేటు 7 శాతం మించకపోవచ్చని అంచనా వేసింది. బ్యారల్‌ ముడి చమురు ధర 10 శాతం పెరిగితే జీడీపీ వృద్ధి రేటు 0.3 నుంచి 0.6 శాతం క్షీణిస్తుందని తెలిపింది. బ్యారల్‌ క్రూడాయిల్‌ ధర ఒక డాలర్‌ పెరిగితే.. భారత్‌పై ఏటా 200 కోట్ల డాలర్ల భారం పడుతుందని అంచనా.


వస్త్ర పరిశ్రమ

తాజా పరిణామాలతో దేశ వస్త్ర పరిశ్రమ కూడా తీవ్ర ఆందోళనతో ఉంది. ఇరాన్‌ హోర్ముజ్‌ జలసంధిని మూసివేయడంతో అమెరికా, యూర్‌పకు వీటిని తీసుకెళ్లే నౌకలు ఇప్పుడు కేప్‌ ఆఫ్‌ గుడ్‌ హోప్‌ మీదుగా వెళ్లాలి. దీంతో వీటి ప్రయాణ సమయం మరో 20 నుంచి 25 రోజులు పెరిగి రవాణ ఖర్చులు పెరుగతాయి. దీంతో తాజా పరిణామాలపై తమిళనాడులోని తిరుపూర్‌ ప్రాంత టెక్స్‌టైల్‌ ఎగుమతిదారులూ ఆందోళనలో ఉన్నారు.

బియ్యం ఎగుమతులు

పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిస్థితులు బియ్యం ఎగుమతులపైనా ప్రభావం చూపిస్తోంది. మన దేశ బాస్మతి బియ్యంలో పెద్దమొత్తాన్ని యూఏఈ, ఇరాన్‌, సౌదీ అరేబియా, కువైట్‌ దేశాలు దిగుమతి చేసుకుంటాయి. తాజా పరిణామాలతో ఈ దేశాలకు ఎగుమతయ్యే దాదాపు 4 లక్షల టన్నుల బియ్యం ఎగుమతులు వివిధ రేవుల వద్ద ఆగిపోయాయి. ఇరాన్‌ హోర్ముజ్‌ జలసంధిని తిరిగి తెరిస్తే తప్ప ఈ ఎగుమతులకు మోక్షం లేదని ఎగుమతిదారులు చెబుతున్నారు. పెరిగిన నౌకా రవాణ, ఇన్సూరెన్స్‌ చార్జీలను దృష్టిలో ఉంచుకుని ఎగుమతిదారులు కాస్ట్‌, ఇన్సూరెన్స్‌, ఫ్రైట్‌ (సీఐఎఫ్‌) విధానానికి బదులు ఫ్రీ ఆన్‌ బోర్డ్‌ (ఎఫ్‌ఓబీ) విధానం ఎంచుకోవాలని ఇండియన్‌ రైస్‌ ఎక్స్‌పోర్టర్స్‌ ఇప్పటికే తన సభ్యులకు సూచించింది.

రత్నాభరణాల పరిశ్రమ

మన దేశం దిగుమతి చేసుకునే బంగారం, ముడి వజ్రాల్లో ఎక్కువ భాగం దుబాయ్‌ నుంచి వస్తాయి. ఎగుమతులకీ ఈ ప్రాంత దేశాలే కీలక మార్కెట్‌. తాజా పరిణామాలతో బంగారం, ముడి వజ్రాల దిగుమతులతో పాటు వాటితో చేసిన నగల ఎగుమతులకూ బ్రేక్‌ పడింది. ఈ ఉద్రిక్తతలు ఎక్కువ రోజులు కొనసాగితే వజ్రాలు సానబెట్టే పరిశ్రమలో పని చేస్తున్న దాదాపు 10 లక్షల మంది రోడ్డున పడే ప్రమాదం ఉందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

డీఏపీ దిగుమతులకూ బ్రేక్‌

మన దేశానికి అవసరమైన డీఏపీ ఎరువుల సరఫరాలో గల్ఫ్‌ దేశాలది కీలక పాత్రం. తాజా పరిణామాలతో వీటి దిగుమతులకూ బ్రేక్‌ పడింది. ఈ పరిణామాలు ఎక్కువ రోజులు కొనసాగితే వచ్చే ఖరీఫ్‌ సీజన్‌లో దేశంలో డీఏపీ ఎరువులకు తీవ్ర కొరత ఏర్పడుతుందని భావిస్తున్నారు.


పెరగనున్న వంటింటి బడ్జెట్‌

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడి ప్రభావం వంట నూనెలు, పప్పు దినుసులపైనా పడే ప్రమాదం కనిపిస్తోంది. మన దేశానికి అవసరమైన సోయా, సన్‌ ఫ్లవర్‌ ఆయిల్స్‌లో పెద్దమొత్తాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. సోయా ఆయిల్‌.. అర్జెంటీనా, బ్రెజిల్‌, అమెరికా నుంచి, సన్‌ ఫ్లవర్‌ ఆయిల్‌ ఉక్రెయిన్‌, రష్యాల నుంచి దిగుమతవుతున్నాయి. ఈ దిగుమతులు తీసుకొచ్చే నౌకలు సూయజ్‌ కెనాల్‌, హోర్ముజ్‌ జలసంధి మీదగా రావాలి. ఇరాన్‌ ఇప్పటికే హోర్ముజ్‌ జలసంధిని మూసివేసింది. దీంతో వీటిని తీసుకొచ్చే నౌకలు మరింత దూరం ప్రయాణించి మన రేవులకు చేరాలి. దీంతో రవాణా ఖర్చులు తడిసి మోపెడై ఆ ప్రభావం వంట నూనెల రిటైల్‌ ధరల మీద పడే అవకాశం ఉంది. ఇక మన దేశం నురచి ఎగుమతయ్యే నూనె తీసిన చెక్క (ఆయిల్‌ మీల్‌)ది ఇదే పరిస్థితి. ఆఫ్రికా దేశాలు, అమెరికా, కెనడా నుంచి దిగుమతయ్యే పప్పుల ధరా పెరిగే అవకాశం కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి..

ఇరాన్ దిగి వచ్చింది.. కానీ ఇప్పటికే ఆలస్యమైంది: ట్రంప్

ఇరాన్ అధ్యక్ష కార్యాలయంపై దాడి.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడి

Updated Date - Mar 04 , 2026 | 01:29 AM