Share News

హెచ్‌-1బీ ఉద్యోగులకు మరో ముప్పు.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ రద్దవనుందా..

ABN , Publish Date - Aug 08 , 2026 | 06:17 PM

అమెరికాలో హెచ్‌-1బీ వీసాలపై పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులకు కీలకమైన 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తొలగించే ప్రతిపాదనను అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం పరిశీలిస్తోంది.

హెచ్‌-1బీ ఉద్యోగులకు మరో ముప్పు.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ రద్దవనుందా..
H-1B 60 day grace period

అమెరికాలో హెచ్‌-1బీ వీసాలపై పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులకు కీలకమైన 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తొలగించే ప్రతిపాదనను అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం పరిశీలిస్తోంది. హెచ్-1బీ వీసాదారులు ఉద్యోగం కోల్పోయిన తర్వాత కూడా అమెరికాలో ఉండేందుకు అనుమతించే 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను ఎత్తెయ్యాలని పంపించిన ప్రతిపాదనలను 'ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్' సమీక్షిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి (H-1B 60 day grace period).


ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే ఉద్యోగం కోల్పోయిన హెచ్‌-1బీ ఉద్యోగులకు కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి లేదా మరో ఇమ్మిగ్రేషన్ మార్గాన్ని ఎంచుకోవడానికి లభించే సమయం గణనీయంగా తగ్గిపోవచ్చు. ప్రస్తుత నిబంధనల ప్రకారం, హెచ్‌-1బీతో పాటు కొన్ని ఇతర ఉద్యోగ ఆధారిత వీసాలపై ఉన్న వ్యక్తులు ఉద్యోగం కోల్పోతే గరిష్ఠంగా 60 రోజుల వరకు అమెరికాలో ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఈ గ్రేస్ పీరియడ్‌ను రద్దు చేస్తే తీవ్ర ప్రభావం తప్పదు (US H-1B visa rules 2026).


ప్రస్తుత విధానంలో ఉద్యోగం కోల్పోయిన హెచ్‌-1బీ ఉద్యోగి గ్రేస్ పీరియడ్‌లో మరో సంస్థను వెతుక్కోవచ్చు. కొత్త సంస్థ అవసరమైన హెచ్‌-1బీ పిటిషన్‌ను దాఖలు చేసే అవకాశం ఉంటుంది. అయితే 60 రోజుల వ్యవధి తొలగిస్తే ఇలాంటి చర్యలకు అందుబాటులో ఉండే సమయం చాలా పరిమితం కావచ్చు. ప్రస్తుత ప్రతిపాదిత మార్పు హెచ్‌-1బీ ఉద్యోగులను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నది కాదు. ప్రస్తుత గ్రేస్ పీరియడ్‌ వ్యవస్థ పరిధిలో ఉన్న ఎల్‌-1, ఓ‌-1, ఈ‌-1, ఈ‌-2, ఈ‌-3, హెచ్‌-1బీ1, టీఎన్‌ వంటి మరికొన్ని వీసా వర్గాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది (US immigration changes).


అమెరికాలో భారతీయ నిపుణులు హెచ్‌-1బీ వీసా వర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్నారు (H-1B job loss). 2024 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభ, కొనసాగింపు ఉద్యోగాలను కలిపి 3,99,402 హెచ్‌-1బీ పిటిషన్లు ఆమోదం పొందాయి. వీటిలో 71 శాతం మంది భారతీయులే. కాగా, ప్రస్తుత ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే ముందుగా దాన్ని ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రచురించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అభిప్రాయాలు, అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు 30 నుంచి 60 రోజుల సమయం ఇవ్వవచ్చు. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాతే తుది నిబంధన అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది.


ఇవి కూడా చదవండి..

యూపీఐ చెల్లింపులు ఉచితమే: ఫోన్‌పే సీఈఓ సమీర్ నిగమ్


డీప్‌ఫేక్‌ వీడియోలపై కేంద్రం కన్నెర్ర.. చర్యలు తీసుకోవాలని మెటాకు అదేశం..

Updated Date - Aug 08 , 2026 | 06:22 PM