Share News

చర్చలకు అంగీకరించనంత వరకు ప్రమాదమే: యూఎన్ చీఫ్

ABN , Publish Date - Apr 03 , 2026 | 09:08 AM

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆందోళన వ్యక్తం చేశారు. నాయకులు విధ్వంసాన్ని ఆపి చర్చలకు మొగ్గుచూపాలని ఆయన పిలుపునిచ్చారు.

చర్చలకు అంగీకరించనంత వరకు ప్రమాదమే: యూఎన్ చీఫ్
UNO Secretart General Antonio Guterras

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మొదలై రెండో నెలకు చేరడంపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధ ప్రభావం అనేక మందిని బలితీసుకోవడం సహా తీవ్ర ఆర్థిక పరిణామాలకు కారణమవుతోందని.. తక్షణమే దీనికి ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే విస్తృత యుద్ధంగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. ఇరాన్‌పై అమెరికా​-ఇజ్రాయెల్‌ దాడులు, గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ ప్రతీకార దాడులను ఆపి శాంతియుత పరిష్కారం దిశగా ఆలోచించాలన్నారు.


'యుద్ధాలు వాటంతట అవే ముగియవు. నాయకులు విధ్వంసం కంటే చర్చలకు మొగ్గు చూపినప్పుడే ముగుస్తాయి. దానికి ఇదే సరైన సమయం. ఆ దిశగా సంబంధిత పక్షాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. ఆ ప్రయత్నాలకు మద్దతుగా నా వ్యక్తిగత రాయబారి జీన్ ఆర్నాల్ట్‌ను ఆ ప్రాంతానికి పంపుతున్నాను' అని గుటెరస్ అన్నారు. ఈ దాడులను తాను పూర్తిగా ఖండిస్తున్నానన్న ఆయన.. హోర్ముజ్ జలసంధి సహా కీలక సముద్ర మార్గాల్లో నౌకాయాన హక్కులు, స్వేచ్ఛను గౌరవించాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించారు.


నౌకాయాన స్వేచ్ఛను నిరాకరించడం వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. పెరుగుతున్న ఆహార, ఇంధన ధరలతో ప్రపంచంలో పేద, బలహీన వర్గాలపై దీని ప్రభావం ఉంటుందని గుటెరస్ హెచ్చరించారు. ఫిలిప్పీన్స్ నుంచి శ్రీలంక, మొజాంబిక్ వరకు ఉన్న ప్రపంచంలోని నిరుపేదలు ఆహార, ఇంధన ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడటాన్ని ఆయన ఉదహరించారు. పశ్చిమాసియా సంక్షోభం అదుపు తప్పి.. విధ్వంసం, విచక్షణారహిత దాడులు రోజురోజుకూ పెరిగిపోతూ రెండో నెలకు చేరిందన్నారు. ఇది మొత్తం ప్రాంతాన్ని కమ్మేసే విస్తృత యుద్ధంగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు గుటెరస్.


ఇదిలా ఉండగా.. మరో రెండు మూడు వారాల్లో ఇరాన్‌పై భీకర స్థాయిలో దాడులకు దిగబోతున్నామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటికే హెచ్చరించారు. ఈ సారి శత్రువును గట్టిగా దెబ్బకొడతామని, త్వరలోనే యుద్ధం ముగిసిపోవచ్చని సంకేతాలిచ్చారు. ఇరానియన్లు రాతియుగానికి చెందినవారు కాబట్టి వారిని మళ్లీ అక్కడికే పంపిస్తామని వ్యాఖ్యానించారు ట్రంప్. ఆ దేశంపై యుద్ధంలో తమ జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోతున్నారని.. అయినా వెనక్కు తగ్గమన్నారు. ఇప్పటికే లక్ష్యానికి చాలా చేరువలోకి వచ్చేశామన్న అగ్రరాజ్య అధ్యక్షుడు.. వేగంగా, కచ్చితంగా దానిని చేరుకుంటామన్నారు.


ఇవీ చదవండి:

ఎవరి కోసం ఈ యుద్ధం?

భారతీయ మిత్రులకు ముప్పు ఉండదు: ఇరాన్‌

అమెరికా ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్‌ జార్జ్‌కు ఉద్వాసన

Updated Date - Apr 03 , 2026 | 09:08 AM