Share News

ట్రంప్‌నకు భారీ ఊరట.. అమెరికా అటార్నీ జనరల్‌గా టాడ్‌ బ్లాంచ్‌

ABN , Publish Date - Aug 08 , 2026 | 03:29 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు కీలక విజయం దక్కింది. ఆయన మాజీ వ్యక్తిగత న్యాయవాది టాడ్‌ బ్లాంచ్‌ అమెరికా అటార్నీ జనరల్‌గా నియమితులయ్యారు.

ట్రంప్‌నకు భారీ ఊరట.. అమెరికా అటార్నీ జనరల్‌గా టాడ్‌ బ్లాంచ్‌
Trump Todd Blanche Confirmed US Attorney General

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు కీలక విజయం దక్కింది. ఆయన మాజీ వ్యక్తిగత న్యాయవాది టాడ్‌ బ్లాంచ్‌ అమెరికా అటార్నీ జనరల్‌గా నియమితులయ్యారు. బ్లాంచ్‌ నియామకానికి సంబంధించి శనివారం జరిగిన ఓటింగ్‌లో 50-49 ఓట్ల తేడాతో అమెరికా సెనేట్‌ ఆమోదం తెలిపింది.


యూఎస్ ప్రెసిడెంట్‌గా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టాక న్యాయశాఖకు సంబంధించి ఆయన విధానాలను మరింత దూకుడుగా అమలు చేయాలని భావిస్తున్న నేపథ్యంలో బ్లాంచ్‌ నియమితులవడం ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పటికే ఆయన తాత్కాలిక అటార్నీ జనరల్‌గా న్యాయశాఖ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు సెనేట్‌ ఆమోదంతో అధికారికంగా ఆ పదవిని చేపట్టనున్నారు. అయితే.. బ్లాంచ్‌ నియామక ప్రక్రియ సాఫీగా ఏం సాగలేదు. ట్రంప్‌తో ఆయనకున్న సన్నిహిత సంబంధాలు, న్యాయశాఖ స్వతంత్రతపై ఆందోళనలు, వివాదాస్పద 'యాంటీ-వెపనైజేషన్‌ ఫండ్‌' వ్యవహారం తదితర అంశాలపై సొంత పార్టీ నేతలే అనేక అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. చివరకు ఇద్దరు రిపబ్లికన్‌ సెనేటర్లు బ్లాంచ్‌కు వ్యతిరేకంగా ఓటేశారు.


అయితే.. తనపై ఉన్న ఆ అభ్యంతరాలను తొలగించేందుకు పలు కీలక హామీలను ఇచ్చారు బ్లాంచ్‌. ట్రంప్‌, ఆయన మద్దతుదారులకు ప్రయోజనం చేకూర్చేలా తయారుచేసిన సుమారు 1.8 బిలియన్‌ డాలర్ల 'యాంటీ-వెపనైజేషన్‌ ఫండ్‌'ను విత్‌డ్రా చేసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే ట్రంప్‌, ఆయన కుటుంబ సభ్యులకు ట్యాక్స్ ఆడిట్‌ల నుంచి రక్షణ కల్పించే వివాదాస్పద ఒప్పందాన్ని కూడా పరిమితం చేసేందుకు అంగీకరించారు.


కాగా.. బ్లాంచ్‌ గతంలో న్యూయార్క్‌లో ఫెడరల్‌ ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు. ట్రంప్‌ క్రిమినల్‌ కేసుల్లో ఆయన తరఫున ప్రధాన న్యాయవాదిగా వ్యవహరించారు. దీంతో ట్రంప్‌ పట్ల ఆయన విధేయతపై డెమోక్రాట్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే.. ఆయనకు ఉన్న న్యాయపరమైన అనుభవం కలిసొస్తుందనే నమ్మకంతో రిపబ్లికన్లు సమర్థించారు.


ఇవీ చదవండి:

ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఫేక్ పనీర్, నెయ్యి, వెన్నపై కొరడా

మహిళా రిజర్వేషన్ బిల్లు.. రిజిజు వ్యాఖ్యలకు రాహుల్‌ కౌంటర్‌!

Updated Date - Aug 08 , 2026 | 03:54 PM