Share News

ట్రంప్‌ను పట్టించుకోని కిమ్.. 60 అణ్వాయుధాలతో అమెరికాకు ఉత్తర కొరియా సవాల్..

ABN , Publish Date - Nov 22 , 2026 | 06:25 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మళ్లీ చర్చలు జరిపేందుకు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆసక్తి చూపడం లేదా? అణ్వాయుధాల విషయంలో వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా లేకపోవడంతో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరుగుతున్నాయా?

ట్రంప్‌ను పట్టించుకోని కిమ్.. 60 అణ్వాయుధాలతో అమెరికాకు ఉత్తర కొరియా సవాల్..
Donald Trump, Kim Jong Un

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మళ్లీ చర్చలు జరిపేందుకు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆసక్తి చూపడం లేదా? అణ్వాయుధాల విషయంలో వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా లేకపోవడంతో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరుగుతున్నాయా? అవుననే అంటున్నాయి అంతర్జాతీయ మీడియా కథనాలు. అమెరికా అధ్యక్షుడు స్వయంగా సంప్రదించేందుకు ప్రయత్నించినా కిమ్ పట్టించుకోవడం లేదని సమాచారం. ప్రస్తుతం ఉత్తరకొరియా వద్ద సుమారు 60 అణు వార్‌హెడ్‌లు ఉన్నట్లు అంచనాలు వెలువడటం అమెరికాను ఆందోళనకు గురిచేస్తోంది (Kim Jong Un, Donald Trump).


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత ఏడాది ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌ను సంప్రదించేందుకు పలుమార్లు ప్రయత్నించినట్లు 'వాల్‌స్ట్రీట్ జర్నల్' కథనం వెల్లడించింది. ఈ కథనం ప్రకారం.. సాధారణ దౌత్య మార్గాలతో పాటు ఇరు దేశాల మధ్య అందుబాటులో ఉన్న ప్రత్యేక సమాచార వ్యవస్థల ద్వారా కూడా సంప్రదింపులకు ప్రయత్నించినప్పటికీ కిమ్ నుంచి స్పందన రాలేదు. దీంతో ట్రంప్ స్వయంగా కిమ్‌కు ఒక లేఖ రాశారు. ఆ లేఖను అందించేందుకు అమెరికా అధికారులు ఉత్తర కొరియా శాశ్వత దౌత్య కార్యాలయం వద్ద వేచి ఉన్నారు. లోపలి నుంచి బయటకు వచ్చిన ఉత్తర కొరియా దౌత్యవేత్తకు అమెరికా ప్రతినిధులు ఆ లేఖను అందించారు (US North Korea Relations).


ఆ దౌత్యవేత్త ఆ లేఖను కనీసం తెరవకుండానే తిరిగి అమెరికా ప్రతినిధి ముందు ఉంచినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ట్రంప్ తన తాజా ఆసియా పర్యటన సందర్భంగా కిమ్ జోంగ్ ఉన్‌తో మరోసారి సమావేశం కావాలని భావించారని, చివరి నిమిషం వరకు ఇరు దేశాల మధ్య ముఖాముఖి చర్చల కోసం ప్రయత్నాలు జరిగాయని పేర్కొంది. అయితే ఉత్తరకొరియా షరతులు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేకపోవడంతో ట్రంప్ వెనుదిరిగారట (North Korea Nuclear Weapons).


ఉత్తర కొరియా అణ్వాయుధ సామర్థ్యం గత కొన్నేళ్లలో గణనీయంగా పెరిగినట్లు సమాచారం (North Korea Nuclear Arsenal). 2019లో ట్రంప్-కిమ్ మధ్య చర్చలు విఫలమైన తర్వాత ఉత్తరకొరియా అణ్వాయుధాల తయారీని వేగవంతం చేసింది. 2019లో ఆ దేశం వద్ద సుమారు 20 నుంచి 30 అణు వార్‌హెడ్‌లు ఉండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య దాదాపు 60కి చేరినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఉత్తర కొరియా అభివృద్ధి చేసిన బాలిస్టిక్ క్షిపణులు (ఐసీబీఎంలు) అమెరికా ప్రధాన భూభాగాన్ని కూడా చేరుకోగల సామర్థ్యం కలిగి ఉన్నట్లు అంచనా. మొబైల్ వాహనాల నుంచి కూడా వీటిని ప్రయోగించే అవకాశం ఉండటంతో గుర్తించడం, అడ్డుకోవడం మరింత కష్టమవుతుంది. ఈ పరిణామాలు అమెరికా రక్షణ వ్యవస్థకు కొత్త సవాళ్లను సృష్టిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి..

భారత్, చైనా కమాండర్ల భేటీ.. అరుణాచల్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై చర్చ..


రూ.13 లక్షల బ్రెజ్జాకు బదులుగా రూ.9.5 లక్షల కారు ఇచ్చారని.. పెళ్లినే రద్దు చేసుకున్న ఢిల్లీ పోలీస్..

Updated Date - Nov 22 , 2026 | 06:28 PM