అమెరికాలోని టెక్సాస్‌లో కాల్పుల కలకలం.. ఇద్దరి మృతి
ABN , Publish Date - May 06 , 2026 | 07:08 AM
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. చర్చల సందర్భంగా ఓ దుండగుడు ఆకస్మికంగా కాల్పులకు తెగబడటంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని టెక్సాస్‌లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. కారోల్టన్‌లోని కె టౌన్ ప్లాజా షాపింగ్ సెంటర్‌లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది.
ఇదీ జరిగింది..
వ్యాపార లావాదేవీలపై చర్చలు జరుగుతున్న సమయంలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. చర్చలు సాగుతున్న వేళ ఓ దుండగుడు ఉద్దేశపూర్వకంగా ఆకస్మికంగా తుపాకీతో కాల్పులు జరపడంవల్ల అక్కడివారు ఒక్కసారిగా పరుగులు తీశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీప ఆసుపత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపుచేశారు. కాల్పులకు తెగబడిన నిందితుణ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటన వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటనే దానిపై దర్యాప్తు సాగిస్తున్నారు.
కాగా.. అమెరికాలో ఇటీవలి కాలంలో తరచూ కాల్పుల ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ప్రజల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనతో కారోల్టన్ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు.
ఇవీ చదవండి:
ఇద్దరు భారత జర్నలిస్టులకు పులిట్జర్
మోదీ 'చరిత్రాత్మక విజయం'పై ట్రంప్ ప్రశంసలు..