మోదీ 'చరిత్రాత్మక విజయం'పై ట్రంప్ ప్రశంసలు..
ABN , Publish Date - May 05 , 2026 | 09:11 PM
నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ, తాజా అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘనవిజయాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని 'చరిత్రాత్మకమైనది, నిర్ణయాత్మకమైనది' అని అభివర్ణిస్తూ వైట్ హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది.
వాషింగ్టన్/న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో.. (ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, అస్సాం) సాధించిన ఘనవిజయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. మోదీ సాధించిన ఈ విజయాన్ని 'చరిత్రాత్మకమైనది, నిర్ణయాత్మకమైనది' అని అభివర్ణిస్తూ వైట్ హౌస్ అధికార ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రధాని మోదీకి పంపిన అభినందన సందేశంలో ట్రంప్.. తమ మధ్య ఉన్న బలమైన స్నేహాన్ని గుర్తుచేసుకున్నారు. 'నా స్నేహితుడు నరేంద్ర మోదీకి ఈ గొప్ప విజయం దక్కినందుకు అభినందనలు. భారత్ వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి తీర్పు రావడం ఆయన నాయకత్వానికి ప్రజలు ఇస్తున్న గౌరవం' అని పేర్కొన్నారు. గతంలో 'హౌడీ మోదీ', 'నమస్తే ట్రంప్' వంటి కార్యక్రమాల ద్వారా వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
ఈ విజయం కేవలం భారత్‌కే కాకుండా, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి కూడా కీలకమని వైట్ హౌస్ పేర్కొంది. మోదీ పటిష్ఠమైన నాయకత్వంలో భారత్-అమెరికా మధ్య ఉన్న 'సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం' (Comprehensive Global Strategic Partnership) మరింత బలపడుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య వాణిజ్య, రక్షణ రంగాల్లో సహకారాన్ని మరింత వేగవంతం చేయాలని ఇప్పటికే ట్రంప్ నిర్ణయించుకున్నారు.
ఇక, ఈ అభినందనల పట్ల ప్రధాని మోదీ కూడా స్పందించారు. అమెరికాతో కలిసి ప్రపంచ అభివృద్ధి, శాంతి కోసం మరింత సమర్థవంతంగా పనిచేస్తామని ఆయన పునరుద్ఘాటించారు. కాగా, బెంగాల్‌లో తొలిసారి, అస్సాంలో వరుసగా మూడవసారి బీజేపీ విజయం సాధించడంపై అంతర్జాతీయ సమాజం ఆసక్తి చూపుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్పాలి: టీపీసీసీ చీఫ్
తెలంగాణ బాగుపడాలంటే ఏకైక మార్గం.. : ఎంపీ ఈటల