Share News

కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్పాలి: టీపీసీసీ చీఫ్

ABN , Publish Date - May 05 , 2026 | 05:45 PM

కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతిపై సీబీఐ విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందో సమాధానం చెప్పాలని తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలను టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.

కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్పాలి: టీపీసీసీ చీఫ్
TPCC Chief Mahesh Goud

హైదరాబాద్, మే 05: కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతిపై సీబీఐ విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందో సమాధానం చెప్పాలని తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలను టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. మే 10వ తేదీన ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారని.. ఆ లోపు దీనిపై స్పష్టత ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు.

మంగళవారం హైదరాబాద్‌ గాంధీ భవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విలేకర్లతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సీబీఐ దర్యాప్తుపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. దీనిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. బండి సంజయ్ కేంద్ర మంత్రి అనే ఫీలింగే రావటం లేదని చెప్పారు.


గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో రూ. వేల కోట్ల అవినీతికి పాల్పడిందని విమర్శించారు. అలాగే రూ. వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయిందని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ అవినీతిపై కిషన్ రెడ్డి, బండి సంజయ్ పలుమార్లు ఆరోపణలు చేశారని.. అలాగే సీబీఐ విచారణను కోరారని గుర్తు చేశారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టి 8 నెలల క్రితం ఈ కేసును సీబీఐకు బదిలీ చేశామని పేర్కొన్నారు.


బండి సంజయ్.. చేతిలోని తుపాకీ కాల్చకుండా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే లాభం ఏమిటి? అంటూ టీపీసీసీ చీఫ్ సూటిగా ప్రశ్నించారు. బండి సంజయ్ లోపాయికారీ ఒప్పందంలో ఉండి ఈ దర్యాప్తునకు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతు లేకుండానే బీజేపీకి ఓట్లు పడ్డాయా? అంటూ సందేహం వ్యక్తం చేశారు. ఎంపీ సీట్లకి కృతజ్ఞతగా 8 నెలలుగా జరగాల్సిన సీబీఐ దర్యాప్తును అడ్డుకుంటున్నారని తెలిపారు. ఈ కేసు విచారణ ఆలస్యం ఎందుకు అవుతుందో కేంద్ర మంత్రులు సమాధానం చెప్పాలని టీపీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు.


రైతుల విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ గతంలో అన్న మాటలు ప్రజలు మర్చిపోలేదన్నారు. రైతులు, పేద ప్రజలకు లాభం చేసిన ప్రభుత్వం తమదే అని చెప్పారు. ధాన్యం కొనుగోలు చెల్లింపులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. పంటల దిగుబడులు కూడా పెరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా రైతులకి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలతో కాంగ్రెస్ ముందుకు పోతుందన్నారు.


ఓట్ల చోరీ వల్లే బీజేపీ గెలిచింది..

బెంగాల్‌లో బీజేపీకి అనుకూల పరిస్థితులు లేవన్నారు. అక్కడ బీజేపీ గెలిచిందంటే.. అది ఓట్ల చోరీ వల్ల మాత్రమే అని టీపీసీసీ చీఫ్ కుండబద్దలు కొట్టారు. బెంగాల్‌లో ఓటు చోరీ జరిగిందని ఆరోపించారు. తెలంగాణలో కూడా అదే పరిస్థితి జరగొచ్చు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.


ఓటు హక్కు కాపాడుకోవాలంటూ తెలంగాణ పౌరులకు ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. అయినా తెలంగాణలో అలాంటి ఆటలు సాగవు అని పేర్కొన్నారు. సర్ (SIR) పేరిట ఓట్లు దొంగలించడం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ బాగుపడాలంటే ఏకైక మార్గం.. : ఎంపీ ఈటల

ఏపీ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది: సీఎం చంద్రబాబు

For More TG News And Telugu News

Updated Date - May 05 , 2026 | 06:07 PM