తెలంగాణ బాగుపడాలంటే ఏకైక మార్గం.. : ఎంపీ ఈటల
ABN , Publish Date - May 05 , 2026 | 02:56 PM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్న పనులకు ఎక్కడ పొంతన లేదని ప్రజలు చెప్పుకొని పరిస్థితి వచ్చిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు.
సిద్దిపేట, మే 05: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్న పనులకు ఎక్కడ పొంతన లేదని ప్రజలు చెప్పుకొని పరిస్థితి వచ్చిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీని ఎన్ని శాపనార్థాలు పెట్టినా వెస్ట్ అని.. మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు ఓడిస్తే తప్ప మనకు మన: శాంతి లేదని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు.
మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో బీజేపీ నేతల సమావేశంలో ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. రిటైర్ ఉద్యోగులకు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద నగదు చెల్లించక పోవడంతో కోర్టు జోక్యం చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేసే పరిస్థితి వచ్చిందంటే.. ప్రభుత్వాన్ని ఎట్లా నడుపుతున్నారో వాళ్లకే తెలియాలన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో చిన్న పనులు చేసుకునే కాంట్రాక్టర్లకు బిల్లులు అందక గతంలోనే కాదు.. నేడు కూడా వారు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని ఎంపీ ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్లకే కాంగ్రెస్ పార్టీ ప్రజల చేత ఛీ కొట్టించుకునే పరిస్థితులు వచ్చాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే ఏకైక మార్గం బీజేపీ అధికారంలోకి రావడం ఒక్కటే మార్గమని ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారన్నారు.
పశ్చిమ బెంగాల్‌లో అరాచకం, దుర్మార్గాలు జరిగినా.. ఇది నా జాగీరు అని అహంకారంగా పాలించిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీని ప్రజలు ఓడించారని ఎంపీ ఈటల తెలిపారు. తమిళనాడులో స్టాలిన్ మీద ఒక సామాన్యుడు గెలిచాడంటే డీఎంకే ప్రభుత్వంపై ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టమైందన్నారు. తమిళనాడు ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయ పార్టీలకు కనువిప్పు కావాలని తాను కోరుకుంటున్నానని ఆయన తెలిపారు.
కుటుంబ రాజకీయాలు నడిపేవారు.. ఈ రాష్ట్రానికి తామే ఓనర్లమనే పద్ధతిలో అన్ని వాళ్లే చేసుకునే వారికి, లక్షల కోట్ల రూపాయలు స్కాంలు చేసి డబ్బులు సంపాదించి.. వాటితో ఎన్నికల్లో గెలవాలని కుట్ర చేసే వారికి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అత్యుత్తమ ఉదాహరణ అని ఎంపీ ఈటల రాజేందర్ చెప్పారు. తమిళనాడు ఎన్నికల ఫలితాలు.. చిన్న విషయం కాదన్నారు.దీనిపై లోతుగా ఆలోచించాల్సిన విషయమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు ఎంత అప్రమత్తంగా, ఎంత షార్ప్‌గా ఉన్నారో ఈ ఫలితాలను బట్టి మనకు అర్థమవుతుందని ఎంపీ ఈటల రాజేందర్ చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ హైకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జీలు
టీవీకే లెజిస్లేచర్ పార్టీ నేతగా విజయ్ ఎన్నిక
For More TG News And Telugu News