Share News

నా మాటలను శత్రువులు తప్పుగా అర్థం చేసుకున్నారు.. దాడులపై ఇరాన్ అధ్యక్షుడు క్లారిటీ

ABN , Publish Date - Mar 08 , 2026 | 06:42 PM

గల్ఫ్ దేశాలపై దాడుల విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఆదివారంనాడు తెలిపారు. పొరుగు దేశాలు దాడులు జరిపితే తమ దేశ రక్షణ కోసం ప్రతిస్పందించాల్సి వస్తుందని వివరించారు.

నా మాటలను శత్రువులు తప్పుగా అర్థం చేసుకున్నారు.. దాడులపై ఇరాన్ అధ్యక్షుడు క్లారిటీ
Iran President, Masoud Pezeshkian

టెహ్రాన్: గల్ఫ్ దేశాలపై దాడుల విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ (Masoud Pezeshkian) ఆదివారంనాడు తెలిపారు. పొరుగు దేశాలు దాడులు జరిపితే తమ దేశ రక్షణ కోసం ప్రతిస్పందించాల్సి వస్తుందని వివరించారు. పొరుగుదేశాలపై ఇరాన్ దాడులకు పెజిష్కియాన్ శనివారంనాడు క్షమాపణలు చెప్పారు. అయితే ఇరాన్ దాడులను నిలిపివేస్తుందనే అర్థం వచ్చేలా శత్రువులు దీనిని వక్రీకరించి ప్రచారం చేసినట్టు ప్రభుత్వ అధీనంలోని టెలివిజన్‌లో ఆయన తాజాగా మాట్లాడుతూ వివరణ ఇచ్చారు.


'నా వ్యాఖ్యలకు శత్రువులు వక్రభాష్యం చెప్పారు. మా మీద దాడులు జరిపితే మాకు ప్రతిస్పందించడం మినహా మరో మార్గం ఉండదు. మా మీద వాళ్లు ఎంతగా ఒత్తిడి తీసుకువస్తే అంతకంతా మా నుంచి స్పందన రావడం సహజం. ఇరాన్ మా దేశం. ఇరాన్‌పై ఆధిపత్య శక్తుల అణిచివేతలు, దురాక్రమణలకు తలవంచే ప్రసక్తే లేదు' అని పెజిష్కియాన్ వివరణ ఇచ్చారు.


దీనికి ముందు, గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులకు పెజిష్కియాన్ క్షమాపణ చెప్పారు. పొరుగుదేశాలపై దాడులు జరపరాదని ఇరాన్ తాత్కాలిక నాయకత్వం నిర్ణయించినట్టు కూడా చెప్పారు. గల్ఫ్ ప్రాంతంలో సంక్షోభం మరింత విస్తరించాలని ఇరాన్ కోరుకోవడం లేదని అన్నారు. ఇరాన్ జరిపిన దాడులకు పొరుగు దేశాలకు వ్యక్తిగతంగా, ఇరాన్ తరఫున క్షమాపణలు తెలియజేసుకుంటున్నానని చెప్పారు. దీనిపై ట్రంప్ సైతం వెంటనే స్పందించారు. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో ఓడిపోయిన దేశంగా ఇరాన్ మారిందని, ఆ దేశం ఇంకెంతమాత్రం మధ్యప్రాచ్య ప్రాంతంపై ఆధిపత్యం చలాయించే శక్తి కాదన్నారు. ఇరాన్ తన చెడుప్రవర్తన కారణంగా భారీ నష్టాన్ని ఎదుర్కొంటోందన్నారు. ఆ దేశం పూర్తిగా లొంగిపోయేంత వరకూ, పతనం అయ్యేంత వరకూ ఈ పరిస్థితి కొనసాగుతుందని ట్రంప్ హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి..

కొత్త సుప్రీం నాయకుడిని ఎన్నుకున్న ఇరాన్!

లెబనాన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. 19 మంది మృతి

Updated Date - Mar 08 , 2026 | 06:45 PM