కొత్త సుప్రీం నాయకుడిని ఎన్నుకున్న ఇరాన్!
ABN , Publish Date - Mar 08 , 2026 | 05:57 PM
ఇజ్రాయెల్, అమెరికా జరిపిన సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణం తర్వాత కొత్త నేతను ఎన్నుకునేందుకు అక్కడి ప్రభుత్వంలోని అగ్ర నేతలు ప్రయత్నిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్, అమెరికా జరిపిన సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్(Iran Supreme Leader) అయతుల్లా అలీ ఖమేనీ మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణం తర్వాత కొత్త నేతను ఎన్నుకునేందుకు అక్కడి ప్రభుత్వంలోని అగ్ర నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఖమేనీ వారసుడిని ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. కానీ కొత్త నాయకుడి పేరు ఇంకా బహిరంగంగా ప్రకటించలేదు. ఈ ఎన్నిక కోసం ఇరాన్‌లోని అతిపెద్ద పాలక వ్యవస్థ అయిన అసెంబ్లీ ఇవాళ(ఆదివారం) సమావేశమైంది. మత గురువులు ఈ అసెంబ్లీలో నిపుణులుగా ఉన్నారని సమాచారం.
ఇరాన్ కొత్త నాయకుడి ఎన్నిక కోసం 88 మందికి సభ్యత్వం ఉంటుంది. అన్ని నిబంధనలు, మార్గదర్శకాల్ని అనుసరించి మాత్రమే కొత్త సుప్రీం లీడర్ పేరును ప్రకటించాల్సి ఉంటుంది. ఇందుకోసం 88 మంది సభ్యులు వ్యక్తిగతంగా అసెంబ్లీకి రావాలి. కానీ, ప్రస్తుత పరిస్తితుల్లో ఇది సాధ్యం కాదని కొందరు ఇరాన్ ముఖ్య నేతలు అంటున్నారు. భద్రతా కారణాల రీత్యా అందరూ ఒకేచోటుకు రావడం వీలుకాదని కొందరు అభిప్రాయ పడుతున్నారు. అందుకే కొత్త నేతను ఎన్నుకున్నప్పటికీ పేరును మాత్రం అధికారికంగా ప్రకటించడం లేదని సమాచారం.
తన తర్వాత కొత్త నేతను నాయకుడిగా ఎన్నుకోవాలంటే అతడిని ఇరాన్ శత్రువుల అతిగా ద్వేషించేవాడై ఉండాలని ఖమేనీ చెప్పినట్లు అయతుల్లా మోహ్సేన్ హైదరి అన్నాడు. అమెరికా కూడా అతడి పేరు చెప్పి ఉండాలని సూచించినట్లు ఆయన తెలిపాడు. ఖమేనీ ఆలోచనలకు తగిన నేతనే ఎన్నుకుంటామని తెలిపాడు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. అయతుల్లా ఖమేనీ కొడుకు మొజ్తాబా ఖమేనీనే సుప్రీం నేతగా ఎన్నుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, అతడి ఎంపికను తాను వ్యతిరేకిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump reaction) అన్నాడు.
ఇదే సమయంలో ఇజ్రాయెల్ గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ గా ఎవరు ఉన్నా.. చంపేస్తామని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్‌తో ఇరాన్ తన ఘర్షణను కొనసాగిస్తే, తదుపరి సుప్రీం లీడర్ తమకు లక్ష్యంగా మారతారని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ అన్నారు. కొత్త నాయకుడిని నియమించడంలో పాల్గొన్న వారూ ఇలాంటి బెదిరింపులే ఎదుర్కోవలసి ఉంటుందని ఇజ్రాయెల్ సైన్యం కూడా హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి:
ఏపీలో పలుచోట్ల రెస్టారెంట్లపై ఐటీ దాడులు..
భగవద్గీతలో మాట తప్పని మడము తిప్పని అని మాటలేంటి?: స్వామి శ్రీనివాసానంద సరస్వతి