Share News

ఇది యుద్ధమా? ప్రళయమా? ఇరాన్‌లో భయానక దృశ్యాలు

ABN , Publish Date - Mar 08 , 2026 | 05:07 PM

టెహ్రాన్‌లో ఇంధన నిల్వ కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇది యుద్ధమా? ప్రళయమా? అంటూ జనాలు నివ్వెరపోయేలా చేస్తున్నాయి.

ఇది యుద్ధమా? ప్రళయమా? ఇరాన్‌లో భయానక దృశ్యాలు
Israel airstrikes Tehran fuel depots

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌లో ఇంధన నిల్వ కేంద్రాలే లక్ష్యంగా శనివారం రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. టెహ్రాన్‌తో పాటు సమీపంలోని కరాజ్ ప్రాంతాన్నీ టార్గెట్ చేసింది. ఈ దాడి అనంతర దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది యుద్ధమా? లేక ప్రళయమా? అంటూ నెటిజన్లు వీడియోలను చూసి నోరెళ్లబెడుతున్నారు.

ఇజ్రాయెల్ దాడులతో భారీ విధ్వంసం జరిగింది. ఇంధన నిల్వ కేంద్రాల్లో భారీ ఎత్తున అగ్నికీలలు ఎగసిపడ్డాయి. అంత రాత్రివేళ కూడా అగ్నికీలల కాంతిలో దట్టమైన పొగ కనుచూపు మేర అంతా వ్యాపిస్తూ భయానక దృశ్యాన్ని ఆవిష్కరింపజేసింది. సమీపంలోని రహదారులపై ప్రయాణించిన అనేక మంది ఈ దృశ్యాలను రికార్డు చేసి నెట్టింట పంచుకున్నారు. అగ్ని జ్వాలలు నగర వీధులను కబళిస్తున్నట్టుగా ఆ దృశ్యాలు కనిపించాయని స్థానికులు వ్యాఖ్యానించారు. ఈ వీడియోలు ప్రస్తుతం నెట్టింట కలకలం రేపుతున్నాయి.


దాడుల తరువాత నగరంపై వర్షం పడిందని, చమురు, దుమ్మూధూళి కలగలిసిన నీటి బిందులు నల్లగా కనిపించాయని అంతర్జాతీయ మీడియా రిపోర్టర్ ఒకరు వ్యాఖ్యానించారు. టెహ్రాన్, చుట్టు పక్కల ప్రాంతాల్లోని ఐదు ఇంధన నిల్వ కేంద్రాలపై ఈ దాడులు జరిగాయి.

టెహ్రాన్‌లోని అగ్నిమాపక సిబ్బంది రాత్రంతా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారట. ఈ ఘటన కారణంగా ఇంధన రవాణా తాత్కాలికంగా నిలిచిపోయిందట. ఏమేరకు నష్టం జరిగిందనే విషయాన్ని అధికారులు తెలుసుకుంటున్నారు. ఇజ్రాయెల్ దాడులు చేసిందని చెప్పిన ఇరాన్ తమ ఇంధన నిల్వలకు మాత్రం ఎలాంటి ఢోకా లేదని పేర్కొంది. ఇక ఈ ఉదంతంపై ఇజ్రాయెల్ కూడా స్పందించింది. ఇవి హెచ్చరికగా చేసిన దాడులు మాత్రమేనని చెప్పింది. ఇరాన్ సుప్రీం లీడర్ తరువాత నాయకుడి ఎన్నికల ప్రక్రియలో పాలు పంచుకునే వారిపై దాడి తప్పదని హెచ్చరించింది.


ఇవీ చదవండి:

ఇరాన్‌కు ప్రత్యేక దళాలను పంపే యోచనలో యూఎస్.. మీడియాలో కథనాలు

అతడెవరో కూడా తెలియదు, ఆ హెచ్చరికలను లెక్కచేయను: ట్రంప్

Updated Date - Mar 08 , 2026 | 05:47 PM