Share News

అతడెవరో కూడా తెలియదు, ఆ హెచ్చరికలను లెక్కచేయను: ట్రంప్

ABN , Publish Date - Mar 08 , 2026 | 02:41 PM

ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శ అలీ లారిజానీ తాజాగా చేసిన హెచ్చరికలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. అతడు ఎవరో కూడా తనకు తెలియదని అన్నారు.

అతడెవరో కూడా తెలియదు, ఆ హెచ్చరికలను లెక్కచేయను: ట్రంప్
Trump Ali Larijani warning response

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజానీ తాజాగా ఇచ్చిన వార్నింగ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అలీ ఎవరో కూడా తనకు తెలియదని అన్నారు. ఆ హెచ్చరికలను పట్టించుకోనని స్పష్టం చేశారు. ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ కామెంట్స్ చేశారు. సుప్రీం లీడర్ ఖమేనీ మృతికి కారణమైన ట్రంప్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అలీ లారిజానీ హెచ్చరించిన విషయం తెలిసిందే. ‘అతను మాట్లాడేదేంటో నాకు అర్థం కావట్లేదు. అసలు అతను ఎవరు? అతని వార్నింగ్స్‌ను నేను లెక్క చేయను’ అని అన్నారు. బేషరతుగా ఇరాన్ లొంగిపోయే వరకూ దాడులు కొనసాగుతాయని మరోసారి స్పష్టం చేశారు.

ఇరాన్ జాతీయ భద్రతా మండలి నేత అలీ లారిజానీ గతంలో ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్‌లో కూడా పనిచేశారు. ఇటీవల ఆయన ట్రంప్‌నకు ఎక్స్ వేదికగా హెచ్చరికలు చేశారు. ‘ట్రంప్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆయన చేసిన పనికి మూల్యం చెల్లించుకోక తప్పదు. మా లీడర్‌ మృతికి ఆయనే కారణం. మా ప్రజల్లో సుమారు 1000 మంది అమెరికా దాడుల్లో నేలకొరిగారు. ఇది సామాన్యమైన విషయం కాదు’ అని అన్నారు.


అమెరికా, ఇజ్రాయెల్‌లు కలిసి ఇరాన్‌ను విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నాయని అలీ లారిజానీ ఆరోపించారు. మౌలికస్థాయిలో ఇరాన్ పతనం కోసం ప్రయత్నిస్తున్నాయని అన్నారు. వెనెజువెలా వలెనే ఇరాన్ విషయం త్వరగా ముగిసిపోతుందని అమెరికా అనుకున్నప్పటికీ అలా జరగలేదని చెప్పారు. పశ్చిమాసియా, ఇరాన్ నేపథ్యం గురించి అమెరికన్లు అర్థం చేసుకోలేకపోయారని అన్నారు. ఇక ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్‌కు మరిన్ని సర్‌ప్రైజ్‌లు ఇవ్వబోతున్నామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ తాజాగా హెచ్చరించారు.


ఈ వార్తలూ చదవండి:

ఇరాన్‌కు ఇజ్రాయెల్ ప్రధాని వార్నింగ్

ట్రంప్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.. ఇరాన్ లీడర్ హెచ్చరిక

Updated Date - Mar 08 , 2026 | 04:33 PM