Share News

ఇరాన్‌కు ఇజ్రాయెల్ ప్రధాని వార్నింగ్

ABN , Publish Date - Mar 08 , 2026 | 01:19 PM

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ ఇరాన్‌ను మరోసారి హెచ్చరించారు. ఇరాన్‌ కోసం మరిన్ని సర్‌ప్రైజ్‌లు ఎదురు చూస్తున్నాయని అన్నారు. అక్కడి నిరంకుశ పాలన అంతమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఇరాన్‌కు ఇజ్రాయెల్ ప్రధాని వార్నింగ్
Israel PM Warning to Iran

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. శనివారం ఇరు వర్గాల మధ్య భీకర స్థాయిలో దాడులు జరిగాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ముడి చమురు నిల్వ కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో ఉవ్వెత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ ఇరాన్‌కు గట్టి హెచ్చరికలు చేశారు. ఇరాన్‌కు భవిష్యత్తులో మరిన్ని సర్‌ప్రైజులు ఇస్తామని హెచ్చరించారు. ఇరాన్‌పై దాడులు కొనసాగుతాయని అన్నారు. అక్కడ నిరంకుశ పాలన అంతానికి తమ వద్ద ప్రణాళిక ఉందని చెప్పుకొచ్చారు.

ఇరాన్‌‌ను విభజించాలని తాము కోరుకోవట్లేదని ఇజ్రాయెల్ ప్రధాని స్పష్టం చేశారు. ఆ దేశానికి స్వేచ్ఛ కల్పించాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. ఇరు దేశాలు అంతిమంగా మిత్ర దేశాలు అవుతాయని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. నిరంకుశ పాలనపై ఇరాన్ ప్రజలు తిరగబడాల్సిన సమయం దగ్గర్లోనే ఉందని కూడా అన్నారు. నిరంకుశత్వం నుంచి విముక్తి పొందడం ఇరాన్ ప్రజలపైనే ఆధారపడి ఉందని కామెంట్ చేశారు.


మరోవైపు, ఇరాన్ దాడులు కొనసాగుతునే ఉన్నాయి. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలపై తాము దాడులు చేస్తున్నామని ఇరాన్ ప్రకటించుకుంది. బహ్రెయిన్‌లోని అమెరికాకు చెందిన జుఫెయిర్ బేస్‌పై దాడి చేశామని ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ దళం ప్రకటించింది. తమ నీటి శుద్ధి కేంద్రంపై ఈ స్థావరం నుంచే దాడి జరిగిందని తెలిపింది. మరోవైపు, ఇరాన్ మిసైల్ దాడుల నేపథ్యంలో జెరూసలెంతో పాటు ఖతర్‌లో దోహాలో హెచ్చరిక సైరెన్లు పలుమార్లు మోగాయి.


ఈ వార్తలూ చదవండి:

ట్రంప్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.. ఇరాన్ లీడర్ హెచ్చరిక

అలాంటి వారు మాకు అక్కర్లేదు.. యూకే ప్రధానిపై ట్రంప్ ఫైర్

Updated Date - Mar 08 , 2026 | 01:38 PM