లెబనాన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. 19 మంది మృతి
ABN , Publish Date - Mar 08 , 2026 | 05:22 PM
లెబనాన్ రాజదాని బీరుట్‌పై ఇజ్రాయెల్ ఆదివారంనాడు బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో సర్ అల్ ఘార్బియా టౌన్‌లోని మూడంతస్తుల భవనం కుప్పకూలడంతో సుమారు 19 మంది మృతిచెందారు.
బీరుట్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ ఆదివారంనాడు బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో సర్ అల్ ఘార్బియా (Sir al Gharbiya) టౌన్‌లోని మూడంతస్తుల భవనం కుప్పకూలడంతో సుమారు 19 మంది మృతిచెందారు. వీరిలో పలువురు మహిళలు, పిల్లలు కూడా ఉన్నట్టు అల్ జజీరా వార్తాసంస్థ తెలిపింది. సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీస్తున్నారు. ప్రాంతీయ ఉద్రిక్తతల వేళ హెజ్‌బుల్లా ఉగ్రవాదులు రాకెట్ దాడులకు దిగుతుండటంతో ఇజ్రాయెల్ తమ దాడులను లెబనాన్‌కు విస్తరించింది.
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కూడ్స్ ఫోర్స్ (Quds Force) లెబనీస్ బ్రాంచ్ లక్ష్యంగా దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ఆదివారంనాడు ఈ దాడులు జరిపింది. ఐఆర్‌జీసీలోని ఒక ఎలైట్ విభాగంగా ఈ కూడ్స్ ఫోర్స్ పనిచేస్తోంది. మధ్యప్రాచ్యంలో ప్రాక్సీ గ్రూపులకు ఈ ప్రత్యేక విభాగం మద్దతిస్తుంటుంది.
ఇరాన్‌కు భవిష్యత్తులో మరిన్న సర్‌ప్రైజ్‌లు ఇస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు తాజాగా ఇరాన్‌కు హెచ్చరికలు చేసిన నేపథ్యంలో లెబనాన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్‌ను విభజించాలని తాము కోరుకోనప్పటికీ నిరంకుశ పాలకుల నుంచి దేశానికి స్వేచ్ఛ కల్పించడం తమ లక్ష్యమని నెతన్యాహు తెలిపారు. లెబనాన్ భూభాగం నుంచి ఇరాన్ టెర్రరిస్టు శక్తులు తమపై దాడులకు దిగడాన్ని సహించేది లేదని ఇజ్రాయెల్ బలగాలు తాజా హెచ్చరికలు జారీ చేశాయి.
ఇవి కూడా చదవండి..
ఇరాన్‌కు ఇజ్రాయెల్ ప్రధాని వార్నింగ్
ఇది యుద్ధమా? ప్రళయమా? ఇరాన్‌లో భయానక దృశ్యాలు