Share News

ఎన్విడియా సీఈవో అఫైర్.. ఏడాది క్రితమే ట్రంప్‌నకు తెలుసా..

ABN , Publish Date - Nov 11 , 2026 | 09:41 AM

చైనాకు చెందిన ఓ మహిళతో ఎన్విడియా సంస్థ సీఈవో జెన్సన్ హువాంగ్‌కు సంబంధం ఉన్నట్టు బయటపడడం అమెరికాలోనే కాదు.. అంతర్జాతీయ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఎన్విడియా సీఈవో అఫైర్.. ఏడాది క్రితమే ట్రంప్‌నకు తెలుసా..
Jensen Huang, Donald Trump

ఇంటర్నెట్ డెస్క్: చైనాకు చెందిన ఓ మహిళతో ఎన్విడియా సంస్థ సీఈవో జెన్సన్ హువాంగ్‌కు సంబంధం ఉన్నట్టు బయటపడడం అమెరికాలోనే కాదు.. అంతర్జాతీయ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌నకు ఏడాది క్రితమే సమాచారం ఉందని డెమోక్రటిక్ పార్టీ నేత, సెనేట్ మైనారిటీ నాయకుడు చక్ షుమర్ వెల్లడించడం మరింత సంచలనంగా మారింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పర్యవేక్షణలో రూపొందిన రహస్య నిఘా నివేదిక ద్వారా ఈ విషయం ట్రంప్‌నకు తెలిసిందని ఆయన తెలిపారు (Nvidia CEO Chinese Spy).


జెన్సన్ హువాంగ్‌కు ఆలిస్ హువాంగ్ అనే చైనా మహిళతో సన్నిహిత సంబంధం ఉన్నట్లు బయటపడింది. జెన్సన్ కూడా ఈ విషయాన్ని అంగీకరించారు. ఆలిస్ హువాంగ్‌కు చైనా విదేశీ నిఘా వ్యవస్థతో సంబంధాలు ఉన్నాయని, ముఖ్యంగా చైనా ప్రభుత్వ భద్రతా మంత్రిత్వ శాఖతో ఆమె నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని అమెరికా నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ సమాచారం ఏడాది క్రితమే ట్రంప్‌నకు చేరినట్టు సమాచారం. 2025 చివర్లోనే ఎఫ్‌బీఐ అధికారులు ఈ సమాచారాన్ని చట్ట సభ్యులకు ఇచ్చారని తెలుస్తోంది (Jensen Huang Donald Trump).


ఈ వ్యవహారంపై అమెరికా డెమోక్రటిక్ నేత చక్ షుమర్ తీవ్రంగా స్పందించారు. జెన్సన్ హువాంగ్‌కు చైనా గూఢచారిగా అనుమానిస్తున్న మహిళతో సంబంధం ఉన్నట్లు ఏడాది క్రితమే ట్రంప్‌‌నకు సమాచారం అందినప్పటికీ ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అమెరికా జాతీయ భద్రతను కాపాడాల్సిన అధ్యక్షుడు తన స్నేహితులను కాపాడటంలో బిజీగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఎన్విడియా వంటి జాతీయ భద్రతకు కీలకమైన సంస్థ అధిపతిపై ఇలాంటి అనుమానాలు వచ్చినప్పుడు ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సి ఉందన్నారు (US China Relations).


హువాంగ్‌ను ట్రంప్ బీజింగ్ పర్యటనకు తీసుకెళ్లడం, చైనాకు అత్యాధునిక ఏఐ చిప్స్ విక్రయించేందుకు ఆయన సలహాలను పరిగణనలోకి తీసుకోవడం వంటి అంశాలపై కూడా షుమర్ (Chuck Schumer) ప్రశ్నలు లేవనెత్తారు. అంతేకాకుండా ఎన్విడియా నుంచి ట్రంప్ వైట్‌హౌస్ బాల్‌రూమ్ ప్రాజెక్టుకు 2.5 కోట్ల డాలర్ల విరాళం అందిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌కు పూర్తి వివరాలు వెల్లడించాలని, అమెరికా నిఘా సంస్థల నుంచి సెనేట్, ప్రతినిధుల సభ నిఘా కమిటీలకు వెంటనే సమాచారం అందించాలని డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి..

యుద్ధానికి ముగింపు పలకాలంటే.. అమెరికాకు ఇరాన్ ఏం చెప్పిందంటే..


స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే...

Updated Date - Nov 11 , 2026 | 11:10 AM