Share News

ఆ డైరెక్టర్ చిత్రాలపై ఆస్కార్ విజేత క్రిస్టోఫర్ నోలన్ ప్రశంసల జల్లు

ABN , Publish Date - Jul 26 , 2026 | 07:52 PM

ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత క్రిస్టోఫర్ నోలన్ భారతీయ సినిమాపై మరోసారి తన మక్కువను చాటుకున్నారు. ముఖ్యంగా లెజెండరీ ఫిల్మ్‌మేకర్ సత్యజిత్ రే ప్రతిభను, ఆయన చిత్రాలపై ప్రశంసల జల్లు కురిపించారు.

ఆ డైరెక్టర్ చిత్రాలపై ఆస్కార్ విజేత క్రిస్టోఫర్ నోలన్ ప్రశంసల జల్లు
Christopher Nolan

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత క్రిస్టోఫర్ నోలన్ భారతీయ సినిమాపై మరోసారి తన మక్కువను చాటుకున్నారు. ముఖ్యంగా లెజెండరీ ఫిల్మ్‌మేకర్ సత్యజిత్ రే ప్రతిభను, ఆయన చిత్రాలపై ప్రశంసల జల్లు కురిపించారు. న్యూయార్క్‌లోని 'క్రిటేరియన్ కలెక్షన్'లో ఉన్న ప్రసిద్ధ 'క్రిటేరియన్ క్లోసెట్'ను నోలన్ సందర్శించారు. ఈ సందర్భంగా నోలన్ సత్యజిత్ రేకు చెందిన ప్రఖ్యాత 'ది అపు ట్రిలజీ' (The Apu Trilogy) చిత్రాలను ఎంపిక చేసుకున్నారు.


ఈ సందర్భంగా క్రైటేరియన్ కలెక్షన్ విడుదల చేసిన వీడియోలో నోలన్ మాట్లాడుతూ.. సత్యజిత్ రే భారతీయ చలనచిత్ర రంగానికి అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. రేను అత్యంత గొప్ప భారతీయ దర్శకులలో ఒకరిగా అభివర్ణించారు. 'సత్యజిత్ రే తెరకెక్కించిన 'ది అపు ట్రిలజీ' అద్భుతం. ఈ సిరీస్‌లోని మొదటి చిత్రమైన 'పథేర్ పాంచాలి' (Pather Panchali) నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సినిమా చూసి నేను మైమరిచిపోయాను. అయితే ఈ ట్రిలజీలో రెండు, మూడు భాగాలను నేను ఇంకా చూడలేదు. అందుకే ఈ బాక్స్‌ను తీసుకుని ఆ కథను పూర్తిగా చేయాలని ఎంతో ఆసక్తిగా ఉన్నాను' అని నోలన్ ఆనందం వ్యక్తం చేశారు.


సత్యజిత్ రే రూపొందించిన 'ది అపు ట్రిలజీ'లో పథేర్ పాంచాలి (1955), అపరాజితో (1956), అపుర్ సంసార్ (1959) సినిమాలు ఉన్నాయి. ప్రఖ్యాత బెంగాలీ రచయిత విభూతిభూషణ్ బంధోపాధ్యాయ నవలల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాలు గ్రామీణ బెంగాల్‌లో అపు బాల్యం నుంచి యవ్వనం వరకు సాగే ప్రయాణాన్ని కళ్లకు కట్టాయి. కేన్స్, వెనిస్ వంటి అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలతో పాటు జాతీయ అవార్డులను కూడా ఈ సినిమాలు దక్కించుకున్నాయి. కాగా, ఇదే సందర్శనలో మార్టిన్ స్కోర్సెసీ, ఫ్రిట్జ్ లాంగ్, స్పైక్ లీ, డేవిడ్ లించ్ వంటి దిగ్గజ దర్శకుల చిత్రాలను కూడా నోలన్ ఎంపిక చేసుకున్నారు.


ఇవి కూడా చదవండి:

మరో వీడియో రిలీజ్ చేసిన ప్రధాని మోదీ.. పరీక్షల సంస్కరణలపై కీలక నిర్ణయం

మద్యం మత్తులో కన్నబిడ్డల ముందే భార్యను నరికి చంపిన భర్త

Updated Date - Jul 26 , 2026 | 08:21 PM