Share News

ప్రతిపక్షాలు చెప్పింది వినడం అలవాటు చేసుకోవాలి: పీఎంకు సీఎం రేవంత్ సూచన

ABN , Publish Date - Jul 26 , 2026 | 07:41 PM

దేశంలో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పోరాటం మొదలైందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దేశం మారుతోంది.. ప్రతిపక్షాలు చెప్పింది వినడం కూడా అలవాటు చేసుకోవాలని ప్రధాని మోదీకి ఆయన హితవు పలికారు.

ప్రతిపక్షాలు చెప్పింది వినడం అలవాటు చేసుకోవాలి: పీఎంకు సీఎం రేవంత్ సూచన

హైదరాబాద్, జులై 26: దేశంలో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పోరాటం మొదలైందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దేశం మారుతోంది.. ప్రతిపక్షాలు చెప్పింది వినడం కూడా అలవాటు చేసుకోవాలని ప్రధాని మోదీకి ఆయన హితవు పలికారు. ఆదివారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నిన్న ఢిల్లీలో నరేంద్ర మోదీ, భారత ప్రభుత్వం ఓడిపోయిందని చెప్పారు. ప్రధాని మోదీకి ఈ ఓటమి మొదటిది కాదని.. రెండోదని గుర్తు చేశారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌కు తాకట్టుపెట్టే నల్ల చట్టాలు తెచ్చే ప్రయత్నం మోదీ చేశారని విమర్శించారు.

ఈ చట్టాలు వాపస్ తీసుకుని రైతులకు క్షమాపణ చెప్పాలని గతంలో రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని అన్నారు. రైతుల పోరాటంతో ఆ నల్ల చట్టాలను వెనక్కి తీసుకుని రైతులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పారని గుర్తు చేశారు. ఇలా ప్రధాని మోదీని రైతులు మొదటిసారి ఓడించారని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ కొంచెమైనా గుణపాఠం నేర్చుకుని ఉంటారని తామంతా భావించామని అన్నారు. తద్వారా పార్లమెంట్‌లో చర్చకు ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తారని అనుకున్నామన్నారు.


సీబీఎస్‌ఈ (CBSE), నీట్ (NEET) పరీక్షల నిర్వహణలో కేంద్రం విఫలమైందని తెలంగాణ సీఎం విమర్శించారు. ఈ అంశంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని.. పేపర్ లీక్ దోషులను జైలుకు పంపాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కోరితే వినలేదని తెలిపారు. దీనిపై ప్రశ్నిస్తే సీబీఐ, ఈడీ చేత బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ దేశ యువత తమ సత్తా చూపించారని హర్షం వ్యక్తం చేశారు. దీంతో ప్రధాని మోదీని వారు ఓడించారని వివరించారు.


యువ శక్తి దెబ్బకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని పేర్కొన్నారు. దీంతో ఆయన రాజీనామా డిమాండ్ నెరవేరిందని తెలిపారు. కానీ మూడు డిమాండ్లు ఇంకా మిగిలే ఉన్నాయని గుర్తు చేశారు. యువత లేకుండా మీరు చెప్పే సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ సాధ్యం కాదని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో యువకుల ప్రాధాన్యం ఎందుకు లేదని ఈ సందర్భంగా ప్రధాని మోదీని ఆయన సూటిగా ప్రశ్నించారు.


యువకులు సడక్ వదిలి, సంసద్‌ (పార్లమెంట్)కు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. యువకులు 21 ఏళ్లకే చట్టసభలకు వచ్చేలా చట్టంలో మార్పులు తీసుకురావాలని ఆయనకు సీఎం రేవంత్ సూచించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 61వ రాజ్యాంగ సవరణ ద్వారా18 ఏళ్లకే ఓటు వేసే అవకాశం కల్పించారని గుర్తు చేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్థానిక సంస్థల్లో పోటీ అర్హత వయస్సు 21 ఏళ్లకు తగ్గించారని వివరించారు.


అలాగే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత వయస్సు 21 ఏళ్లకు తగ్గించాలని ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శాసన మండలి (కౌన్సిల్‌)తోపాటు రాజ్యసభకు 25 ఏళ్లు ఉండేలా చట్ట సవరణ చేయాలని స్పష్టం చేశారు. ఆగస్టులో తెలంగాణ అసెంబ్లీ, శాసన మండలి ఉమ్మడి సమావేశాలు నిర్వహిస్తామని అన్నారు. వీటి వేదికగా చట్టసభలకు పోటీ చేసే వయస్సును కుదించే అంశంపై చర్చిస్తామన్నారు. దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి బిల్లు పంపిస్తామని తెలిపారు.


చట్టాలు రూపొందించడంలో, వాటిని అమలు చేయడంలో యువకుల పాత్ర ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. యువకులే ఈ దేశ భవిష్యత్ అని అభివర్ణించారు. ప్రతిపక్షాలను సీబీఐ, ఈడీ వంటి సంస్థలతో బెదిరించవచ్చు.. కానీ దేశ యువతను మాత్రం భయపెట్టలేరని ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో చట్ట సభల్లో పోటీ చేసే వయస్సును సవరించే బిల్లును తీసుకురావాలని ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం: ఏపీ టీడీపీ చీఫ్

భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని.. షెడ్యూల్ ఇదిగో..

For More TG News And Telugu News

Updated Date - Jul 26 , 2026 | 07:47 PM