ఏపీకి రండి.. అమెరికన్ ఐటీ పారిశ్రామికవేత్తలకు ఏపీటీఎస్ ఛైర్మన్ పిలుపు
ABN , Publish Date - Mar 27 , 2026 | 08:49 PM
అమెరికాలోని ఐటీ పారిశ్రామికవేత్తలతో ఏపీటీఎస్ ఛైర్మన్ మోహన కృష్ణ సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టి.. రాష్ట్ర ప్రగతి పథంలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా వారికి పిలుపునిచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో.. అమెరికాలోని ప్రముఖ ఐటీ పారిశ్రామికవేత్తలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్(APTS) ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ కోరారు. న్యూజెర్సీలో ప్రవాసాంధ్ర ఐటీ పారిశ్రామికవేత్తలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై ముఖాముఖి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మోహన కృష్ణ మాట్లాడుతూ.. 'సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేశ్‌ల ఆధ్వర్యంలో ఐటీ రంగం వేగంగా అడుగులు వేస్తోంది. గతంలో హైదరాబాద్‌ను ఐటీ మ్యాప్‌లో నిలబెట్టినట్లుగా.. ఇప్పుడు ఏపీని టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్‌గా మారుస్తున్నారు. ఈ ప్రయాణంలో మీరంతా భాగస్వాములు కావాలి' అని కోరారు.
ఏపీలో సరికొత్త అవకాశాలు
రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలు, రాజధాని అమరావతిలో రాబోతున్న ప్రతిష్ఠాత్మక 'క్వాంటం వ్యాలీ' ప్రాజెక్టుల గురించి కూడా మోహన కృష్ణ వివరించారు. అమరావతిని ప్రపంచ స్థాయి ఐటీ, రీసెర్చ్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని.. ఈ అత్యాధునిక సాంకేతిక సౌకర్యాల వల్ల ఐటీ కంపెనీలకు ఏపీ ఓ అద్భుత వేదిక అవుతుందని పారిశ్రామికవేత్తలకు వివరించారు.
'మీరు అమెరికాలో సాధించిన విజయం మనందరికీ గర్వకారణం. అదే స్ఫూర్తితో మన మాతృభూమి అభివృద్ధికి తోడ్పడండి. మీరు ఏపీలో కంపెనీలు ఏర్పాటు చేస్తే, రాష్ట్ర యువతకు ఉపాధి లభిస్తుంది. మీకు కావాల్సిన అన్ని అనుమతులు, మౌలిక సదుపాయాలను ప్రభుత్వం తరఫున మేం సమకూరుస్తాం' అని ఏపీటీఎస్ ఛైర్మన్ భరోసా ఇచ్చారు. ఆయన విజ్ఞప్తికి ఐటీ పారిశ్రామికవేత్తలు సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు తమకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయని, త్వరలోనే క్షేత్రస్థాయిలో ఉన్న అవకాశాలను పరిశీలించి.. ఏపీ ప్రగతి పథంలో భాగస్వాములయ్యేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఇవీ చదవండి:
ఇంధన సమస్యల పర్యవేక్షణకు కేంద్ర మంత్రులతో కమిటీ
ఎరువుల కొరత లేదు, ఆందోళన వద్దు: లోక్‌సభలో జేపీ నడ్డా