Share News

ఆ విషయంపై ఇరాన్ సీరియస్.. గల్ఫ్ దేశాలకు వార్నింగ్!

ABN , Publish Date - Mar 27 , 2026 | 08:03 PM

పశ్చిమాసియాలోని పలు అమెరికన్ సైనిక స్థావరాలపై దాడులు జరగడంతో.. ఆ సైనికులకు గల్ఫ్‌లోని హోటళ్లు ఆశ్రయం కల్పిస్తే వాటిని లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ముఖ్యంగా బహ్రెయిన్, యూఏఈలోని హోటళ్ల యజమానులకు ఈ హెచ్చరికలు జారీచేసినట్టు తెలుస్తోంది.

ఆ విషయంపై ఇరాన్ సీరియస్.. గల్ఫ్ దేశాలకు వార్నింగ్!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇరాన్‌పై ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికా చర్చల పేరుతో కాస్త విరామమిచ్చింది. అయితే.. ఇజ్రాయెల్ మాత్రం టెహ్రాన్ చమురు కేంద్రాలు, బాలిస్టిక్ మిసైల్స్ స్థావరాలే లక్ష్యంగా భీకర దాడులు కొనసాగిస్తోంది. మరోవైపు ఇరాన్ కూడా ప్రతీకార దాడులతో విరుచుకుపడుతూ దీటుగా జవాబిస్తోంది. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాలకు తీవ్ర హెచ్చరికలు జారీచేసింది ఇరాన్. తమ దేశంపై దాడులు చేస్తున్న వారికి గల్ఫ్‌ దేశాల్లోని హోటళ్లలో ఆశ్రయమివ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ రకమైన చర్యలను వెంటనే నిలిపివేయాలని.. అలాగే కొనసాగిస్తే మరోసారి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.


‘ఇరాన్‌పై దాడిచేసిన స్థావరాలను విడిచిపెట్టిన చాలామంది అమెరికా సైనికులు ఐరోపాలోని పలు హోటళ్లు, కార్యాలయాలకు తరలివెళ్లారు. అక్కడి నుంచే యుద్ధంలో పాల్గొంటున్నారని మాకు సమాచారం ఉంది. మేం వాటిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తాం. ముందుగానే మీకు చెప్తున్నాం. అమెరికా సైనికులకు గల్ఫ్‌ దేశాల్లోని హోటళ్లలో ఆతిథ్యం ఇవ్వొద్దు. వ్యతిరేకిస్తే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది’ అని ఇరాన్‌ స్పష్టం చేసింది.


ఇప్పటికే అమెరికా నేవీ బేస్‌లను పలు గల్ఫ్‌ దేశాల్లో ఏర్పాటు చేసుకున్నందుకు ఆ దేశాలపై ఇరాన్ దాడులు చేసింది. దీంతో అమెరికా సైనికులు.. ఆ ప్రదేశాలను ఖాళీ చేయడంతో సుమారు 13 అమెరికన్ స్థావరాలు నిరుపయోగంగా మారాయి. గల్ఫ్ దేశాల హోటళ్లు అమెరికా సిబ్బందిని అనుమతించవద్దని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ చెప్పిన మరుసటి రోజే.. బహ్రెయిన్, యూఏఈల్లోని హోటల్ యజమానులకు ఈ హెచ్చరికలు జారీ అయినట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.


ఇవీ చదవండి:

కేబీసీలో రూ. 50 లక్షలు గెలిచి.. రూ. 2.5 కోట్ల స్కామ్‌లో అరెస్టై..

ఎరువుల కొరత లేదు, ఆందోళన వద్దు: లోక్‌సభలో జేపీ నడ్డా

Updated Date - Mar 27 , 2026 | 08:03 PM