ఇరాన్‌కు చెందిన 3 చమురు నౌకలపై అమెరికా ప్రతీకార దాడులు
ABN , Publish Date - Sep 05 , 2026 | 09:19 PM
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రస్థాయికి చేరాయి. అమెరికాకు చెందిన యుద్ధనౌకలపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేయడానికి ప్రయత్నించడంతో, అమెరికా ప్రతీకారదాడులకు దిగింది.
ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 5: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. అమెరికాకు చెందిన యుద్ధనౌకలపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేయడానికి ప్రయత్నించడంతో, అమెరికా ప్రతీకారదాడులకు దిగింది. ఇరాన్ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లపై విరుచుకుపడింది. ఈ విషయాన్ని యుఎస్ సెంట్రల్ కమాండ్ (USCENTCOM) అధికారికంగా ధ్రువీకరించింది.
అమెరికా నావికాదళంపై దాడికి యత్నం: అమెరికాకు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్, గైడెడ్-మిస్సైల్ డిస్ట్రాయర్‌లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. అయితే, అమెరికా నౌకలు ఈ దాడుల నుంచి సురక్షితంగా తప్పించుకున్నాయి. ఈ ఘటనలో ఏ ఒక్క అమెరికా సైనికుడికీ గాయాలు కాలేదని సెంట్రల్ కమాండ్ తెలిపింది.
3 ట్యాంకర్లపై అమెరికా ప్రతిదాడి: ఇరాన్ చర్యకు ప్రతిస్పందనగా ఖర్గ్ ఐలాండ్, జాస్క్ సమీపంలో IRGCకి చెందిన M/T డౌనీ (M/T Downy), M/T స్టార్క్ 1 (M/T Stark 1) అనే రెండు క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లను అమెరికా బలగాలు పూర్తిగా ధ్వంసం చేశాయి. వీటితో పాటు ఒమన్ గల్ఫ్‌లో ఖాళీగా ఉన్న మరొక ఆయిల్ ట్యాంకర్ మీద కూడా దాడి చేశాయి.
షాడో నెట్‌వర్క్‌కు దెబ్బ: ఈ మూడు ట్యాంకర్లు IRGC, దాని అనుబంధ తీవ్రవాద గ్రూపులకు నిధులు సమకూర్చే బిలియన్ డాలర్ల అక్రమ 'షాడో నెట్‌వర్క్'లో భాగమని అమెరికా అధికారులు వెల్లడించారు.
అమెరికా హెచ్చరిక
యుఎస్ సెంట్రల్ కమాండ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ ఇరాన్‌ను తీవ్రంగా హెచ్చరించారు. 'మా రెండు నౌకలపై మీరు దాడికి తెగబడితే, మేము మీ మూడు ట్యాంకర్లను ధ్వంసం చేసి అంతకంటే తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాం అనే సందేశం IRGCకి స్పష్టంగా వెళ్ళాలి. అమెరికా బలగాలను రక్షించుకోవడానికి, అవసరమైతే ఇరాన్ ఆయిల్ రవాణా నౌకాదళాన్ని పూర్తిగా నాశనం చేయడానికి మేం వెనుకాడబోం' అని కూపర్ స్పష్టం చేశారు.
ఇరాన్ స్పందన
ఖర్గ్ ద్వీపం సమీపంలో తమ ట్యాంకర్‌పై దాడి జరిగినట్లు ఇరాన్ స్థానిక వార్తా సంస్థ 'తస్నిమ్' పేర్కొంది. అయితే, సిబ్బందిని సురక్షితంగా ఖాళీ చేయించామని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని నివేదించింది.
ఓపెక్ (OPEC) కూటమిలో మూడో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు అయిన ఇరాన్‌కు ఖర్గ్ ఐలాండ్ అత్యంత కీలకమైనది. యుద్ధం మొదలవ్వడానికి ముందు ఇరాన్ తన క్రూడ్ ఆయిల్ ఎగుమతుల్లో దాదాపు 90 శాతాన్ని ఈ ఐలాండ్ ద్వారానే నిర్వహిస్తూ వచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ నిర్మాణాల నాణ్యత విషయంలో రాజీపడొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి
సన్నబియ్యం అమ్మితే రేషన్ కార్డు తొలగిస్తాం: మంత్రి తుమ్మల
రైతుల జీవితాలతో రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నారు.. హరీశ్‌రావు ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News