Share News

అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం డిజిటల్‌గా పూర్తయింది: జేడీ వాన్స్

ABN , Publish Date - Jun 15 , 2026 | 09:45 PM

అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం అధికారిక సంతకాలకు ముందే డిజిటల్‌గా పూర్తైందని యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ వెల్లడించారు. అయితే ఇరాన్ ఒప్పంద నిబంధనల్ని అమలు చేశాకే ఆంక్షల సడలింపులు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం డిజిటల్‌గా పూర్తయింది: జేడీ వాన్స్
JD Vance Claims US Iran Agreement Finalized Digitally

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి, అణు కార్యక్రమాల నియంత్రణ ఒప్పందంపై యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ విధానంలో ఇప్పటికే సంతకాలు పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు. ఓ అమెరికన్ టెలివిజన్ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఇరాన్‌కు ఇప్పటివరకు ఎలాంటి సడలింపులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. 'ఈ ఒప్పందం డిజిటల్‌గా ఇప్పటికే పూర్తైంది. అయితే.. ఇరాన్ ఈ నిబంధనల్ని అమలు చేశాకే ఆంక్షల సడలింపులు ఉంటాయి' అని వాన్స్ పేర్కొన్నారు.


ఇరాన్ వద్ద ఉన్న అధికంగా శుద్ధిచేసిన యురేనియం నిల్వలను తొలగించడం, అంతర్జాతీయ తనిఖీ వ్యవస్థకు పూర్తి సహకారం అందించడం వంటి చర్యలను ఆ దేశం చేపట్టాల్సి ఉంటుందని వాన్స్ వివరించారు. అణ్వాయుధాల తయారీ దిశగా ఇరాన్ ముందడుగు వేయకుండా ఉండేందుకు కఠినంగా పర్యవేక్షిస్తామని ఆయన చెప్పారు. ఒప్పంద నిబంధనలను పూర్తిగా పాటిస్తే ఇరాన్‌కు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మరలా భాగస్వామ్యం కల్పించే అవకాశాలుంటాయని వాన్స్ పేర్కొన్నారు.


కాగా.. అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన దాని ప్రకారం, ఈ ఒప్పందంపై అధికారిక సంతకాల కార్యక్రమం ఈ నెల 19న జెనీవా(స్విట్జర్లాండ్)లో జరగనుంది. అదే రోజున సదరు అగ్రిమెంట్లపై అధికారికంగా సంతకాలు చేయనున్నట్టు ఇరాన్ కూడా ధ్రువీకరించింది. అయితే.. ఈ కార్యక్రమం ప్రత్యక్షంగా జరుగుతుందా లేదా వర్చువల్‌గా నిర్వహిస్తారా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఒప్పంద కార్యక్రమంలో ఇరాన్ తరఫున పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఘాలిబాఫ్ లేదా విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ ఒప్పందం అమలులోకి వస్తే పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు దాదాపు తగ్గుముఖం పట్టే అవకాశముంది.


ఇవీ చదవండి:

పైలట్‌ డ్రెస్‌లో చిన్నారి.. ప్రేక్షకుల చూపు తిప్పుకోనివ్వలేదుగా.!

టూరిస్టుల విచిత్ర విన్యాసం.. కారుపై అర్ధనగ్న ప్రయాణం!

Updated Date - Jun 15 , 2026 | 09:53 PM